నటీనటులు : అంజలి, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, రవీంద్ర విజయ్, షణ్ముఖ్, మహబూబ్ బాషా, శ్రీతేజ్, బేబీ చైత్ర, సమ్మెట గాంధీ తదితరులు
దర్శకత్వం : ముఖేష్ ప్రజాపతి
సినిమాటోగ్రఫీ : ప్రసన్న ఎస్. కుమార్
సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని
ఎడిటింగ్ : రవితేజ గిరిజల
నిర్మాత : ప్రశాంత్ మలిశెట్టి
ఓటీటీ వేదిక : జీ 5
విడుదల తేదీ : 19-07-2024
ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్ ‘బహిష్కరణ’. రూరల్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సిరీస్ అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో జులై 19న ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. జీ 5 వేదికగా మెుత్తం ఆరు ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
1990 దశకంలో కథ సాగుతుంది. గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి గ్రామానికి శివయ్య (రవీంద్ర విజయ్) ప్రెసిడెంట్‌గా ఉంటాడు. ఊర్లో ఆయన మాటే శాసనం. డబ్బు, అధికారం అడ్డుపెట్టుకొని మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. పుష్ప (అంజలి) అతడి ఉంపుడుగత్తెగా ఉంటుంది. శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్) పుష్పను ప్రేమిస్తాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. ఇందుకు శివయ్య ఒప్పుకున్నట్లే నటించి తెలివిగా అడ్డుకుంటాడు. దర్శికి మరదలు లక్ష్మీ (అనన్య నాగళ్ల)తో పెళ్లి జరిపిస్తాడు. ఈ క్రమంలోనే దర్శి ఓ కేసులో ఇరుక్కుంటాడు. అసలు దర్శిని ఇరికించింది ఎవరు? శివయ్యకు దర్శి ఎందుకు ఎదురుతిరిగాడు? దానివల్ల దర్శికి పట్టిన గతి ఏంటి? దర్శి భార్య లక్ష్మీ సాయంతో శివయ్యపై పుష్ప ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది ఈ సిరీస్ స్టోరీ. ‘
ఎవరెలా చేశారంటే
వేశ్య పాత్రలో నటి అంజలి అదరగొట్టింది. తన డైలాగ్స్, మ్యానరిజమ్స్‌తో మిస్మరైజ్ చేసింది. ఇష్టంలేని జీవితాన్ని గడిపే వేశ్యగా, ప్రియుడి ప్రేమ కోసం పరితపించే మహిళగా చక్కటి వేరియేషన్స్ చూపించింది. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లోనూ అంజలి దుమ్మురేపింది. క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించింది. అటు దర్శిగా శ్రీతేజ్ నటన ఆకట్టుకుంది. అన్యాయాలను సహించలేని అట్టడుగు వర్గానికి చెందిన యువకుడి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. అటు లక్ష్మీ పాత్రలో అనన్య నాగళ్ల సహజమైన నటన కనబరిచింది. విలన్‌గా శివయ్య పాత్రలో రవీంద్ర విజయ్ సెటిల్ పర్‌ఫార్మెన్స్ కనబరిచాడు. తన డైలాగ్స్, లుక్స్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు యాక్ట్ చేసి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను రూపొందించారు. తన ప్రియుడికి జరిగిన అన్యాయంపై ఓ వేశ్య ఏ విధంగా పోరాడింది అన్న కాన్సెప్ట్‌తో తీసుకొచ్చారు. ఒకప్పుడు గ్రామాల్లో కులాల పట్టింపులు ఎలా ఉండేవో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు తక్కువ జాతిని వారిని ఎలా అణిచివేశారో చూపించారు. ముఖ్యంగా మహిళలు ఏ విధంగా అణిచివేయబడ్డారన్నది రా అండ్ రస్టిక్‌గా దర్శకుడు చూపించారు. క్యాస్ట్, అంటరానితనం వంటి సున్నితమైన అంశాలను టచ్ చేశారు. డ్రామా, ఎమోషన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే కాన్సెప్ట్ బాగున్నా ప్రజెంటేషన్ మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది. సిరీస్ మొత్తం పెద్ద మలుపులేమి లేకుండా ఫ్లాట్‌గా సాగిపోతుంది. వేశ్య బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉన్న మిగిలిన స్టోరీలైన్ పాత సినిమాలను గుర్తుకు తెస్తుంటుంది. కొన్ని డిస్టబింగ్ సన్నివేశాలను పక్కన పెడితే ‘బహిష్కరణ’ మిమ్మల్ని తప్పుకండా ఎంటర్‌టైన్ చేస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ ప్రసన్న ఎస్. కుమార్ చక్కటి పనితీరు కనబరిచాడు. తన కెమెరా నైపుణ్యంతో ఆడియన్స్ 90వ దశకంలోకి తీసుకెళ్లారు. సిద్ధార్థ్ సదాశివుని అందించిన నేపథ్య సంగీతం సిరీస్‌కు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌ను ఓ రెంజ్‌లో ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- అంజలి నటన
- పిరియాడికల్ రివేంజ్ డ్రామా
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- ట్విస్టులు లేకపోవడం
- కొన్ని బోరింగ్ సన్నివేశాలు