Apple Vision Pro: టెక్నాలజీలో సరికొత్త విప్లవం.. ఐపాడ్, ఐఫోన్, చాట్‌జీపీటీ తర్వాత ఇదే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Apple Vision Pro: టెక్నాలజీలో సరికొత్త విప్లవం.. ఐపాడ్, ఐఫోన్, చాట్‌జీపీటీ తర్వాత ఇదే..!

    Apple Vision Pro: టెక్నాలజీలో సరికొత్త విప్లవం.. ఐపాడ్, ఐఫోన్, చాట్‌జీపీటీ తర్వాత ఇదే..!

    June 7, 2023

    ఇంట్లోనే కూర్చుని నయాగరా జలపాతం అందాలను చూస్తూ వేడి వేడి మిర్చీలు తింటుంటే ఎంత బాగుంటుందో కదా. ఈ అనుభూతిని కల్పించేందుకు యాపిల్ రెడీ అయింది. టెక్నాలజీలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చేందుకు టెక్ దిగ్గజం నడుం బిగించింది. ఐపాడ్, ఐఫోన్, చాట్‌జీపీటీ ఆయా రంగాల్లో ఎలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయో ‘యాపిల్ విజన్ ప్రో’(Apple Vision Pro) కూడా టెక్నాలజీలో కొత్త శకానికి నాంది పలకనుంది. వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో భాగంగా యాపిల్ కంపెనీ తొలిసారిగా ఈ ప్రొడక్టును పరిచయం చేసింది. 

    ఏమిటీ విజన్ ప్రో..

    ప్రస్తుతం అగ్‌మెంటెడ్ రియాలిటీ(ఏఆర్) హెడ్‌సెట్‌లను వాడుతున్నారు. అంటే రియల్ వరల్డ్‌ని చూస్తున్న అనుభూతిని ఈ హెడ్‌సెట్ కలిగిస్తుంది. మరోవైపు, వర్చువల్ రియాలిటీ(వీఆర్) హెడ్‌సెట్‌లో ఒక కృత్రిమ ప్రపంచాన్ని చూడొచ్చు. అయితే, ఏఆర్, వీఆర్‌లను కలగలపి ఫిజికల్ రియాలిటీ(భౌతిక ప్రపంచం) అనుభూతిని కలిగించడానికి వస్తున్నదే విజన్ ప్రో. అంటే ఈ విజన్ ప్రో హెడ్‌సెట్ పెట్టుకుంటే మరొక ప్రపంచంలోకి వెళ్లినట్లే. వేరే గ్రహంలోకి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి ఫీలింగ్‌నే ఇస్తుంది. చెట్ల మధ్యలో ఉంటే ఆ చల్లని గాలిని జనరేట్ చేస్తుంది. 

    థియేటర్లకు పోనక్కర్లేదు..

    విజన్ ప్రో ఒక స్పేషియల్ కంప్యూటింగ్ డివైజ్‌లా పని చేస్తుంది. యూజర్లకు కావాల్సినప్పుడు ఇందులో వీడియోలు చూడొచ్చు. థియేటర్లలో ఉండే తెర కన్నా భారీ స్క్రీన్‌ని సెట్ చేసుకోవచ్చు. 100 ఫీట్ల వరకు కాన్వాస్‌ని ఏర్పాటు చేసుకుని హాయిగా చూడొచ్చు. సౌండ్ సిస్టం కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తుంది. థియేటర్లో కూర్చుని సినిమా చూసినట్లే అనిపిస్తుంది. పైగా, ఇందులో 3-D ఇంటర్‌ఫేస్ ఉంది. అంటే మన చేతులు, కళ్లు, గొంతుతోనే హెడ్‌సెట్ కంట్రోల్ చేయవచ్చు. గాలిలోనే స్క్రీన్‌ని టచ్ చేసి ఆపరేట్ చేయొచ్చు. ఇలా ఇష్టమైన ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

    ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టం..

    యాపిల్ ప్రొడక్టులతో వినియోగిస్తున్న ఐవోఎస్ సాఫ్ట్‌వేర్‌ని ఈ సారి కంపెనీ పక్కన పెట్టింది. ఈ స్పేషియల్ కంప్యూటింగ్ డివైజ్ కోసం ప్రత్యేకంగా మరొక ఆపరేటింగ్ సిస్టంని డెవలప్ చేస్తోంది. దీనికి విజన్‌ఓఎస్(Vision OS) అని నామకరణం చేసింది. దీంతో ప్రపంచంలోనే తొలి స్పేషియల్ ఓఎస్‌గా ఇది రికార్డుకెక్కనుంది. డిజిటల్ కంటెంట్‌‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు యూజర్లకు ఈ ఓఎస్ సహకరిస్తుంది. క్లాస్ రూంలో లైవ్ సెషన్స్ వింటున్న అనుభూతిని ఇది కలిగిస్తుందన్నమాట. 

    సైజు, బ్యాటరీ..

    ఏఆర్ హెడ్‌సెట్‌లలో ప్రధాన సమస్య బరువే. కొన్ని హెడ్‌సెట్లు చాలా బరువుగా ఉంటాయి. దీంతో యూజర్లు ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా విజన్ ప్రోని యాపిల్ తీర్చిదిద్దింది. తేలికగా ఉండేలా హెడ్‌సెట్‌ని తయారు చేసింది. ఇందుకోసం తెలివిగా ఎక్స్‌టర్నల్ బ్యాటరీ ప్యాక్‌ని ఏర్పాటు చేసింది. దీంతో హెడ్‌సెట్ బరువు తేలికైపోయింది. దాదాపు 2 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ వచ్చే సూచనలు ఉన్నాయి. 

    డిస్‌ప్లే..

    యూజర్‌ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా డిస్‌ప్లేని యాపిల్ తీర్చిదిద్దింది. అల్ట్రా హెచ్‌డీ(Ultra HD) రెజల్యూషన్‌తో రెండు స్క్రీన్లు(ఒక్కో కన్నుకు ఒక్కోటి) ఉన్నాయి. ఇవి 23 మిలియన్ పిక్సెల్స్‌తో లోడ్ అయి ఉన్నాయి. అంటే స్వయంగా కళ్లతో చూసిన అనుభవాన్ని కలిగించే క్లారిటీతో డిజైన్ చేసింది. 180 డిగ్రీల వరకు వీడియో, ఆడియోలను హై రెజల్యూషన్‌లో రికార్డ్ చేయవచ్చు. ఫొటోలు తీసుకోవచ్చు. వీటిని క్లౌడ్‌లో సేవ్ చేసుకునే సదుపాయమూ ఉంది.

    ఫేస్‌టైమ్, ఐసైట్ ఫీచర్స్..

    విజన్ ప్రోలో ఫేస్‌టైమ్ ఫీచర్ ప్రత్యేకంగా నిలుస్తోంది. అంటే ఎక్కడో ఉన్న మన స్నేహితుడితో పక్కనే కూర్చుని సినిమా చూసేలా ఈ హెడ్‌సెట్ సహకరిస్తుంది. మిషిన్ టెక్నాలజీని ఉపయోగించి యాపిల్ ఈ ఫీచర్‌ని డెవలప్ చేసింది. ఫేస్‌టైమ్‌లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని అచ్చు గుద్దినట్లు చూపిస్తుంది. దీంతో పక్కనే, మనతోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఐసైట్ ఫీచర్‌తో పారదర్శకంగా చూడగలం. అంటే మనకు అద్దాలు పెట్టుకున్నట్లే. ఈ ఫీచర్‌తో యూజర్లు ఎంతో బెనెఫిట్ పొందనున్నారు.

    ధర..

    యాపిల్ విజన్ ప్రో ధర 3,499డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. అంటే దాదాపు రూ.3 లక్షలు అన్నమాట. తొలుత అమెరికా వాసులకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మిగతా దేశాలకు ఈ హెడ్‌సెట్‌లను యాపిల్ ఎగుమతి చేయనుంది.

    కండీషన్స్ అప్లై..

    ఈ హెడ్‌సెట్‌ని అందరూ ధరించడానికి వీల్లేదు. 13 సంవత్సరాలకు పైబడిన వారే దీనిని వాడేందుకు వీలుంది. అంటే, చిన్న పిల్లలను దీనికి దూరంగా ఉంచాలి. అదే విధంగా, కంటి సమస్యలు ఉన్నవారు ఈ హెడ్‌సెట్ వాడేముందు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ హెడ్‌సెట్ వాటర్ రెసిస్టెంటా? కాదా? అనే విషయంపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version