పెద్దగా ఆడంబరం లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా అమల, నాజర్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. టైం ట్రావెల్ కథగా ప్రేక్షకులను పలకరించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుడిని థియేటర్లో మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి..?
టైం ట్రావెల్ సినిమాలనగానే మనలో తెలియని ఆసక్తి. అవకాశమొస్తే మన తప్పులను సరిదిద్దుకోవాలని ఎదురుచూస్తుంటాం. అలా మన చిన్నతనంలో జరిగిన ఘటనలను మార్చే ఛాన్స్ వస్తే బాగుండనిపిస్తుంది. ఈ సినిమా కథ కూడా ఇదే. టైం ట్రావెల్ కథతో పాటు.. అమ్మ సెంటిమెంట్ ఈ కథకు ప్రధాన బలం. ఆది(శర్వానంద్), శీను(వెన్నెల కిశోర్), చైతు(ప్రియదర్శి) అనే ముగ్గురు వ్యక్తులు తమ బాల్యంలోకి వెళ్లి ఏం చేశారు? విధిని మార్చగలిగారా? టైం మిషన్ ద్వారా వెళ్లిన వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేది తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారు..?
స్టార్ డమ్ కోసం పరితపించకుండా తనదైన కథా ఎంపికతో శర్వానంద్ చేసే సినిమాలు బాగుంటాయి. ఓ ఎమోషనల్ సినిమాని ఎంచుకోవడం శర్వా అభిరుచిని తెలియజేస్తుంది. ఈ సినిమాలో ఆదిగా శర్వానంద్ ఓ మెట్టు పైకెక్కాడు. తన నటనకు ఈ హీరో పదునుపెట్టాడు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలను పండించాడు. తల్లిగా అమల మరోసారి మేకప్ వేసుకుంది. దాదాపు దశాబ్దం పాటు విరామం తీసుకున్నా.. ఈ సినిమాలో సహజంగా నటించింది. శర్వా, అమల మధ్య అనుబంధాన్ని చూస్తుంటే ప్రేక్షకుడు ఇట్టే కనెక్ట్ అయిపోతాడు. ఇక చైతుగా ప్రియదర్శి, శీనుగా వెన్నెల కిశోర్ నవ్వులు పూయించారు. ఆదితో జరిగే తమ ప్రయాణంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి నవ్వు తెప్పిస్తాయి. వైష్ణవిగా రీతూ మెప్పించింది. ఇక నాజర్ మరోసారి తన పాత్రకు ప్రాణం పోశారు. పాల్ అనే సైంటిస్టుగా మెప్పించారు.
సాంకేతిక అంశాలు..
సైంటిఫిక్ త్రిల్లర్ కు భావోద్వేగ అంశాలను జోడించి దర్శకుడు శ్రీకార్తిక్ మెప్పించారు. శాస్త్రీయ పరిభాష జోలికి లోతుగా వెళ్లకుండా.. సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా కథను వివరించారు. మొదటి భాగం ఆహ్లాదభరితంగా సాగిపోతుంటుంది. ఇంట్రవెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ లో ఫుల్ ఎమోషనల్ గా మారిపోతుంది. ఈ సినిమాకు సంగీతం అదనపు బలం. దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ‘అమ్మ’అనే పాట గుండె బరువెక్కిస్తుంది. ఒకటే కదా, మారిపోయే.. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. తరుణ్ భాస్కర్ డైలాగులు సహజంగా ఉన్నాయి. జేక్స్ బెజాయ్ నేపథ్య సంగీతం బాగుంది. ఎమోషనల్ సన్నివేశాలలో కంటతడి పెట్టిస్తుంది. సుజిత్ కెమెరా పనితనం మెప్పిస్తుంది.
దర్శకుడిగా శ్రీకార్తిక్ తన తొలి ప్రయత్నంలోనే మంచి సినిమాగా దీనిని తీర్చిదిద్దారు. కానీ కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్లేందుకు డైరెక్టర్ సమయం తీసుకున్నారని అనిపిస్తుంది. సైంటిఫిక్ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు.. దర్శకుడు లాజిక్ మిస్సయ్యారేమో అని సందేహం వస్తుంటుంది. తెరపై జరిగే కొన్ని సీన్లకు తర్కమేమీ ఉండదానని అనిపిస్తుంది. లాజిక్కులు ఆలోచించకుండా సినిమాను ఆస్వాదిస్తే.. సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది.
బలాలు
ఎమోషనల్ సీన్స్
కామెడీ
నేపథ్య సంగీతం
బలహీనతలు
స్లో నరేషన్
లాజిక్ లేని అంశాలు
ఫైనల్ గా.. ఒకే ఒక జీవితం.. సగటు ప్రేక్షకుడి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది!
రేటింగ్: 3/5
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది