నటీనటులు: టొవినో థామస్, కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్, సురభి లక్ష్మి, బసిల్ జోసెఫ్, జగదీష్, కబీర్ దుహాన్‌సింగ్ తదితరులు
దర్శకత్వం: జితిన్ లాల్
రచన: సుజిత్ నంబియార్
సంగీతం : థిబు నినన్ థామస్
సినిమాటోగ్రఫీ: జోమోన్‌టి
ఎడిటింగ్: షమీర్ మహ్మద్
మలయాళ నటుడు టొవినో థామస్ (Tovino Thomas) తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు లీడ్ రోల్‌లో నటించిన ‘మిన్నల్ మురళి’, ‘2018’ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి. అతడు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఎ.ఆర్.ఎమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో టొవినో థామస్‌కు జోడీగా కృతి శెట్టి నటించింది. మలయాళంలో ‘అజయంతే రండమ్ మోషనమ్’ (ఎ.ఆర్.ఎమ్) పేరుతో ఈ చిత్రం రూపొందింది. తెలుగులో ‘అజయన్ చేసిన రెండో దొంగతనం’ అని అర్థం. కాగా, పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘ఏఆర్ఎం’ మూవీ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? టొవినో థామస్ ఖాతాలో మరో విజయం నమోదైనట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
అజయ్ (టొవినో థామస్) ఊళ్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లి (రోహిణి)తో కలిసి జీవిస్తుంటాడు. తాత మణియన్ (టొవినో థామస్) ఒకప్పుడు పేరు మోసిన దొంగ కావడంతో ఊళ్లో ఎక్కడ దొంగతనం జరిగినా అజయ్‌ని అనుమానిస్తుంటారు. మరోవైపు ఆ ఊరి గుడిలో కొలువైన శ్రీభూతి దీపం (విగ్రహం) బంగారం కంటే ఎంతో విలువైంది. దాన్ని కాజేయాలనే లక్ష్యంతో సుదేవ్‌వర్మ (హరీష్ ఉత్తమన్) ఆ ఊళ్లో అడుగుపెడతాడు. దీపాన్ని కొట్టేసి ఆ నింద అజయ్‌పై పడేలా ప్లాన్ చేస్తాడు. అయితే ఎన్నో తరతరాలుగా ఆ దీపాన్ని అజయ్ కుటుంబం రక్షిస్తూ వస్తుంది. మరి ఈసారి అజయ్ దాన్ని ఎలా కాపాడాడు? ఆ విగ్రహం వెనకున్న చరిత్ర ఏంటి? ఆ చరిత్రలో మహావీరుడు కుంజికేలు (టొవినో థామస్) పాత్ర? లక్ష్మి (కృతిశెట్టి)తో అజయ్ లవ్ ట్రాక్? గురించి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
టొవినో థామస్ మూడు పాత్రలపై గట్టి ప్రభావం చూపించారు. వీరుడైన కుంజికేలుగా అతడు ప్రదర్శించిన యుద్ధ విద్యలు, చేసిన పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. తాత మణియన్ పాత్రలో కూడా అతడి నటన మెప్పిస్తుంది. ఆ రెండు పాత్రల్లో టొవినో ఎంత వీరోచితంగా నటించాడో అజయ్ పాత్రలో అంతే సాత్వికంగా చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రతీ పాత్రలో వైవిధ్యం చూపించి నటనలో తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. అటు లక్ష్మి పాత్రలో కృతిశెట్టి చక్కటి నటన కనబరించింది. 90ల నాటి అమ్మాయిగా అభినయం ప్రదర్శించింది. సురభి లక్ష్మి పాత్ర ఆకట్టుకుంటుంది. ఆమె రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. రోహిణి, హరీష్ ఉత్తమన్ పాత్రలూ కథలో కీలకం.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు జితిన్‌లాల్‌కు ఇదే తొలి చిత్రమైనా మూడు తరాలతో ముడిపడిన ఈ కథని స్పష్టంగా తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. మహావీరుడు కేలు కథలోకి ఎంట్రీ ఇవ్వడం నుంచి ఆయన సినిమాను పరుగులు పెట్టించారు. అతడి పరాక్రమం, రాజ్యాన్ని కాపాడినందుకు మహారాజుని అడిగిన వరం, ఆ తర్వాత అతనికి తెలిసిన నిజం తదితర సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. కేలు పాత్రకు దీటుగా తర్వాత తరానికి చెందిన మణియన్ పాత్రని ఆవిష్కరించారు దర్శకుడు. ఈ సినిమాకి మణియన్ పాత్రే హైలైట్. దీపం ఎక్కడుందో మణియన్ కనుక్కుని, దాన్ని కాజేసే సన్నివేశాలు బాగుంటాయి. మణియన్, అజయన్ పాత్రల్ని ఒకే చోటకి తీసుకొచ్చినప్పుడు రేకెత్తే సంఘర్షణ హృదయాల్ని హత్తుకుంటుంది. అయితే ఇతర పాత్రలు ప్రభావవంతంగా లేకపోవడం, పేలవమైన లవ్‌ట్రాక్, ఊహకందే కథనం, బలహీనమైన క్లైమాక్స్ ఈ చిత్రానికి మైనస్‌లుగా మారాయి.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. థిబు నేపథ్య సంగీతం, పాటలు చిత్రానికి కొత్త హంగుని చేకూర్చాయి. జోమోన్ టి.జాన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- టొవినో థామస్ నటన
- కథా నేపథ్యం
- సంగీతం
మైనస్ పాయింట్స్
- ఊహకందే కథనం
- బలహీనమైన క్లైమాక్స్