తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ వచ్చేసింది. బతుకమ్మ పాటల సందడి మొదలైంది. ప్రతి ఆడపడుచు ఉత్సాహంగా జరుపుకొనే సంబరం ఇది. ఈ సంబరాల్లో బతుకమ్మ పాటలది ప్రత్యేక స్థానం. మన అమ్మలు, అమ్మమ్మలు చాలా చక్కగా వీటిని పాడుతూ.. బతుకమ్మ ఆట ఆడుతుంటారు. కానీ నేటితరం యువతులకు ఈ జానపద పాటలపై పెద్దగా పట్టు లేదు. పెద్దవారితో కలిసి కాలు కదుపుతారు కానీ, పాటను అందుకోలేరు. పదాలు కూడా సరిగా పలకలేరు. ఎంతోమందికి ఈ పాటలు నేర్చుకోవాలనే కుతూహలం ఉన్నా.. వీలు కాకపోవచ్చు. ఈ కథనం ద్వారా YouSay సేకరించిన కొన్ని పాటలు మీకోసం. వాటి విశిష్టత గురించి తెలుసుకోండి. ఈ బతుకమ్మ పండుగకు సొంతంగా పాడుతూ వేడుకను జరుపుకోండి.
చిత్తూ చిత్తుల గుమ్మ..
చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దులగుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
రాగి బిందె తీస్క రమణీ నీళ్లాకు బోతె
రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
వెండి బిందె తీస్క వెలదీ నీళ్లాకు బోతె
వెంకటేశుడెదురాయెనమ్మో ఈ వాడలోన
బంగారు బిందె తీస్క భామా నీళ్లాకు బోతె
భగవంతు డెదురాయెనమ్మో ఈ వాడలోన
పగడాల బిందె తీస్క పడతీ నీళ్లాకు బోతె
పరమేశు డెదురాయెనమ్మో ఈ వాడలోన
ముత్యాల బిందె తీస్క ముదితా నీళ్లాకు బోతె
ముద్దు కృష్ణుడెదురాయెనమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దులగుమ్మ ||
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బతుకమ్మ అనే పదం ఎలా వాడుకలోకి వచ్చింది? దాని వెనక ఉన్న ఇతివృత్తాంతం ఏంటి? అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ పాటను కట్టారు. అదెలా ఉందో చూద్దాం.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
ఆనాటి కాలాన ఉయ్యాలో
ధర్మాంగుడను రాజు ఉయ్యాలో
ఆ రాజు భార్యయు ఉయ్యాలో..
అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో
నూరు నోములు నోమి ఉయ్యాలో
నూరు మందిని కాంచె ఉయ్యాలో
వారు శూరులై ఉయ్యాలో
వైరులచే హతమయిరి ఉయ్యాలో
తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో
తరగని శోకమున ఉయ్యాలో
ధన రాజ్యములను బాసి ఉయ్యాలో
దాయాదులను బాసి ఉయ్యాలో
వనితతో ఆ రాజు ఉయ్యాలో
వనమందు నివసించే ఉయ్యాలో
కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో
ఘన తపంబొనరించె ఉయ్యాలో
ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో
పలికె వరమడుగమని ఉయ్యాలో
వినిపించి వేడుచూ ఉయ్యాలో
వెలది తన గర్భమున ఉయ్యాలో..
పుట్టమని వేడగా ఉయ్యాలో
పూబోణి మది మెచ్చి ఉయ్యాలో
సత్యవతి గర్భమున ఉయ్యాలో
జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో
అంతలో మునులును ఉయ్యాలో
అక్కడికి వచ్చిరి ఉయ్యాలో..
కపిల గాలవూలు ఉయ్యాలో
కష్యపాంగ ఋషులు ఉయ్యాలో..
అత్రి వశిష్టులు ఉయ్యాలో
ఆకన్నియను చూచి ఉయ్యాలో..
బతుకనీయ తల్లి ఉయ్యాలో
బతుకమ్మ యనిరంత ఉయ్యాలో..
పిలువగా అతివలు ఉయ్యాలో
ప్రేమగా తల్లిదండ్రులు ఉయ్యాలో..
బతుకమ్మ యనుపేరు ఉయ్యాలో
ప్రజలంత అందురు ఉయ్యాలో
తాను ధన్యుడంటూ ఉయ్యాలో
తన బిడ్డతో రాజు ఉయ్యాలో
నిజ పట్నముకేగి ఉయ్యాలో
నేల పాలించగా ఉయ్యాలో
శ్రీ మహా విష్ణుండు ఉయ్యాలో
చక్రకుండను పేర ఉయ్యాలో
రాజు వేషమ్మున ఉయ్యాలో
రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో
ఈ ఇంట మునియుండి ఉయ్యాలో
అతిగా బతుకమ్మను ఉయ్యాలో
పెండ్లాడి కొడుకుల ఉయ్యాలో
పెక్కు మందిని కాంచె ఉయ్యాలో
ఆరు వేల మంది ఉయ్యాలో
అతి సుందరాంగులు ఉయ్యాలో
ధర్మాంగుడను రాజు ఉయ్యాలో
తన భార్య సత్యవతి ఉయ్యాలో
సిరిలేని సిరులతో ఉయ్యాలో
సంతోషమొందిరి ఉయ్యాలో..
జగతిపై బతుకమ్మ ఉయ్యాలో
శాశ్వతమ్ముగ వెలిసే ఉయ్యాలో
ఈ పాట పాడినను ఉయ్యాలో
ఈ పాట విన్నను ఉయ్యాలో
సౌభాగ్యములనిచ్చు ఉయ్యాలో
శ్రీ గౌరీ దేవి ఉయ్యాలో
సిరి సంపదలిచ్చు ఉయ్యాలో
శ్రీ లక్ష్మీ దేవి ఉయ్యాలో
ఘనమైన కీర్తిని ఉయ్యాలో
శ్రీ వాణి ఒసగును ఉయ్యాలో..
ఘనమైన కీర్తిని ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నాగమల్లేలో.. తీగమల్లేలో
పల్లెల్లో బతుకమ్మ నాగమల్లేలో
పువ్వయి పూసింది తీగమల్లేలో
పట్నంల బతుకమ్మ నాగమల్లేలో
పండూగ చేసింది తీగమల్లేలో
బాధల్ల బతుకమ్మ నాగమల్లేలో
బంధువై నిలిచింది తీగమల్లేలో
కష్టాల్లొ బతుకమ్మ నాగమల్లేలో
కన్నీరు తుడిచింది తీగమల్లేలో
తంగేడు పువ్వుల్లొ నాగమల్లేలో
తల్లి నిను కొలిచెదము తీగమల్లేలో
ఒక్కేసి పువ్వేసి చందమామా..
ఒక్కేసి పువ్వేసి చందమామా
ఒక్క జాము ఆయె చందమామా
పైన మఠం కట్టి చందమామా
కింద ఇల్లు కట్టి చందమామా
మఠంలో ఉన్న చందమామా
మాయదారి శివుడు చందమామా
శివపూజ వేళాయె చందమామ
శివుడు రాకపాయె చందమామా
గౌరి గద్దెల మీద చందమామా
జంగమయ్య ఉన్నాడె చందమామా
రెండేసి పూలేసి చందమామా
రెండు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
మూడేసి పూలేసి చందమామా
మూడు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
నాలుగేసి పూలేసి చందమామా
నాలుగు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడేల రాకపాయె చందమామా
ఐదేసి పూలేసి చందమామా
ఐదు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
ఆరేసి పూలేసి చందమామా
ఆరు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
ఏడేసి పూలేసి చందమామా
ఏడు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడేల రాకపాయె చందమామా
ఎనిమిదేసి పూలేసి చందమామా
ఎనిమిది జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
తొమ్మిదేసి పూలేసి చందమామా
తొమ్మిది జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
తంగేడు వనములకు చందమామా
తాళ్ళు కట్టాబోయె చందమామా
గుమ్మాడి వనమునకు చందమామా
గుళ్ళు కట్టాబోయె చందమామా
రుద్రాక్ష వనములకు చందమామా
నిద్ర చేయబాయె చందమామా
ఊరికి ఉత్తరానా.. వలలో
ఊరికి ఉత్తరానా.. వలలో
ఊరికి ఉత్తరానా … వలలో
ఊడాలా మర్రీ … వలలో
ఊడల మర్రి కిందా … వలలో
ఉత్తముడీ చవికే … వలలో
ఉత్తముని చవికేలో … వలలో
రత్నాల పందీరీ … వలలో
రత్తాల పందిట్లో … వలలో
ముత్యాలా కొలిమీ … వలలో
గిద్దెడు ముత్యాలా … వలలో
గిలకాలా కొలిమీ … వలలో
అరసోల ముత్యాలా … వలలో
అమరీనా కొలిమీ … వలలో
సోలెడు ముత్యాలా … వలలో
చోద్యంపూ కొలిమీ … వలలో
తూమెడు ముత్యాలా … వలలో
తూగేనే కొలిమీ … వలలో
చద్దన్నమూ తినీ … వలలో
సాగించూ కొలిమీ … వలలో
పాలన్నము దినీ … వలలో
పట్టేనే కొలిమీ … వలలో
రామ రామా రామ ఉయ్యాలో..
రామ రామా రామ ఉయ్యాలో!
రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామా నంది ఉయ్యాలో!
రాగ మెత్తారాదు ఉయ్యాలో
చారెడు బియ్యంలో ఉయ్యాలో
చారెడూ పప్పు పోసి ఉయ్యాలో
చారెడు పప్పుపోసి ఉయ్యాలో
వన దేవుని తల్లి ఉయ్యాలో
అక్కమ్మ కేమొ ఉయ్యాలో
అన్నీ పెట్టింది ఉయ్యాలో
అప్పుడూ అక్కమ్మ ఉయ్యాలో
తిన్నట్టు తిని ఉయ్యాలో
తిన్నట్టు తినీ ఉయ్యాలో
పారేసినాది ఉయ్యాలో
పెద్దోడు రామన్న ఉయ్యాలో
బుద్ధిమంతుడాని ఉయ్యాలో
ఏడు రోజుల్ల ఉయ్యాలో
చెల్లెరో అక్కమ్మ ఉయ్యాలో
అక్కమ్మా కురులు ఉయ్యాలో
దురవాసినాయి ఉయ్యాలో
అందరానికాడ ఉయ్యాలో
ఆకు అందుకోని ఉయ్యాలో
ముట్టరాని కాడ ఉయ్యాలో
ముల్లు ముట్టుకోని ఉయ్యాలో
పెద్ద నేలు రాత ఉయ్యాలో
పేరువాడా రాసి ఉయ్యాలో
సిటికెనేలూ రాత ఉయ్యాలో
సిక్కువాడా రాసి ఉయ్యాలో
రాకి గొంట బొయ్యి ఉయ్యాలో
రామన్న కిచ్చె ఉయ్యాలో
కూసుండి రామన్న ఉయ్యాలో
రాకి గట్టుకోని ఉయ్యాలో
రాయనాసి నచ్చి ఉయ్యాలో
పోయెనాసి నచ్చి ఉయ్యాలో
బుడ్డెడూ నూనె ఉయ్యాలో
తీసుకా పోయింది ఉయ్యాలో
చారెడంత నూనె ఉయ్యాలో
చదిరి తలకంటి ఉయ్యాలో
కడివెడంత నూనె ఉయ్యాలో
కొట్టి తలకంటి ఉయ్యాలో
గిద్దెడంత నూనె ఉయ్యాలో
గిద్ది తలకంటి ఉయ్యాలో
అరసోలెడూ నూనె ఉయ్యాలో
అందంగ తలకంటి ఉయ్యాలో
సోలెడూ నూనే ఉయ్యాలో
సోకిచ్చే తలకూ ఉయ్యాలో…
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై
పార్వతీ దేవివై పరమేశు రాణివై
పరగ శ్రీలక్ష్మివైయ్యూ గౌరమ్మ
భార్య వైతివి హరికినీ గౌరమ్మ
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
ముక్కోటి దేవతలు సక్కనీ కాంతలు
ఎక్కువగ నిను గొల్చి పెక్కు నోములు నోచి
ఎక్కువా వారయ్యిరీ గౌరమ్మ
ఈలోకమున నుండియూ గౌరమ్మ
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
మరి మీ వీధుల్లో, మీ గ్రామాల్లో ఎక్కువగా పాడుకునే పాట ఏదో మాతో పంచుకోండి. బతుకమ్మ పండుగకు ఈ పాటలను ఓసారే ఆలపించే ప్రయత్నం చేయండి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!