తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి వడగళ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్, మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, నిజాంపేట, ఎస్‌ఆర్ నగర్, ఎల్బీనగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
హైదరాబాద్‌లో తెల్లవారుజామున వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. పెద్దఎత్తున నష్టం కలిగించింది. మంచు గడ్డల రూపంలో పెద్దఎత్తున రాళ్ల వర్షం కురిసింది. ప్రజలు బయటకు రావాలంటే వణికిపోయారు. వడగండ్లకు భారీ వరదలు తోడవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కశ్మీరులా మారిన వికారాబాద్..
వికారాబాద్‌లో ఎటుచూసినా పరిసరాలు మంచుముక్కలతో నిండిపోయాయి. జిల్లాలోని మర్పల్లి కశ్మీర్‌ను తలపించింది. వడగండ్ల వాన వల్ల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై..
నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తడిసి ముద్దవుతోంది. ఈ మేరకు నెటిజన్లు షేర్ చేస్తున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. చూడ్డానికి వ్యూ బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వాహనదారులకు ఇక్కట్లు..
24 గంటలుగా కురుస్తున్న వర్షాలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో సమస్య ఎదుర్కొంటున్నారు. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, వాహనం కండీషన్‌లో ఉంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
తెలంగాణకు ఎల్లో అలర్ట్..
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మార్చి 17, 18న తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటనలో తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. పలుచోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. మార్చి 18న భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.