ఆపిల్ ఇటీవల iOS 18.1 అప్‌డేట్ ద్వారా యూజర్లకు కొత్త ఫీచర్లు అందించింది. వీటిలో ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో పాటు కాల్ రికార్డింగ్ వంటి కొత్త సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆపిల్ iOS, iPadOS 18.2 పబ్లిక్ బీటాను విడుదల చేసింది. ఈ తాజా అప్‌డేట్‌లో మరిన్ని అదనపు ఫీచర్లను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఇప్పుడు యూజర్లు ChatGPT సేవలను ఎటువంటి అకౌంట్ అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. అలాగే, ChatGPTని Siriతో అనుసంధానం చేయడం ద్వారా, ఈ వర్చువల్ అసిస్టెంట్ మరింత బలంగా మారింది.
iOS 18.2 పబ్లిక్ బీటా వెర్షన్‌లో Siri మరింత అభివృద్ధి చెందింది. దీంతో ChatGPT ద్వారా టెక్స్ట్ రైటింగ్, వివిధ ప్రశ్నలకు సమాధానాలు పొందడం, గ్రాఫిక్స్ సృష్టించడం వంటి అనేక టాస్క్‌లు సులభంగా చేయవచ్చు. ఇమేజ్ ప్లేగ్రౌండ్ టూల్‌తో యూజర్లు కొత్త ఇమేజ్‌లను రూపొందించడానికి అవకాశం ఉంది.
ఈ కొత్త అప్‌డేట్‌తో ఐఫోన్ 16 యూజర్లు కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా సెర్చ్ చేయడం, వస్తువులను గుర్తించడం వంటి పనులు సులభంగా చేయవచ్చు. ఈ కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా విజువల్ ఇంటెలిజెన్స్‌ను యాక్టివేట్ చేయవచ్చు. ఆపిల్ ఐఓఎస్ 18.2 తో పాటు, tvOS 18.2, macOS Sequoia 15.2 మరియు iPadOS 18.2 పబ్లిక్ బీటా వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.
iOS 18.2 పబ్లిక్ బీటా డౌన్‌లోడ్ చేసుకునే విధానం
- ముందుగా ఐఫోన్ బ్రౌజర్ ద్వారా ఆపిల్ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత ఆపిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. ఆపిల్ ఐడీ లేకుంటే సైట్‌లో క్రియేట్ చేసుకునే సౌకర్యం ఉంది.
- బీటా ప్రోగ్రాంలోకి లాగిన్ అయిన తరువాత, iOS ట్యాబ్‌పై క్లిక్ చేసి, iOS 18.2 పబ్లిక్ బీటా వివరాలు చూడవచ్చు.
- అక్కడ ఉన్న బ్లూ లింక్‌పై క్లిక్ చేసి, ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
- జనరల్ సెట్టింగ్స్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ > బీటా అప్‌డేట్‌పై క్లిక్ చేయాలి.
- చివరిగా iOS 18.2 పబ్లిక్ బీటాను సెలెక్ట్ చేయాలి.
iOS 18.1 ఫీచర్లు- సపోర్ట్ చేసే మోడళ్లు
ఇటీవలే విడుదలైన iOS 18.1 అప్‌డేట్ ద్వారా ఆపిల్ యూజర్లకు అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ వెర్షన్‌ను ఐఫోన్ SE 2 మరియు ఆ తరువాతి మోడళ్లు సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఐఫోన్ XS, XS మ్యాక్స్, XR, ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 15 సిరీస్, అలాగే ఐఫోన్ 16 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి.
కొత్తగా వచ్చిన ఆపిల్ ఐఓఎస్ 18.2 పబ్లిక్ బీటా ద్వారా యూజర్లు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని పొందవచ్చు, అలాగే ఈ కొత్త ఫీచర్లను ఉపయోగించి తమ పనులను మరింత సులభతరం చేసుకోవచ్చు.