తమిళ స్టార్ హీరో జయం రవికి కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఎక్స్ వేదికగా అతడు పెట్టిన సుదీర్ఘ పోస్టు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
‘మా ఇద్దరి మంచి కోసమే..’
నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. ఈ విషయంపై రూమర్స్, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని జయం రవి పేర్కొన్నారు.
15 ఏళ్ల బంధానికి బ్రేక్
2009 జూన్‌లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు సినిమాతోనే గుర్తింపు
1993లో వచ్చిన ‘బావ బామ్మర్ది’,’పల్నాటి పౌరుషం’ (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్ ఫిల్మ్. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’ చిత్రాల్లో టైటిల్ రోల్ పోషించి పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?