భారతీయ చిత్ర పరిశ్రమలో టాలీవుడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమ అందిస్తుందని దేశంలో ఏ సినీ ప్రేక్షకుడిని అడిగినా చెబుతాడు. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘బలగం’ వంటి చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఇదిలా ఉంటే ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ లెటర్స్‌బాక్స్డ్ (Letterboxd) తాజా ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 100 చిత్రాల్లో టాలీవుడ్‌కు చెందిన నాలుగు సినిమాలకు చోటు దక్కాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ర్యాంకులు ఇవే!
న్యూజిలాండ్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ నెట్‌వర్క్ లెటర్‌బాక్స్‌డ్.. అత్యంత ప్రజాధరణ పొందిన చిత్రాల గురించి చర్చను ఆహ్వానిస్తుంటుంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ తమకు నచ్చిన సినిమా గురించి ఈ వేదికపై తమ అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. రేటింగ్స్ కూడా ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా అత్యధిక మంది అభిమానుల ఆదరణ పొందిన ‘టాప్-100’ చిత్రాల జాబితాను లెటర్‌బాక్స్‌డ్ ప్రకటించింది. ఆ వంద చిత్రాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నాలుగు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. అతడు (42), జెర్సీ (57), సాగర సంగమం (75), ఖలేజా (85) చిత్రాలు ఎక్కువ మంది ఇష్టపడ్డ మూవీస్‌గా నిలిచాయి.
ఫుల్ జోష్‌లో మహేష్ ఫ్యాన్స్!
లెటర్‌బాక్స్డ్ ప్రకటించిన వరల్డ్ టాప్ 100 చిత్రాల్లో.. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు చేసిన అతడు, ఖలేజా చోటు దక్కించుకున్నాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇందుకు ఓ కారణం ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లతోనే అతడు, ఖలేజాలు సర్దుకోవాల్సి వచ్చింది. అయితే బుల్లితెరపై మాత్రం ఈ సినిమాలు అత్యధిక టీఆర్పీతో టెలికాస్ట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాలను టీవీలో చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాలు టాప్100లో నిలవడంతో మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
‘SSMB29’ ముహోర్తం ఫిక్స్!
మహేష్ తన తర్వాతి చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్నాడు. దీంతో అందరి దృష్టి SSMB29 పైనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. మహేష్ కూడా ఈ మూవీ కోసం పలు దేశాలు తిరుగుతూ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ‘SSMB29’ చిత్రాన్ని మే 31న అధికారికంగా లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. మహేష్ తండ్రి, దివంగత స్టార్ హీరో కృష్ణ పుట్టిన రోజు నేపథ్యంలో ఆ రోజున సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.