నటసింహ బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. బాలకృష్ణ-బోయపాటి దర్శకత్వంలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడంతో భారీ అంచనాలు పెరిగాయి. ఇంతకుముందు సింహ, లెజెండ్ సినిమాలతో బాలయ్యకు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి ఈ సినిమాలో బాలయ్యను ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. మరి సినిమా ఎలా ఉంది..? స్టోరీ ఏంటి తెలుసుకుందాం.
బోయపాటి, బాలకృష్ణను సినిమాలో ఎంత పవర్‌ఫుల్‌గా చూపించాలో అంతకంటే ఎక్కువగానే చూపించాడు. అయితే అఖండ పాత్రను శివుడి అనుగ్రహంతో పుట్టాడని చెప్పడంతో ఆయన ఏం చేసినా ఎక్కడా లాజిక్ మిస్ అయినట్లుగా కనిపించదు. ఇక బాలకృష్ణ శివుడు, మురళీకృష్ణ రెండు పాత్రల్లో తన మార్క్ నటనను కనబరిచారు. శివుడు(అఖండ) పాత్రలో అయితే బాలకృష్ణను తప్ప మరొకరిని ఊహించుకోలేం అనేలా ఉంటుంది. ఇక మురళీకృష్ణగా గ్రామంలో చేసే మంచి పనులు ఆస్పత్రులు కట్టించడం, ఫ్యాక్షనిజం బాట పట్టినవారిని దారి మళ్లించి వారిలో మార్పు తీసుకురావడం, పాఠశాలలు కట్టించడం వంటివి చేస్తుంటాడు. ఇవన్నీ చూసి ఆ జిల్లా కలెక్టర్ శరణ్య(ప్రగ్యాజైస్వాల్) హీరోని ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్లిచేసుకుంటారు. పాప కూడా పుడుతుంది. అయితే ఆ తర్వాతే రెండో క్యారెక్టర్ శివుడు(అఖండ) ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి సినిమా మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. మురళీకృష్ణ, శివుడు ఇద్దరు అన్నాతమ్ముళ్లు. చిన్నప్పుడే ఎందుకు విడిపోయారు. శివుడు అఘోరగా ఎందుకు మారాడు. తర్వాత అతడు మురళీకృష్ణకు ఎలాంటి సహాయం చేశాడు ఇవన్నీ సినిమాలోనే చూడాలి.
లెజెండ్ సినిమాతో జగపతిబాబుని విలన్‌గా మార్చిన బోయపాటి..అఖండతో శ్రీకాంత్‌ను పవర్‌ఫుల్ విలన్‌గా చూపెట్టారు. మైనింగ్ మాఫియా నడిపే వరదరాజులు (శ్రీకాంత్), దాన్ని ఆపేందుకు రంగంలోకి దిగిన మురళీకృష్ణ (బాలకృష్ణ)కు యుద్ధం మొదలవుతుంది. వీరిద్దరి వైరం ఎక్కడిదాకా వెళ్లింది..? మైనింగ్ మాఫియాతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? ఎలా అధిగమించాడు..?అనే విషయాలు తెరపై చూడాలి. ఇక హీరోయిన్ ప్రగ్యాది కూడా బలమైన పాత్ర. దానికి తగినట్లుగా ఆమె అందులో ఒదిగిపోయింది. జగపతిబాబు, కాలకేయ ప్రభాకర్ వంటి కీలకపాత్రలు తమ పరిధి మేరకు నటించాయి. మొత్తానికి బాలకృష్ణ ఫ్యాన్స్‌కు అఖండ ఒక ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. బోయపాటి ఇదివరకు సినిమాలో లాజిక్ మిస్ అయ్యానడి చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఈ సినిమాలో అది కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. మైనింగ్ మాఫియాతో పాటు ఈ సినిమాలో ప్రకృతి గురించి, దేవుడికి, సైన్స్‌కి మధ్య సంబంధం గురించి కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు.
బాలకృష్ణ 60 ఏళ్ల వయసులో కూడా చాలా యాక్టివ్‌గా కనిపించాడు. ముఖ్యంగా పాటల్లో ఉత్సాహంగా ఆడిపాడాడు. ముఖ్యంగా తమన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఫైటింగ్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేసింది. ఇక బాలకృష్ణ సినిమాలంటే యాక్షన్ సీన్స్ సాధారణం. ఈ సినిమాలో ఆ డోస్ కాస్త ఎక్కువగానే ఉంది. అయితే ఇది ఆయన ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. మొత్తానికి అఖండలో బాలకృష్ణ విజృంబించాడు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.
రేటింగ్ 3/5