Pawan Kalyan: పవన్ మంచి మనసు.. నటుడు భావోద్వేగం.. వీడియో వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను హీరో, పొలిటిషియన్‌గానే కాకుండా మంచి మనిషిగానూ ఫ్యాన్స్ అభిమానిస్తుంటారు. ఎవరికీ ఎటువంటి సాయం చేసినా ఆయన అస్సలు పబ్లిసిటీ కోరుకోరు. ప్రయోజనం పొందినవారు వాటిని బయటపెట్టినప్పుడు మాత్రమే అవి ప్రపంచానికి తెలుస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat)కు పవన్ సాయం చేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఆర్థికంగా అండగా నిలిచారు. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ స్వయంగా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పవన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
‘పవన్‌కు పాదాభివందనాలు’
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయి నడవలేని స్థితికి వెళ్లారు. వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతుండటంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రూ.2 లక్షలు అందించినట్లు ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. 'ప్రస్తుతం నాకు డయాలసిస్ జరుగుతోంది. నా భార్య పవన్ సార్‌ను కలవమంది. కలిస్తే మీకు ట్రీట్‌మెంట్ చేయిస్తారని చెప్పింది. నేను పవన్ సార్‌ను కలిసి నా పరిస్థితి వివరించా. ఆయన వెంటనే స్పందించి నాకు చికిత్స అందించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసి రూ.2 లక్షలు నా అకౌంట్‌లో డిపాజిట్ చేశారు. ఆయనకు నా పాదాభివందనం. ఆయన కుటుంబం బాగుండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా' అంటూ ఫిష్ వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు.
https://twitter.com/TeluguChitraalu/status/1874472450270118267
80కి పైగా చిత్రాల్లో..
హైదరాబాద్‌కు చెందిన ఫిష్ వెంకట్.. విలన్ పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. పలు చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి మంచి గుర్తింపు సంపాదించాడు. 2000లో వచ్చిన 'సమ్మక్క సారక్క' చిత్రంతో నటుడిగా అడుగుపెట్టిన ఆయన ఇప్పటివరకూ 80 పైగా చిత్రాల్లో నటించారు. గతేడాది వచ్చిన 'నరకాసుర' మూవీలో ఆయన మెరిశారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చికిత్సకు అధిక మెుత్తంలో ఖర్చవుతుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పవన్ అండగా నిలవడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పవన్ మంచి మనసును అభిమానులతో పాటు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
పవన్.. ఆర్థిక చేయూత
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాయం కోరి వచ్చిన ప్రతీ ఒక్కరికీ అండగా నిలుస్తుంటారు. ఇది పలు సందర్భాల్లో నిరూపితమైంది కూడా. ఫిష్ వెంకట్ సహా ఇండస్ట్రీలో ఎంతో మందికి పవన్ ఆర్థిక సాయం చేశారు. సీనియర్ నటి పావల శ్యామలకు సైతం ఆయన అండగా నిలిచారు. అటు విపత్తు సమయాల్లో రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తూ రూ. కోట్లాది రూపాయలు విరాళంగా అందిస్తున్నారు. ఇటీవల విజయవాడ వరదల సందర్భంగా తన సొంత డబ్బు నుంచి రూ.6 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ చేసిన సాయాల లిస్ట్ చాలా పెద్దదేనని ఫ్యాన్స్ చెబుతుంటారు.