Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!

    Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!

    September 23, 2024

    టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి, గుణశేఖర్‌, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్‌ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్‌, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

    డ్యాన్స్‌కు కేరాఫ్‌!

    ‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్‌, కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తన టాలెంట్‌తో అధిగమించారు. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. డ్యాన్స్ అంటే చిరు.. చిరు అంటే డ్యాన్స్ అనే స్థాయిలో టాలీవుడ్‌పై బలమైన ముద్ర వేశారు. 1980 నుంచి 2005 మధ్య దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు డ్యాన్స్‌లో రారాజుగా వెలుగొందారు. చిరుతో డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్లే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రీఎంట్రీ తర్వాత 60 ప్లస్‌ వయసులోనూ అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. డ్యాన్స్‌లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించిన నేపథ్యంలో చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ చేసిన టాప్‌-15 సాంగ్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    రగులుతోంది మొగలిపొద (ఖైదీ)

    చిరంజీవిని సుప్రీం హీరోను చేసిన చిత్రం ఖైదీ. ఈ మూవీ సక్సెస్‌తో చిరంజీవి రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా ఇందులోని ‘రగులుతుంది మొగలిపొద’ సాంగ్ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. చిరులోని గొప్ప డ్యాన్సర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. పాములా మెలికలు తిరుగుతూ చిరు వేసిన స్టెప్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సాంగ్ షూట్‌ తర్వాత దాదాపు వారం రోజుల పాటు చిరు ఒళ్లు నొప్పులతో బాధపడ్డారట. ఈ సాంగ్‌ ఓసారి మీరూ చూసేయండి. 

    చక్కని చుక్క (పసివాడి ప్రాణం)

    కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ‘చక్కని చుక్కలా’ సాంగ్‌ ద్వారా చిరు కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఈ సాంగ్‌ ద్వారానే చిరు బ్రేక్‌ డ్యాన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ పాటలో హీరోయిన్‌ విజయశాంతితో చిరు వేసిన స్టెప్స్‌ను నాటి తరం ఎప్పటికీ మరిచిపోలేదు. 

    నవ్వింది మల్లె చెండు (అభిలాష)

    ‘అభిలాష’ చిత్రంలోని ఈ పాటలో చిరు హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. లవ్‌ను ప్రేయసి  ఓకే చేస్తే ఆ ప్రియుడు సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో చిరు చూపించారు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను కట్టిపడేసింది. 

    హే పాప (త్రినేత్రుడు)

    ‘త్రినేత్రుడు’లోని ‘హే పాప’ అంటూ వచ్చే సాంగ్‌లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డ్యాన్స్‌ స్కిల్స్‌ను చూపించారు. ఓ క్లబ్‌లోని బ్రేక్‌ డ్యాన్సర్‌కు సవాలు విసిరిమరి చిరు నృత్యం చేస్తాడు. హీరోయిన్‌ భానుప్రియ కూడా అదిరిపోయే స్టెప్పులతో చిరుకు సహకారం అందించింది. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె చిరుకు పోటీగా సాంగ్‌ చేసింది. 

    పదహరేళ్ల వయసు (లంకేశ్వరుడు)

    ‘లంకేశ్వరుడు’ మూవీలోని ‘పదహరేళ్ల వయసు’ పాటకు అప్పట్లో సూపర్‌ రెస్పాన్స్ వచ్చింది. క్లాప్‌ క్లాప్‌ అంటూ సాంగ్‌ను స్టార్ట్‌ చేసిన చిరు తన హుషారైన స్టెప్పులతో విజిల్స్‌ వేయించారు. ఈ సాంగ్‌లోని చిరు గెటప్ చాలా ఏళ్ల పాటు యువతను ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్‌లో చిరు వేసిన స్టెప్స్‌ అభిమానులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. రీసెంట్‌గా ‘మత్తు వదలరా 2’ చిత్రంలో కమెడియన్‌ సత్య ఈ సాంగ్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని స్టెప్పులు వేయడం విశేషం. 

    గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్

    చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రం మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ ఆ పాట చూస్తే మెగా ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు.

    స్టార్‌ స్టార్‌ మెగాస్టార్‌ (కొదమ సింహం)

    కొదమ సింహం సినిమాలోని ‘స్టార్‌ స్టార్‌ మెగాస్టార్‌’ సాంగ్‌ చిరంజీవిని డ్యాన్సర్‌గా మరో మెట్టు ఎక్కించింది. సుప్రీం హీరో ట్యాగ్‌ను దాటి మెగా స్టార్‌ ట్యాగ్‌ను అందించింది. ఇందులో ఆద్యంతం కౌబాయ్‌ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన చిరు తన యునిక్‌ స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా తలపై టోపీని ఉపయోగిస్తూ ఆయన చేసిన డ్యాన్స్ తెలుగులో ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. అప్పటివరకూ టోపీని ఉపయోగించి ఏ తెలుగు హీరో స్టెప్స్‌ వేయలేదు. 

    బంగారు కోడిపెట్ట (ఘరానా మొగుడు)

    రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా మొగుడు’ చిత్రం చిరంజీవి ఇమేజ్‌ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు గాను రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకుని దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఇక ఇందులోని ‘బంగారు కోడిపిట్ట’ సాంగ్‌ ఏ స్థాయిలో సెన్సేషన్‌ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుదేవా కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌లో డిస్కో శాంతిని టీజ్‌ చేస్తూ చిరు స్టెప్పులు వేశారు. డ్యాన్స్‌తో పాటు తన హావభావాలతో ఆకట్టుకున్నారు. చిరు కుమారుడు రామ్‌చరణ్‌ మగధీర చిత్రంలో ఈ సాంగ్‌ను రీమేక్‌ చేయడం విశేషం.

    రూపుతేరా మస్తానా (రిక్షావోడు)

    రిక్షావోడు చిత్రంలోని ‘రూపుతేరా మస్తానా’ మ్యూజిక్‌ ప్రియులకు పూనకాలు తెప్పిస్తుంది. సంగీత దర్శకుడు కోటీ ఇచ్చిన వెస్టర్న్‌ బీట్‌ను మ్యాచ్‌ చేస్తూ చిరు ఇరగదీశారు. మెలికలు తిరుగుతూ వెస్టర్న్‌ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. హీరోయిన్‌ నగ్మాతో కలిసి మెస్మరైజ్ చేశారు. 

    నడక కలిసిన నవరాత్రి (హిట్లర్)

    ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘హిట్లర్’ మూవీలోని నడక కలిసిన నవరాత్రి సాంగ్ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి లారెన్స్ కొరియోగ్రఫి చేశారు. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. హీరోయిన్‌ రంభ చిరుతో పోటీపడి మరి డ్యాన్స్ చేయడం గమనార్హం.

    ఈ పేటకు నేనే మేస్త్రీ (ముఠా మేస్త్రి)

    ఈ సాంగ్‌లో చిరు వేసిన హుక్ స్టెప్స్‌ ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ చేతిలో టవల్‌తో బాడిని బెండ్‌ చేసి భుజాలు ఎగరేసే స్టెప్‌ చాలా మందికి పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్‌ మెుత్తం చిరు లుంగీలోనే కనిపిస్తారు. తలకు టవల్‌ చుట్టుకొని మాస్‌ స్టెప్పులతో ఆద్యంతం అలరించాడు. 

    దాయి దాయి దామ్మ (ఇంద్ర)

    ‘ఇంద్ర’ సినిమాలోని దాయి దాయి దామ్మ సాంగ్ చిరంజీవిలోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇందులోని వీణ స్టెప్‌ చిరు కెరీర్‌లోనే ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్‌ను ఎంతో గ్రేస్‌తో చిరు చేశారు. అతి కష్టమైన ఆ స్టెప్‌ను అలవోకగా వేసి ఆశ్చర్యపరిచారు. ఈ స్టెప్‌ను ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తూ ఆనందిస్తుంటారు. 

    ఆటకావాలా పాటకావాలా (అన్నయ్య)

    ‘అన్నయ్య’ సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్‌లో చిరు మాస్‌ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. చిరు డ్యూయల్‌ రోల్‌లో కనిపించిన ఏకైక సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ అప్పట్లో ఎక్కడా చూసిన వినిపించేది. 

    మన్మథ మన్మథ (ఠాగూర్)

    వి.వి. వినాయక్‌ డైరెక్షన్‌లో చిరు హీరోగా వచ్చిన ‘ఠాగూర్‌’ చిత్రం తెలుగు రికార్డు విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘మన్మథ మన్మథ మామ పుత్రుడా’ పాట అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఇందులో చిరు నిలబడి వేసే వీణ స్టెప్‌ మెస్మరైజ్‌ చేస్తుంది. 

    అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు (ఖైదీ నెంబర్ 150)

    ‘ఖైదీ నెంబర్‌ 150’ చిరంజీవి రీఎంట్రీ చిత్రంగా వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు తనదైన స్టెప్పులతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ అంటూ చిరు వేసిన హుక్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ను మునుపటి రోజులకు తీసుకెళ్లింది. ఆ సాంగ్‌ను మరోమారు చూసి ఎంజాయ్‌ చేయండి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version