పాకిస్థాన్‌లో వంటనూనె, నెయ్యి ధరలకు రెక్కలొచ్చాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో వీటి ధరలు ప్రియం అయ్యాయి. మరోవైపు దిగుమతులు కూడా భారమవుతుండటం పాకిస్థాన్ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ఇప్పటికే లీటరు నూనెపై రూ.30 వరకు ధరలు పెరిగాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మరో రూ.20 వరకు పెరిగే అవకాశం ఉంది. దాదాపు 90శాతం వంటనూనెలు దిగుమతులపైనే ఆధారపడుతున్న పాకిస్థాన్.. నిధుల కొరతతో సతమతమవుతోంది. కస్టమ్స్ గోదాముల్లో 3.58లక్షల టన్నుల వంటనూనె నిల్వ ఉన్నట్లు సమాచారం. అయితే, బ్యాంకులు ఎల్వోసీ క్లియర్ చేస్తేనే వీటిని ఉపయోగించొచ్చు.