నటీనటులు: సుహాస్, శివానీ నగారం, గోపరాజు రమణ, స్వర్ణకాంత్, నితిన్ ప్రసన్న, శరణ్య ప్రదీప్ తదితరులు
రచన, దర్శకత్వం: దుష్యంత్
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్
ఎడిటింగ్: కోదాటి పవన్ కల్యాణ్
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, బన్నీవాస్, వెంకటేశ్ మహా (సమర్పణ)
విడుదల: 02-02-2024
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన నటుడు సుహాస్ (Suhas).. అనతికాలంలోనే టాలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదిగాడు. ‘కలర్‌ఫొటో’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ క్రమంలోనే సుహాస్ హీరోగా రూపొందిన మరో చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band Review). జీఏ 2 పిక్చర్స్ నిర్మాణంలో భాగస్వామి కావడంతో పాటు ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి చిత్రం ఎలా ఉంది? సుహాస్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో మల్లి (సుహాస్) ఓ సభ్యుడు. చిరతపల్లిలో తన కుటుంబంతో నివసిస్తుంటాడు. అక్క పద్మ (శరణ్య ప్రదీప్) స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఊరి మోతుబరి వెంకట్‌బాబు (నితిన్ ప్రసన్న) వల్లే పద్మకి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే ఓ పుకారు మొదలవుతుంది. ఓ కారణం చేత వెంకట్‌బాబు – మల్లికీ మధ్య వైరం మొదలవుతుంది. అవి చిలికి చిలికి గాలివానలా మారతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? లక్ష్మి (శివాని నాగారం), మల్లిల ప్రేమ కథ ఏంటి? అది చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే?
ఈ సినిమాలో పాత్రలు తప్ప (Ambajipeta Marriage Band) నటీనటులు ఎక్కడా కనిపించరు. ప్రతీ ఒక్క నటుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. మల్లి పాత్రలో సుహాస్ అదరగొట్టాడు. ప్రథమార్ధంలో అబ్బాస్ హెయిర్ స్టైల్‌తో నవ్వించిన అతడు, ద్వితీయార్ధంలో గుండుతో కనిపిస్తూ ఎంతో సహజంగా నటించాడు. భావోద్వేగ సన్నివేశాల్లో అతడి నటన మనసుల్ని హత్తుకుంటుంది. ఇక హీరోయిన్ శివానీ నాగారం.. లక్ష్మి పాత్రకి 100 శాతం న్యాయం చేసింది. సుహాస్ అక్కగా చేసిన శరణ్య ప్రదీప్ సినిమాకి మరో హీరో అని చెప్పవచ్చు. ఆమె పాత్రని డిజైన్ చేసిన తీరు సినిమాకే హైలైట్. నితిన్, వినయ మహాదేవ్, హీరోకి స్నేహితుడిగా కనిపించే జగదీష్ బండారి పాత్రలు ఆకట్టుకుంటాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
డబ్బు, కులం వ్యాత్యాసం కలిగిన ప్రేమ కథలు, రివేంజ్ డ్రామాలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ మూవీ కూడా అదే కోవకి చెందిందే. కానీ, డైరెక్టర్ దుష్యంత్ (Ambajipeta Marriage Band Review) కథకు అక్క-తమ్ముడి ఎమోషన్స్, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్‌ను జోడించి కొత్తదనం తీసుకువచ్చారు. కులాల మధ్య అంతరాల్ని, ఆర్థిక అసమానతల్నీ సహజంగా ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను కథకు కనెక్ట్ చేశాడు. ప్రథమార్థాన్ని అందమైన ప్రేమ కథ, సరదా సరదా సన్నివేశాలు చుట్టూ తిప్పిన దర్శకుడు.. విరామం ముందు వచ్చే సన్నివేశంతో సినిమాను కీలక మలుపు తిరిగేలా చేశారు. ద్వితియార్థంలో అత్మాభిమానాన్నే ప్రధాన అంశంగా తీసుకొని తనదైన శైలిలో కొత్త రివేంజ్ డ్రామాను ఆవిష్కరించారు. కథ ఊహకు తగ్గట్టే సాగుతున్నా.. బలమైన సన్నివేశాలు, డ్రామాతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించలేదు. ఓవరాల్‌గా డైరెక్టర్ దుష్యంత్ పనితనం మెప్పిస్తుంది.
సాంకేతికంగా..
సాంకేతిక విభాగాలన్నీ మంచి పనితీరుని కనబరిచాయి. శేఖర్ చంద్ర పాటలు, నేపథ్య సంగీతం, వాజిద్ బేగ్ తన కెమెరాతో చిరతపల్లిని ఆవిష్కరించిన తీరు సినిమాకి ప్రధానబలం. ఎడిటింగ్, బలమైన రచన సినిమా గమనాన్నే మార్చేశాయి. మేకింగ్ పరంగానూ ఎంతో పరిణతి కనిపిస్తుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
ప్లస్ పాయింట్స్
- సుహాస్, శరణ్య నటన
- కథ, నేపథ్యం
- భావోద్వేగ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- అక్కడక్కడ బోరింగ్ సీన్లు
రేటింగ్: 3.5/5
ఓటీటీ వేదిక లాక్!
ఇక ఈ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ చిత్రం అప్పుడే ఓటీటీ పార్ట్నర్‌ను కూడా లాక్ చేసుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ఆహా (Aha) ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించున్నట్లు కన్‌ఫార్మ్ అయ్యింది. దీంతో థియేటర్స్‌లో రన్ అనంతరం ఈ సినిమా ఆహాలోనే అందుబాటులోకి రానుంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్