ఏ బిడ్డా.. ఇక బాలీవుడ్‌కు హైదరాబాద్ అడ్డా..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏ బిడ్డా.. ఇక బాలీవుడ్‌కు హైదరాబాద్ అడ్డా..!

    ఏ బిడ్డా.. ఇక బాలీవుడ్‌కు హైదరాబాద్ అడ్డా..!

    September 23, 2022

    అది ఓ అవార్డుల ఫంక్షన్. బాలీవుడ్ హేమాహేమీలు అంతా అక్కడే ఉన్నారు. ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ నుంచి మన మెగాస్టార్‌కి ఆహ్వానం అందింది. ఆ పిలుపుతో ముంబయి వెళ్లిన ఆనందం చిరుకి ఎక్కువ సేపు నిలవలేదు. కారణం అక్కడ ఏ దక్షిణాది హీరో కటౌట్ లు, ఫోటోలు లేకపోవడం. దీనిపై మెగాస్టార్ విస్మయం చెందారు. ఉండబట్టలేక నేరుగా అక్కడే అడిగేశారు మా సౌత్ హీరోల ఫొటోలు ఒక్కటి కూడా లేవే అని! దక్షిణాది చిత్రాలంటే వారికి లేక్కలేదు. దక్షిణాది హీరోలని వాళ్లు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్లుంటున్న బాలీవుడ్ దే హవా. వాళ్లు తీసినవే హిట్టు సినిమాలు!

    కట్ చేస్తే.. 2022. సీన్ మారింది. టాలీవుడ్ స్క్రీన్‌కి వాల్యూ పెరిగింది. బాలీవుడ్ బడా హీరోలకు దక్షిణాది విలువ తెలిసొచ్చింది. ఇప్పుడు వారి సినిమా ప్రమోషన్లకు హైదరాబాద్ అడ్డా అయింది. లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్ల కోసం తెలుగు గడప తొక్కిన ఆమిర్ ఖాన్.. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా హైదరాబాద్ ఎంపిక.. ఎన్నడూ లేనిది హిందీ హీరోలు తెలుగులో మాట్లాడటానికి, పాటలు పాడటానికి ట్రై చేస్తున్నారు. ఇలా ఒకొక్క బాలీవుడ్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకుల ఆదరణను కోరుతున్నారు. సౌత్ సినిమాల రేంజ్ పెరగడమే ఇందుకు కారణం!

    ఒకప్పుడు రూ.100కోట్ల కలెక్షన్లు దాటడమంటే అది బాలీవుడ్ సినిమాలతోనే సాధ్యమయ్యేది. ఖాన్ త్రయం ఈ ట్రెండ్‌ సెట్ చేసింది. మన దక్షిణాది సినిమాలకు అంత మార్కెట్ ఉండేది కాదు. అలా అని మన సినిమాల్లో విషయం లేదనీ కాదు. ఇక్కడ హిట్టయిన చాలా సినిమాలు హిందీలో డబ్, రీమేక్ అయ్యి.. మంచి విజయాలు సాధించాయి. కాలానుగుణంగా సాంకేతికత పెరిగింది. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దక్షిణాది సినిమాల నిర్మాణ విలువలు మెరుగయ్యాయి. హిందీలో డబ్ అయితే చాలనునుకునే పరిస్థితి నుంచి.. నేరుగా హిందీలోనే విడుదల చేసే స్థాయికి ఎదిగాం. ఫలితంగా మన సినిమాలకు మునుపెన్నడూ లేని వైభవం వచ్చింది. ఓటీటీ విప్లవంతో ఇక్కడి సినిమాలకు బీటౌన్ ప్రేక్షకుల ఆదరణ మొదలైంది.

    సౌత్ సినిమాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన దర్శకులది. రోబో, రోబో 2.0, బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మన వాళ్ల పనితనం అక్కడి ప్రేక్షకులకు బాగా నచ్చింది. కంటెంట్ వారిని మురిపించింది. బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఓ నూతన అధ్యాయానికి నాంది పలికితే.. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు అందలానికి ఎక్కించాయి. హిందీ చిత్రసీమలో అత్యధిక కలెక్షన్ల జాబితాలో ఇవి చోటు దక్కించుకున్నాయి. ఇవే కాకుండా.. పుష్ప, మేజర్, కార్తికేయ 2 వంటి సినిమాలు చెరగని ముద్ర వేశాయి. 

    తెలుగు సినిమా వైభవం పెరిగిపోతుంటే.. బాలీవుడ్ లో పరిస్థితి తలకిందులైంది. కరోనా మహమ్మారి విధ్వంసాన్ని తట్టుకుని మన థియేటర్లు నిలబడ్డాయి. కానీ బీటౌన్ స్క్రీన్లు మెరవలేకపోయాయి. మంచి సినిమాలు లేకపోవడం 70ఎంఎంని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఈ ఏడాది ఒకట్రెండు సినిమాలు మాత్రమే కొన్నిరోజులు ఆడాయి. పెద్ద స్టార్ల సినిమాలు కూడా బోల్తా పడ్డాయి. అదీ కాకుండా బాయ్ కాట్ ట్రెండ్ హిందీ చిత్రసీమను బాగా ఇబ్బంది పెట్టింది. నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది. 

    సౌత్ మేనియాతో పోటీపడలేక థియేటర్ల ముందు గిర్రున తిరిగిపోవడంతో బాలీవుడ్ పెద్దలకు కనువిప్పు కలిగింది. చేతులు పూర్తిగా కాలకముందే ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు ముంబయి.. హైదరాబాద్ వైపు చూస్తోంది. లాల్ సింగ్ చడ్డా, బ్రహ్మాస్త్ర సినిమాలకు తెలుగులో భారీ స్థాయిలో ప్రచారం కల్పించడమే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు అక్షయ్- సైఫ్ అలీ ఖాన్ ల ‘విక్రమ్ వేదా’ కూడా సిద్ధమైంది. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే తమ సినిమా తప్పక హిట్ అవుతుందని వారు నమ్ముతున్నారు. హీరో రణ్ బీర్ కపూర్ కూడా బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లలో ఈ విషయం నొక్కి చెప్పారు. ఇక టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ ఏమీ లేదని.. అంతా ఒకటే ఇండియన్ ఇండస్ట్రీ అనే వాదనను కూడా కొందరు తెరపైకి తీసుకొస్తున్నారు. ఏదేమైనా చిత్రసీమకు మంచిరోజులు రావాలి. తమ కంటెంట్‌తో అలరించాలి. అంతిమంగా వినోదం ప్రతి ఇంటి గడపా తొక్కాలి. అదే మనం కోరుకునేది. జరగాల్సింది!

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version