Asia Cup Final 2023: ఫైనల్లో భారత్‌ గెలుపు ఖాయం.. శ్రీలంకపై తిరుగులేని రికార్డు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Asia Cup Final 2023: ఫైనల్లో భారత్‌ గెలుపు ఖాయం.. శ్రీలంకపై తిరుగులేని రికార్డు!

    Asia Cup Final 2023: ఫైనల్లో భారత్‌ గెలుపు ఖాయం.. శ్రీలంకపై తిరుగులేని రికార్డు!

    September 15, 2023

    ఆసియాకప్‌-2023 పోరు తుదిదశకు చేరుకుంది. గురువారం పాకిస్తాన్‌పై ఆఖరి బంతిలో గెలవడం ద్వారా శ్రీలంక ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఇప్పటికే ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న టీమ్‌ఇండియాతో ఆదివారం తలపడేందుకు సిద్ధమైంది. అయితే ఫైనల్లో భారత్‌-పాక్‌ మరోమారు పోటీ పడతాయని టోర్నీ ప్రారంభానికి ముందు అంతా భావించారు. కానీ, ఈ మెగా ఈవెంట్‌లో గొప్పగా ఆడిన శ్రీలంక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా రెండోసారి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరి ఫైనల్లో భారత్‌-శ్రీలంక గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పటివరకూ ఎన్నిసార్లు ఈ జట్లు తలపడ్డాయి? జట్టు విజయంలో కీలకపాత్ర పోషించే కీలక ప్లేయర్లు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    భారత్‌దే పైచేయి

    ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 1984 నుంచి 2022 మధ్య 15సార్లు ఆసియాకప్‌ నిర్వహించగా భారత్‌ అత్యధికంగా ఏడుసార్లు టోర్నీ విజేతగా నిలిచింది. మూడు సార్లు రన్నరప్‌గా నిలిచింది. అటు శ్రీలంక ఆరు సార్లు టైటిల్‌ కైవసం చేసుకోగా మరో ఆరు సార్లు ఫైనల్లో ఓటమి చవిచూసింది. ఇందులో ఐదు భారత్‌పై ఓడిపోవడం గమనార్హం. ఇక తాజాగా ఈ రెండు జట్లు మరోమారు ఫైనల్లో తలపడుతుండగా.. గత ఫలితాలను బట్టి భారత్‌ టైటిల్‌ ఫేవరేట్ అని చెప్పవచ్చు. 

    రోహిత్‌ & గిల్‌ జోడీ

    ఆసియాకప్‌ 2023 భాగంగా పాక్‌పై జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్‌ – శుబ్‌మన్‌ గిల్ జోడీ తొలివికెట్‌కు 15 పరుగుల భాగస్వామ్యం మాత్రమే నమోదు చేసింది. ఆ తర్వాత నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌ అందుకున్న వీరిద్దరు 147 పరుగులు లక్ష్యాన్ని వికెట్‌ కోల్పోకుండా ఛేదించారు. ఆ తర్వాత సూపర్‌ 4లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 121, శ్రీలంక మ్యాచ్‌లో 80 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి రోహిత్‌-గిల్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆదివారం జరిగే ఫైనల్లోనూ ఈ జోడి రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. 

    అందరీ కళ్లు విరాట్‌పైనే..!

    ఆదివారం (సెప్టెంబర్‌ 17) జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ పైనే అందరి దృష్టి ఉండనుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌ జరగనున్న కొలంబోలోని ప్రేమదాస మైదానం కోహ్లీకి బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఈ స్టేడియంలో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో విరాట్‌ సెంచరీలతో చెలరేగాడు. రీసెంట్‌గా ఇదే మైదానంలో పాక్‌పై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 122 పరుగులతో విధ్వసం సృష్టించాడు. ఈ నేపథ్యంలో తనకు బాగా కలిసొచ్చిన మైదానంలో ఫైనల్స్‌ జరుగుతుండంతో విరాట్‌ నుంచి మరో భారీ ఇన్నింగ్స్‌ను టీమ్ఇండియా ఆశిస్తోంది. 

    కేఎల్‌ రాహుల్‌ కీలకం

    పాకిస్తాన్‌పై జరిగిన తన కమ్‌బ్యాక్‌ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ సెంచరీ (111*)తో అదరగొట్టాడు. గాయం నుంచి కోలుకొని కొన్ని నెలల తర్వాత మైదానంలోకి అడుపెట్టినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మునుపటి ఫామ్‌తో రాణించాడు. శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లోనూ కీలక సమయంలో 39 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. ఇప్పుడు ఫైనల్లోనూ రాహుల్‌ జట్టుకు కీలకంగా మారనున్నాడు. అతడు తన ఫామ్‌ను ఫైనల్లోనూ కొనసాగిస్తే భారత్‌ విజయం మరింత తేలక కానుంది. 

    బుమ్రా – కుల్‌దీప్‌

    ఆసియాకప్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు చెలరేగుతున్నారు. గాయం నుంచి కోలుకొని ఆసియా కప్‌లో అడుగుపెట్టిన బుమ్రా భారత బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఆరంభంలో ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లు పడగొట్టి తన బౌలింగ్‌లో పదును తగ్గలేదని నిరూపిస్తున్నాడు. ఇక ఈ టోర్నీ విశేషంగా రాణిస్తున్న భారత బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కుల్‌దీప్‌ 4 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో మెుత్తం 10 వికెట్లు పడగొట్టి జట్టు తరపున లీడింగ్‌ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఫైనల్‌లోనూ కుల్‌దీప్‌ ఇదే ప్రదర్శన చేస్తే లంక బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ఇక మహ్మద్‌ సిరాజ్‌, హార్దిక్‌ పాండ్య, జడేజా మిడిల్‌ ఓవర్స్‌లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెడుతున్నారు. 

    శ్రీలంకతో అంత ఈజీ కాదు..!

    ఫైనల్లో శ్రీలంకను అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌. పైగా క్రితం మ్యాచ్‌లో లంక బౌలర్లు భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్లు దునిత్‌ వెల్లలాగే (5), అసలంక (4) గత మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్‌ వెన్ను విరిచారు. వీరిద్దరి విషయంలో జాగ్రత్త వహించకపోతే భారత్‌కు మరోమారు ఇబ్బంది తప్పదు. ఇక ఆ జట్టు పేసర్‌ మతీష పతిరణ కూడా ఈ టోర్నీలో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ రాణిస్తున్నాడు. అతడి విషయంలోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. 

    హోమ్‌ గ్రౌండ్‌

    ఫైనల్లో శ్రీలంకకు బాగా కలిసొచ్చే అంశం హౌమ్‌గ్రౌండ్‌. ఏ జట్టుకైన హౌమ్‌గ్రౌండ్‌లో ఆడటం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుంది. అదే సమయంలో ప్రత్యర్థులకు అతి పెద్ద సమస్యగా ఉంటుంది. ఫలితంగా టీమ్‌ఇండియా గ్రౌండ్‌లోని 11 మందితో పాటు, శ్రీలంక ఆడియన్స్‌ను కూడా మానసికంగా ఎదుర్కొవాల్సి ఉంటుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version