దేశం గర్వంచతగ్గ డైరెక్టర్స్‌లో దర్శకధీరుడు రాజమౌళి అగ్రస్థానంలో ఉంటాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఒక్క ఫ్లాప్ లేకుండా ఆయన తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. ఆడియన్స్ పల్స్ పట్టుకొని సినిమాలు తీయడంలో రాజమౌళి మాస్టర్ అని చెప్పవచ్చు. అందుకే ఇప్పటివరకు జక్కన్న నుంచి వచ్చిన 12 చిత్రాలు దేనికదే ఎంతో ప్రత్యేకతను సాధించాయి. ఆడియన్స్ దృష్టిలో ఎవర్‌గ్రీన్ సినిమాలుగా నిలిచాయి. అయితే రాజమౌళి తరహాలో సినిమాలు చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. రాజమౌళి చిత్రాలను పోలిన కథలతో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. రీసెంట్‌గా కంగువా సైతం రాజమౌళి చిత్రాల ప్యాట్రన్‌లోనే వచ్చి ఆడియన్స్‌ను నిరాశపరిచింది. అందుకు కారణాలు ఏంటి? కంగువా తరహాలో జక్కన్నను అనుసరించి దెబ్బతిన్న చిత్రాలు ఏవి? ఇప్పుడు చూద్దాం.
‘బాహుబలి’తో పోల్చి తప్పు చేశారా?
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన కంగువ చిత్రం నవంబర్ 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళిని ఆహ్వానించడం, టాలీవుడ్‌కు బాహుబలి ఎలాగో కోలివుడ్‌కు ‘కంగువా’ అంటూ ప్రచారాలు హోరెత్తించడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కంగువా రిలీజ్ తర్వాత పరిస్థితులు తలకిందులైనట్లు తెలుస్తోంది. బాహుబలితో పోల్చే విధంగా సినిమాలో స్టఫ్ లేదని చూసినవారు చెబుతున్నారు. కథ చెప్పడంలో దర్శకుడు శివ పూర్తి తడబడ్డాడని అంటున్నారు. భావోద్వేగాలను రగిలించడంలో రాజమౌళి దిట్ట. కానీ కంగువాకు వచ్చే సరికి ఎమోషన్స్ ఏమాత్రం పండలేదని అంటున్నారు. సినిమాలోని పాత్రలతో ఆడియన్స్ ప్రయాణం చేయలేకపోయామని చెబుతున్నారు. ఒక్క సూర్య నటన కోసం సినిమా చూడొచ్చని చెబుతున్నారు.
ఆ చిత్రాలు కూడా అంతే!
‘కంగువా’ తరహాలో గతంలో పలు చిత్రాలు జక్కన్నను అనుసరించి అపజయాన్ని మూటగట్టుకున్నాయి. జూ.ఎన్టీఆర్ – మేహర్ రమేష్ కాంబోలో వచ్చిన ‘శక్తి’ (2011) కూడా ‘మగధీర’ తరహాలో మెప్పించాలని వచ్చి బోల్తా పడింది. ‘మగధీర’ లాగే ‘శక్తి’ కూడా పునర్జన్మ కాన్సెప్ట్‌తో వచ్చింది. కానీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రణ్‌బీర్ కపూర్, అలీయా భట్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ భారీ బడ్టెట్‌తో వచ్చి మెప్పించలేకపోయింది. జక్కన్న తరహాలో మంచి విజువల్ వండర్‌గా ఈ మూవీ ఉంటుందని అప్పట్లో ప్రచారం సైతం జరిగింది. సాలిడ్ కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఆదరించలేదు. అలాగే కోలివుడ్‌లో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయింది. తొలి భాగం బాగున్నా సెకండాఫ్ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. RRR తరహాలో బ్రిటిష్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘షంషేరా’ సైతం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తమిళంలో వచ్చిన ‘పులి’, మలయాళంలో వచ్చిన ‘మరక్కర్’ జక్కన్న మూవీ తరహాలో పెద్ద బజ్ క్రియేట్ చేసినప్పటికీ సక్సెస్ మాత్రం కాలేకపోయాయి.
జక్కన్న సక్సెస్ మంత్ర ఇదే!
రాజమౌళి సినిమా అనగానే చాలా మంది గొప్ప తారాగణం, భారీ బడ్జెట్, అద్భుతమైన గ్రాఫిక్స్, ఎవర్‌గ్రీన్ స్టోరీ అని అనుకుంటారు. అవన్నీ ఉండబట్టే రాజమౌళి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారని భావిస్తుంటారు. కానీ రాజమౌళి సక్సెస్ వాటిలో లేదు. అవి సక్సెస్‌కు దోహదం చేసే కీలక అంశాలు మాత్రమే. జక్కన్న సక్సెస్ ఫార్మూలా మరోటి ఉంది. అదే ఎమోషనల్ డ్రామా. చాలా సినిమాల్లో మిస్ అయ్యేది, జక్కన్న మాత్రమే క్యారీ చేసేది ఇదే. తన సినిమాల్లో ఎమోషన్స్‌కు రాజమౌళి పెద్ద పీట వేస్తారు. సినిమా సక్సెస్‌కు అది ఎంతో కీలకమని నమ్ముతారు. ప్రేక్షకుడు, తన సినిమాలోని పాత్రలకు మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్‌ను రాజమౌళి క్రియేట్ చేస్తుంటారు. తద్వారా ఆడియన్స్‌ను తన మూవీ లీనం చేస్తారు. అందుకే జక్కన్న సినిమా చూసి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ పాత్రలు ప్రేక్షకులను వెంటాడుతుంటాయి. తిరిగి మళ్లీ మళ్లీ చూసేలా ప్రోత్సహిస్తాయి. అసలు జక్కన్న ఏం తీశాడురా అన్న భావనను ఆడియన్స్‌లో కలుగుచేస్తాయి. అందుకే చాలా మంది దర్శకులు దీనిని అందిపుచ్చుకోలేక విఫలమవుతున్నారు.
జక్కన్న బిజీ బిజీ..
RRR తర్వాత రాజమౌళి (S.S. Rajamouli), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత మహేష్ బాబు (Mahesh Babu)ల నుండి ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా SSMB 29 ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ సినిమాలో మహేష్ నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించనున్నాడు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుండటంతో మంచి లోకేషన్స్ కోసం సౌతాఫ్రికాలో జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే బ్రిటీష్ ముద్దుగుమ్మ నవోమి స్కాట్ (Naomi Scott)ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో వేసే వారణాసి సెట్‌లో ఫినిష్ చేసి ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్‌ను సౌతాఫ్రికాలో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.