ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సంచనాలకు మారుపేరుగా మారిపోయింది. థ్రిల్లింగ్ మ్యాచ్‌లతో క్రికెట్ ప్రియులను కావాల్సినంత మజా అందిస్తోంది. 200కు పైగా రన్స్ సాధించినా గెలుస్తామన్న నమ్మకం జట్లకు ఉండటం లేదు. అలాగే 130 స్కోరు చేసినా గెలుపుపై ధీమా నిలవడం లేదు. ఎందుకంటే ఆఖరి బాల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తోంది. చివరి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా బ్యాటర్లు విజయాన్ని ఎగరేసుకుపోతున్నారు. దీంతో ఫలితాన్ని ముందుగానే అంచనావేయడం కష్టతరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ సీజన్లలో లాస్ట్ బాల్ విక్టరీలు ఏవి? సిక్సర్‌తో తమ జట్టుకు విజయాన్ని అందించిన ఆటగాళ్లు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
1. అబ్దుల్ సమద్ (2023)
ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమే చేసింది. SRH విజయానికి ఐదు పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులో అబ్దుల్ సమద్ (Abdul Samad) ఉన్నాడు. సమద్ కొట్టిన బాల్‌ను లాంగాఫ్ ఫీల్డర్ అందుకోగా సన్‌రైజర్స్ అభిమానులంతా నిరాశలో కుంగిపోయారు. అయితే అనూహ్యంగా ఆ బాల్‌ను ఎంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో ఆఖరి బాల్‌కు నాలుగు పరుగులు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో బ్యాటును ఝూళిపించిన సమద్ సూపర్ సిక్సర్‌తో మ్యాచ్‌కు విజయాన్ని అందించాడు. గత మ్యాచ్‌లో ఓవర్‌కు 9 పరుగులు చేయలేక చతికిల పడ్డ SRH.. ఈసారి ఆఖరి ఓవర్‌లో ఏకంగా 17 పరుగులు సాధించడం విశేషం.
2. రింకూ సింగ్ (2023)
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ (Rinku Singh) చెలరేగి ఆడాడు. విజయానికి చివరి 6 బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. యశ్ దయాల్ వేసిన లాస్ట్ ఓవర్‌లో చివరి ఐదు బంతుల్ని రింకూ సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఈ మ్యాచ్‌లో KKR అనూహ్యంగా విజయం సాధించి ఐపీఎల్ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించింది. చివరి ఓవర్‌లో అత్యధిక పరుగులను ఛేజ్ చేసి గెలిచిన జట్టుగా రికార్డుకెక్కింది. ఆ మ్యాచ్ తర్వాత నుంచి రింకూ కోల్‌కత్తా జట్టుకు హీరోగా మారిపోయాడు.
3. రాహుల్ తెవాటియా (2022)
గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా (Rahul Tewatia) చెలరేగి ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఒంటిచెత్తో గుజరాత్‌కు విజయాలను అందించాడు. ముఖ్యంగా కింగ్స్ లెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తెవాటియా విధ్వంసం సృష్టించాడు. చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. అప్పటివరకూ విజయం ఖాయం అనుకున్న పంజాబ్.. తెవాటియా ఇన్నింగ్స్‌తో నిరాశలోకి వెళ్లిపోయింది.
4. రషీద్ ఖాన్ (2022)
గుజరాత్ బ్యాటర్ రషీద్ ఖాన్ (Rashid Khan) సైతం లాస్ట్ బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఈ ఫీట్ సాధించాడు. సన్‌రైజర్స్‌ను ఓటమిపాలు చేశాడు.
5. శ్రీకర్ భరత్ (2021)
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB బ్యాటర్, తెలుగు వ్యక్తి శ్రీకర్ భరత్ (Srikar Bharat) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో ఓవర్‌లో 15 కావాల్సిన సమయంలో ప్రత్యర్థి బౌలర్‌పై విరుచుకుపడ్డాడు. చివరి బంతికి సిక్స్ బాది RCB కి తిరుగులేని విజయాన్ని అందించాడు.
6. రవీంద్ర జడేజా (2020)
కోల్‌కత్తా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. జట్టు గెలుపులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కీలకపాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్‌లో CSK విజయానికి 10 పరుగులు అవసరం కాగా.. తొలి నాలుగు బంతులకు 3 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో క్రీజులో ఉన్న జడేజా ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు ఊహించని విక్టరీని అందించాడు.
7. నికోలస్ పూరన్ (2020)
RCBతో జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్ విజయానికి 2 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చింది. క్రీజులో క్రిస్ గేల్ (Chris Gayle), కేఎల్ రాహుల్ (KL Rahul) ఉన్నారు. ఇక పంజాబ్ విజయం నల్లేరుపై నడకే అని అంతా భావించారు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసిన చాహల్ బంతితో చెలరేగాడు. తొలి నాలుగు బాల్స్ డాట్స్ వేసి ఐదో బంతికి క్రిస్‌గేల్‌ను ఔట్ చేశాడు. దీంతో క్రీజ్‌లోకి వచ్చి నికోలస్ పూరన్ (Nicholas Pooran) సిక్స్ కొట్టి పంజాబ్‌ను గెలిపించాడు.
8. MS ధోని (2016)
మ్యాచ్ ఫినిషర్‌గా ఎం.ఎస్ ధోని (MS Dhoni)కి ఎంత మంచి పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016లో ధోని పుణె తరపున ఆడాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌కు పుణె విజయానికి 22 కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో క్రీజులో ఉన్న ధోని ఫస్ట్ బాల్‌నే సిక్సర్‌గా మలిచాడు. రెండో బాల్ డాట్ కాగా.. తర్వాతి మూడు బంతులను 4, 6, 6 గా మలిచి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ద్వారా తాను ఉత్తమ ఫినిషర్ అని ధోని మరోమారు నిరూపించుకున్నాడు.
9. డ్వేన్ బ్రావో (2012)
వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో (Dwayne Bravo) ఆ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో CSK విజయానికి అఖరి బంతికి 5 రన్స్ అవసరం అయ్యాయి. క్రీజులో ఉన్న బ్రావో లాస్ట్ బాల్‌ను సిక్సర్ కొట్టి చెన్నైను గెలిపించాడు. పోయిందనుకున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.
10. రోహిత్ శర్మ (2009)
ఆ సీజన్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) డక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు. KKRతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరు బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. 2011లో MI తరపున ఆడిన హిట్ మ్యాన్ పుణెతో జరిగిన మ్యాచ్‌లో లాస్ట్ బాల్‌కు సిక్స్ బాదాడు. 2012లో డక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్ ఇలాగే చేసి MIను గెలిపించాడు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది