నటీనటులు : చేతన్ కృష్ణ, చేతన్ మద్దినేని, వెన్నెల కిషోర్, సాయికుమార్, వినయ్ వర్మ, ప్రవీణ్, నవీన్ నేని, గోపరాజు రమణ తదితరులు.
దర్శకత్వం : సాయి కిషోర్ మచ్చా
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి
నిర్మాత : ఎం.ఎస్ రామ్ కుమార్
విడుదల తేదీ: నవంబర్ 8, 2024
చేతన్ మద్దినేని (Chetan Maddineni), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam Review). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పిందించిందా? ఇప్పుడు పరిశీలిద్దాం.
కథేంటి
కార్తిక్ (చేతన్ మద్దినేని)కు తన తండ్రి రామరాజు (సాయికుమార్) అంటే చాలా ఇష్టం. నాన్నపై విపరీతమైన ప్రేమాభిమానాలను చూపిస్తుంటాడు. అటు రామరాజు సైతం కొడుకుపై అంతే ప్రేమ చూపిస్తుంటాడు. ఏ విషయాన్నైనా ఇద్దరు పంచుకుంటారు. ఇదిలా ఉంటే ఓ రోజు సుహానా (హెబ్బా పటేల్)ను చూసి కార్తిక్ తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ, ఆమె పట్టించుకోదు. కోపంతో పోలాండ్‌కు వెళ్తాడు. అక్కడికి వెళ్లిన సుహానా తిరిగి కార్తిక్ ప్రేమను దక్కించుకుంటుంది. మరోవైపు కార్తీక్‌కు సుహానా పెద్దనాన్న (రామరాజు), అతడి తమ్ముడు (బెనర్జి)తో వైరం ఉంటుంది. కార్తీక్‌ను చంపాలని వారు చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? సుహానా ఫ్యామిలీతో కార్తిక్‌కు వైరం ఎందుకు వచ్చింది? కార్తీక్ వాటిని ఎలా పరిష్కరించాడు? చివరికీ సుహానా – కార్తిక్ ఒక్కటయ్యారా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరో కార్తిక్ పాత్రలో చేతన్ కృష్ణ పర్వాలేదనిపించాడు. నటన పరంగా గతంతో పోలిస్తే పరిణితి చూపించాడు. అయితే ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో మరింత వర్క్ చేసి ఉంటే బాగుండేది. కీలక సన్నివేశాల్లో అతడి నటన తేలిపోయింది. ఇక హీరోయిన్ సుహానా పాత్రలో హెబ్బా పటేల్ ఎప్పటిలాగే మెప్పించింది. చాలా రోజుల తర్వాత కమర్షియల్ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. వీరిద్దరి జోడి బాగా కుదిరింది. హీరో కజిన్‌గా సుహాస్ పాత్రలో వెన్నెల కిషోర్ అదరగొట్టాడు. అతడి కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వీరితోపాటు సాయికుమార్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, గిరిధర్ తదిరులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సాయికిషోర్ మచ్చా ఎంచుకున్న కథ సాదాసీదాగా ఉంది. అయితే మంచి రొమాంటిక్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అందించాలనే ప్రయత్నం మాత్రం అభినందనీయం. లవ్‌ట్రాక్ ఉన్నా ఎక్కడా వల్గారిటీ లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. తండ్రీ కొడుకుల ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల బాండింగ్‌తో పాటు ఫ్యామిలీ అనుబంధాలను చక్కగా చూపించారు. ఫస్టాఫ్ అంతా హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, వారి మధ్య వచ్చే గొడవలు, అలకలు చూపించారు. ఇవి కాస్త రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రవీణ్ చేసే కామెడీ రిలీఫ్ ఇస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌ను ఆసక్తికరంగా మార్చారు డైరెక్టర్. హీరోయిన్ ఫాదర్ గురించి తెలిసి హీరో షాకవ్వడం, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్ మెుత్తాన్ని వెన్నెల కిషోర్ తన భుజాలపై నడిపించాడు. స్లో న్యారేషన్, గొప్ప క్యాస్టింగ్ ఉన్నా సరిగా వాడుకోకపోవడం, అక్కడక్కడ హీరో ఇచ్చే అర్థంకాని ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకు మైనస్‌గా మారాయి.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాలకు వస్తే గోపి సుందర్ అందించిన మ్యూజిక్ ప్రధాన అసెట్ అయ్యింది. పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కొత్త ఫీల్‌ను అందించింది. అలాగే సిద్ధార్థ్ రామస్వామి కెమెరా వర్క్ మెప్పించింది. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటిర్ సినిమాను మరింత షార్ట్‌గా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
- వెన్నెల కిషోర్ కామెడీ
- ఫ్యామిలీ ఎమోషన్స్
- సంగీతం
మైనస్ పాయింట్స్
- రొటీన్ స్టోరీ
- రెగ్యులర్ లవ్‌ట్రాక్
- స్లో న్యారేషన్