పాతబస్తీ నుంచి ప్రపంచ నంబర్ 1సిరాజ్ మియా సెన్సేషనల్ కమ్‌బ్యాక్
YouSay Short News App
‘రన్ మెషీన్’ పరుగుల ‘కర్ణుడు’...! ఇవీ కెరీర్ ఆరంభంలో సిరాజ్‌కు బిరుదులు. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు అదే సిరాజ్ వరల్డ్ నంబర్ 1 ODI బౌలర్.
హైదరాబాద్ పాతబస్తీలో ఆటో నడుపుకునే వ్యక్తి కుటుంబంలో పుట్టిన సిరాజ్ ఈ స్థాయికి ఊరికే రాలేదు. కన్నతండ్రి చనిపోయినప్పుడు ఆ దుఃఖాన్ని దిగమింగుకుని నాన్న ఆశయం కోసం పోరాడాలనే కసి అతడిని ఈ స్థాయికి తెచ్చింది.
విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి దేశవాళీ ట్రోఫీల్లో అద్భుత ప్రదర్శనతో IPLలో సన్‌రైజర్స్ జట్టులో చోటు సంపాదించడంతో మొదలైంది సిరాజ్ ప్రస్థానం.
ఆరంభం
సన్‌రైజర్స్ తరఫున వచ్చిన అవకాశంతో అతడి తొలి సీజన్‌లో 10 వికెట్లతో పరవాలేదనిపించాడు. కానీ బ్యాటర్లు అతడిని సులభంగా అంచనా వేయడంతో ధారాళంగా పరుగులు సమర్పించుకునేవాడు.
పాతబస్తీ గల్లీల్లో పెరిగిన సిరాజ్‌కు భాష కూడా సమస్యగా మారింది. ఎవరితోనూ కలవలేకపోవడం అతడిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆటను మెరుగుపర్చుకునే అవకాశం లేకుండా పోయింది.
ఆ తర్వాత సీజన్ సిరాజ్ RCBలో అడుగుపెట్టాడు. కోహ్లీ, డివిల్లీర్స్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కింది. కానీ ఆ జట్టులోనూ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటూ జట్టు ఓటమికి కారణమయ్యేవాడు. ఆ సీజన్‌లో కేవలం 7 వికెట్లు తీసి 9.5 రన్‌రేట్‌తో పరుగులు ఇచ్చాడు.
ఆ తర్వాత దేశవాళీలో ఆడిన సిరాజ్ పూర్తిగా పరిణతి పొందాడు. కరోనా సమయంలో UAEలో జరిగిన IPLలో సిరాజ్ ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. రన్‌మెషీన్‌గా వెక్కిరింతలు ఎదుర్కొన్నవాడే…వరుసగా 2 మెయిడెన్లు వేసిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
ఆ తర్వాత రంజీల్లో అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపికయ్యాడు. అక్కడ తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌటై భారత్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత.. రెండో టెస్టు నుంచి సిరాజ్ విజృంభించాడు.
ఆస్ట్రేలియా టూర్‌లో ఉండగానే తండ్రిని కోల్పోయిన సిరాజ్ ఆ బాధను దిగమింగుకుని ఆట కొనసాగించాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ సిరాజ్‌కు ఇచ్చిన మద్దతు అతడు ఎన్నటికీ మరిచిపోలేనిది. చివరి టెస్టులో 5 వికెట్లతో చెలరేగి తన తండ్రికి అంకితమిచ్చాడు.
2019 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వన్డే ఆరంగేట్రం చేశాడు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 76 పరుగులు సమర్పించుకున్నాడు. మళ్లీ 2022 ఫిబ్రవరి దాకా వన్డే జట్టులో సిరాజ్ కనిపించలేదు.
కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత సిరాజ్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అద్భుతమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ వేస్తూ 2022లో కేవలం 15 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీశాడు. అది కూడా అద్భుతమైన 4.61 ఎకానమీ రేట్‌తో.
ఇక 2023 సిరాజ్‌కు ఘనంగా మొదలైందనే చెప్పాలి. వరల్డ్ కప్ రాబోతున్న వేళ, బుమ్రా లేని లోటును పూడుస్తూ.. టీమిండియా బౌలింగ్ విభాగానికి నాయకుడిగా మారాడు. 5 మ్యాచుల్లోనే 14 వికెట్లు తీసి సెన్సేషనల్ రికార్డ్స్ నమోదు చేశాడు.
సిరాజ్ ఆడిన గత 10 మ్యాచుల్లో కనీసం ఒక్క వికెట్ అయినా తీసుకున్నాడు. అందుకే తాజాగా ICC ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఒకటో స్థానానికి ఎగబాకాడు.
మ్యాచ్‌లు - 21వికెట్లు - 38బెస్ట్ - 4/32ఎకానమీ - 4.62
వన్డేల్లో సిరాజ్ గణాంకాలు
నంబర్ 1 బౌలర్‌గా ఎదిగిన మన హైదరాబాదీ సిరాజ్ మియాకు YouSay శుభాకాంక్షలు చెబుతూ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తోంది.