Allu vs Mega: మరింత ముదిరిన వివాదం.. పుష్ప2లో చిరు టార్గెట్‌గా డైలాగ్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu vs Mega: మరింత ముదిరిన వివాదం.. పుష్ప2లో చిరు టార్గెట్‌గా డైలాగ్స్!

    Allu vs Mega: మరింత ముదిరిన వివాదం.. పుష్ప2లో చిరు టార్గెట్‌గా డైలాగ్స్!

    December 5, 2024

    అల్లు అర్జున్‌, మెగా (Allu vs Mega) కుటుంబాల మధ్య వివాదాలు తారా స్థాయికి చేరినట్లు గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో బన్నీ (Allu Arjun) లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)ను బాయ్‌కాట్‌ చేయాలని మెగా ఫ్యాన్స్‌ నెట్టింట పిలుపు సైతం ఇచ్చారు. ఈ క్రమంలోనే బన్నీ – సుకుమార్‌ కాంబోలోని పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజైంది. అయితే ఇందులో బన్నీ చెప్పిన డైలాగ్స్‌ మెగా ఫ్యామిలీ టార్గెట్‌ చేసినట్లు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్‌ మద్దతు ఇవ్వడం వల్లే ఈ స్థాయి మనస్పర్థలు వచ్చాయని అంతా భావిస్తున్నారు. కానీ, ఆ ఘటన కంటే ముందే మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌కు చెడిందని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ ఉంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    ఖైదీ నెంబర్‌ 150 సమయంలో.. 

    మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రాజకీయాల్లో పెద్దగా కలిసి రాకపోవడంతో ‘ఖైదీ నెంబర్‌ 150’ (Khaidi No. 150) సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రాన్ని అల్లు అర్జున్‌ తండ్రి, గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) అధినేత అల్లు అరవింద్‌ (Allu Aravind) ఎంతగానో ఆశపడ్డారు. కానీ అనూహ్యంగా రామ్‌ చరణ్‌ తెరపైకి వచ్చి తాను నిర్మిస్తానని పట్టుబట్టాడు. ఈ విషయంలో చిరు కూడా కొడుకు పక్షాన నిలబడ్డాడు. దీంతో రామ్‌చరణ్‌ ప్రత్యేకంగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్టార్ట్‌ చేసి ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రాన్ని నిర్మించారు. ఈ విషయంలో అల్లు అరవింద్‌ బాగా హర్ట్ అయినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపించింది. ఆ తర్వాత అయినా చిరుతో చేయవచ్చని అల్లు అరవింద్ భావించారు. ఆ కోరిక ఇప్పటివరకూ నెరవేరలేదు. ‘ఖైదీ నెంబర్‌ 150’ తర్వాత చిరు వరుసగా ‘సైరా నరసింహా రెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రాలను రామ్‌చరణ్‌ బ్యానర్‌లోనే చేయడం గమనార్హం.

    గీతా ఆర్ట్స్‌ను దూరం పెట్టిన మెగా హీరోలు?

    ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రం నుంచే మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదం మెుదలైందన్న వాదనలు ఉన్నాయి. 2017లో ఆ చిత్రం రిలీజవ్వగా అప్పటినుంచి ఒక్క మెగా హీరో కూడా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నటించలేదు. 2016లో రామ్‌ చరణ్‌తో చేసిన ‘ధ్రువ’ చిత్రం మెగా హీరోలతో అల్లు అరవింద్‌ చేసిన ఆఖరి మూవీ. అంతకుముందు రామ్‌ చరణ్‌తో ‘మగధీర’, సాయి ధరమ్‌ తేజ్‌తో ‘పిల్ల నువ్వు లేని జీవితం’, చిరంజీవితో లెక్కలేనన్ని సినిమాలను అల్లు అరవింద్‌ ప్రొడ్యూస్ చేశారు. వాస్తవానికి గీతా ఆర్ట్స్‌లో వచ్చిన మెజారిటీ హిట్‌ చిత్రాలు చిరంజీవి నటించినవే. అప్పట్లో  క్రమం తప్పకుండా చిరుతో అల్లు అరవింద్‌ సినిమాలు చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే రామ్‌చరణ్‌ కొత్త ప్రొడక్షన్ హౌస్‌ స్టార్ట్‌ చేశారో ఆ తర్వాత చిరు ఒక్క మూవీ కూడా అల్లు అరవింద్ బ్యానర్‌లో చేయలేదు. మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ కూడా ఆ బ్యానర్‌లో నటించలేదు. దీంతో అల్లు అరవింద్‌ను సినిమాల పరంగా దూరం పెట్టారా అన్న అనుమానం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. 

    అల్లు బ్రాండ్‌ కోసమేనా ఇదంతా?

    నిన్న, మెున్నటి వరకూ అల్లు, మెగా ఫ్యామిలీని ఇండస్ట్రీ వర్గాలు, ఆడియన్స్‌ ఒకటిగానే చూశారు. ఆ రెండు కుటుంబాలకు చిరంజీవినే పెద్ద తలగా భావించారు. చిరు తర్వాతనే అల్లు అరవింద్‌ అయినా అన్న భావన చాలా మందిలో ఉండేది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించి, స్టార్ ప్రొడ్యుసర్‌గా వెలుగొందుతున్న తన తండ్రికి మెగా కాంపౌండ్‌లో ఉండటం వల్ల సరైన గుర్తింపు రాలేదని అల్లు అర్జున్‌ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 2021లో వచ్చిన పుష్ప చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించడం కూడా బన్నీ ఆలోచనల్లో మార్పులు తీసుకొచ్చినట్లు టాక్ ఉంది. చిరంజీవి అంటే మెగా అనే బ్రాండ్‌ ఎలా ఉందో, తన పేరు మీద అల్లు అన్న బ్రాండ్‌ను క్రియేట్‌ చేయాలని బన్నీ భావించినట్లు టాక్‌. తద్వారా తన తండ్రికి చిరుకు మించిన గుర్తింపు తీసుకురావాలని అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే మెగా కాంపౌండ్‌ను దాటి బన్నీ బయటకు వచ్చేశారని తెలుస్తోంది. అందుకే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. పవన్‌ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతివ్వడం, అంతకముందు పవన్‌ గురించి ‘చెప్పను బ్రదర్‌’ అని వ్యాఖ్యానించడం ఈ క్రమంలో జరిగినవేనని అంటున్నారు. 

    చిరు కూడా దూరం పెట్టాడా?

    మెగాస్టార్‌ చిరంజీవి ప్రతీ ఒక్కరినీ సమానంగా చూస్తుంటారు. మెగా హీరోలతో పాటు కొత్తగా ఇండస్ట్రీకి వస్తోన్న వారిని సైతం స్వయంగా ఈవెంట్స్‌కు వెళ్లి మద్దతిస్తున్నారు. వారి చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసి తనవంతుగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఇటీవల ‘మట్కా’ సినిమా పోస్టర్‌ను సైతం షేర్‌ చేసి నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌కి అల్‌ ది బెస్ట్ చెప్పారు. అలాగే కూతురు నిర్మించిన ‘పరువు’ సిరీస్‌ను సైతం ప్రచారం చేశారు. అటువంటి చిరు తన మేనల్లుడు అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ గురించి ఒక్క పోస్టు కూడా పెట్టకపోవడం చర్చకు తావిస్తోంది. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘పుష్ప 2’ గురించి కనీసం ప్రస్తావించకపోవడం అల్లు – మెగా కుటుంబాల మధ్య ఉన్న వివాదానికి అద్దం పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చిరు కూడా అల్లు అర్జున్‌ను దూరం పెట్టారా? అన్న భావను కలిగిస్తున్నాయి. అటు అల్లు అర్జున్‌ సైతం ఇటీవల బాలయ్య షోలో పాల్గొని చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను తోటి యాక్టర్లుగా మాత్రమే ట్రీట్‌ చేశాడు. మామయ్య అంటూ ఎక్కడా మాట్లాడలేదు. 

    ‘పుష్ప 2’తో ముదిరిన వివాదం

    అల్లు, మెగా కుటుంబాల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా వారంతా ఒకటే ఫ్యామిలీ అని న్యూట్రల్‌ ఆడియన్స్‌ ఇప్పటివరకూ అభిప్రాయపడుతూ వచ్చారు. ఒకరిపై ఒకరు నేరుగా విమర్శ చేసుకోనప్పుడు ఎందుకు అనవసరంగా రూమర్లు స్ప్రెడ్‌ చేస్తారని ఫిల్మ్‌ వర్గాలు సైతం మండిపడుతూ వచ్చాయి. అయితే ‘పుష్ప 2’ లాంటి పాన్‌ ఇండియా చిత్రంలో మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేసినట్లు వార్తలు రావడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఇది కావాలని చేసి ఉంటే మాత్రం కచ్చితంగా అది రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తుందని అంటున్నారు. సందర్భానుసారం వచ్చిన డైలాగ్స్‌ మాత్రమే అని బన్నీ ఫ్యాన్స్‌ చెబుతున్నప్పటికీ మెగా ఫ్యాన్స్‌ ఒప్పుకోవడం లేదు. తమ అభిమాన కుటుంబాన్ని కించపరిచేందుకే బన్నీ కావాలని టార్గెట్‌ చేశాడని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మున్ముందు ఈ వివాదం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version