మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని మరోసారి రుజువైంది. ఆగస్ట్ 5న విడుదలైన రెండు భారీ సినిమాలు సీతా రామం, బింబిసార బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. సాధారణంగా రెండు బారీ బడ్జెట్ సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. కానీ వైజయంతి మూవీస్, ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రేక్షకులు రెండింటినీ ఆదరిస్తున్నారు.
బింబిసారకు ఓవర్సీస్‌లో మొదటిరోజే 100k డాలర్స్ గ్రాస్ సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇక్కడ మూవీ మొత్ం రూ. 13 కోట్లకు అమ్ముడవగా రూ.6.3 కోట్లు ఫస్ట్ డే రావడం విశేషం. అంటే 50 శాతం రికవరీ మొదటిరోజే జరిగింది. ఇక వీకెండ్స్‌లో ఇంకెంత రాబడుతుందో చూడాలి. దీంతో సినిమా కచ్చితంగా కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలుస్తుంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి థియేటర్ల సంఖ్య కూడా పెంచుతున్నారు.
ఇక సీతా రామం విషయానికొస్తే ఈ మ్యూజికల్ లవ్‌స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి ఇండస్ట్రీ మొత్తం సంతోషిస్తుంది. ఇలాంటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ భారీ విజువల్స్‌తో థియేటర్‌లో చూసి చాలాకాలమయిందని చెప్తున్నారు. ఐఎండీబీ రేటింగ్స్‌లో సీతా రామంకు 9.8 శాతం రేటింగ్ వచ్చింది. ఇక బుక్‌మైషోలో 97 శాతం మంది సినిమా నచ్చిందని ఓటెస్తున్నారు. కేవలం అమెరికాలోనే మొదటిరోజు మూవీ 200k డాలర్స్ రాబట్టింది.
ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు రెండు చిత్రాలకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ రెండు సినిమాల విజయం మొత్తం చిత్ర పరిశ్రమ విజయంగా భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ సమస్యల్లో ఉంది. టిక్కెట్ రేట్లు పెరగడం, ఓటీటీలో చూసేందుకు అలవాటు పడటంతో థియేటర్ల వైపు వెళ్లడం తగ్గించేశారు. దీనికి పరిష్కారం కోసం కొంతకాలం షూటింగ్స్ కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ కాస్త టిక్కెట్లు రేట్లు తగ్గించి మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా వస్తారని ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.‘’ కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి నిరూపించారంటూ’’ మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్వీట్ చేశాడు. సీతా రామం, బింబిసార రెండు చిత్రబృందాలకు శుభాకాంక్షలు తెలియజేశాడు.