నటీనటులు : శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు
రచన, దర్శకత్వం : రితేష్ రానా
సంగీతం : కాల భైరవ
సినిమాటోగ్రాఫర్ : సురేష్ సారంగం
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
నిర్మాత : చిరంజీవి (చెర్రీ)
విడుదల తేదీ: సెప్టెంబర్ 13, 2024
శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్, రోహిణి, సునీల్ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్ తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తుంటారు. చాలిచాలని జీతంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. దీంతో డబ్బులు సరిపోకా వారు స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్ కవర్ ఏజెంట్ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Mathu Vadalara 2 Movie Review)
ఎవరెలా చేశారంటే
హీరోగా శ్రీ సింహా మంచి నటన కనబరిచాడు. కామెడీ, యాక్షన్ సీక్వెన్స్‌లో ఆకట్టుకున్నాడు. అయితే ప్రతీ సీన్‌లో సత్య పక్కన ఉండటంతో అతడే హైలెట్ అయ్యాడు. ఈ సినిమాకు సత్యనే మెయిన్ హీరో అని చెప్పవచ్చు. తన పంచ్ డైలాగ్స్‌తో, కామెడీ టైమింగ్‌తో సత్య అదరగొట్టాడు. ముఖ్యంగా అతడి ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ‘సెక్సీ సైరన్’ అంటూ సినిమాలో అతడు చేసే హంగామా బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు ఇందులో మంచి రోల్ దక్కింది. చిట్టి పాత్ర తర్వాత ఆ స్థాయిలో ఈ రోల్ గుర్తుండిపోతుంది. అటు వెన్నెల కిషోర్ సైతం తనదైన కామెడీతో గిలిగింతలు పెట్టారు. సునీల్, రోహిణి తదితర ముఖ్య తారాగారణం తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇతర నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు రితేశ్ రాణా కథలన్నీ కూడా సింపుల్‌గా డ్రగ్స్, గన్స్, డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఈసారి కూడా దర్శకుడు అలాంటి స్టోరీనే ఎంచుకున్నారు. ఒక కిడ్నాపింగ్ డ్రామాకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంతో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి, పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్‌బాబుతో పాటు పలువురు స్టార్ హీరోలను రిఫరెన్స్‌లుగా తీసుకోవడం బాగా కలిసొచ్చింది. శ్రీ సింహా, సత్య పాత్రలను చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దడం మెప్పిస్తుంది. అలాగే తెరపై కనిపించే ప్రతీ క్యారెక్టర్ కొత్తగా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రథమార్థం మెుత్తాన్ని ఫన్ రైడ్‌గా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంకు వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌లో ల్యాగ్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్‌గా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. చాలా సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- శ్రీ సింహా, సత్య
- కామెడీ
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- అక్కడక్కడ సాగదీత సీన్స్
- ప్రిడిక్టబుల్ క్లైమాక్స్
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!