నటీనటులు: త్రిష, ఇంద్రజీత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్‌సామి, రాకేందుమౌళి తదితరులు
రచన, దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల
సినిమాటోగ్రఫీ : దినేష్ కె. బాబు
సంగీతం : శక్తి కాంత్ కార్తిక్
ఎడిటర్ : అన్వర్ అలీ
నిర్మాత : కొల్ల ఆశిష్
విడుదల తేదీ : ఆగస్టు 2, 2024
ఓటీటీ వేదిక : సోనీలివ్
సినిమాల్లో స్టార్ హీరోయిన్ రాణించిన త్రిష (Trisha) ఓటీటీలో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలిసారి బృంద (Brinda) అనే వెబ్ సిరీస్‌లో నటించింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించారు. ఇందులో త్రిష పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఇంద్రజీత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్‌సామి, రాకేందుమౌళి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బృంద సిరీస్ ఆగస్టు 2 నుంచి సోనిలివ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బృంద (Trisha) ఓ పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా చేరిన ఎస్సై. మహిళ కావడంతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. ఈ క్రమంలో ఓ రోజు స్థానిక చెరువులో శవం బయటపడుతుంది. హంతకుడు దానికి గుండు కొట్టి, గుండెల్లో 16 సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టంలో తేలుతుంది. అయితే ఉన్నతాధికారి ఈ కేసును క్లోజ్ చేయమని చెప్పినా బృంద ఇన్వెస్టిగేషన్ మెుదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు సంచలన నిజం తెలుస్తుంది. ఆ తరహాలో మొత్తం 16 మంది అతి దారుణంగా హత్యకు గురైనట్లు ఆమె కనిపెడుతుంది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి అందులో బృందని భాగస్వామిని చేస్తారు. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడ్ని బృందా టీమ్ ఎలా పట్టుకుంది? మూఢ నమ్మకాలకు ఈ హత్యలకు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
పోలీసు ఆఫీసర్ బృందాగా త్రిష తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆత్మగౌరవం కలిగిన మహిళగా ఆమె నటన మెప్పిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టింది. మరోవైపు విలన్‌గా ఆనందసామి మెప్పించాడు. అమాయకత్వం, క్రూరత్వం కలగలుపుతూ ఆనందసామి చేసిన నటన సిరీస్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇంద్రజీత్, రవీంద్ర విజయ్ తమ పరిధి మేరకు నటించారు. మిగతా నటీనటులు కూడా తమ యాక్టింగ్‌తో పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కథ పరంగా చూస్తే రొటిన్ క్రైమ్ థ్రిల్లర్ థీమ్‌తోనే దర్శకుడు సూర్య మనోజ్ వంగల ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఆరంభ సన్నివేశం నుంచి ఆసక్తిరేకెత్తించేలా స్క్రీన్‌ప్లేను నడిపి ఆకట్టుకున్నారు. భూత, వర్తమాన కాలాల్లో జరిగే సంఘటనలను ఒకదానితో ఒకటి ముడివేస్తూ చెప్పిన తీరు బాగుంది. ఇక హంతకుడిని కనిపెట్టే క్రమంలో బృందా టీమ్ ఒక్కో క్లూను కనిపెట్టడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే డిటెయిల్ ఇన్‌వెస్టిగేషన్ పేరుతో సిరీస్‌ను మరీ పొడిగించినట్లు అనిపిస్తుంది. ఆధారాలు సేకరించే సీన్స్ కొన్ని లాజిక్‌లకు దూరంగా సాగుతాయి. ఆమె చుట్టూ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ చిన్న చిన్న క్లూలు కూడా కనిపెట్టలేనివారిగా చూపించడం అంతగా ఆకట్టుకోదు. త్రిష చెల్లెలి ఎపిసోడ్ కథకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా అనిపిస్తుంది. మెుత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈ సీరిస్ సాగగా కొన్ని ఎపిసోడ్స్ మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఓవరాల్‌గా మెుదటి నుంచి చివరి వరకూ కథను ఎంగేజింగ్‌గా నడపడించి దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- కథ, కథనాలు
- త్రిష నటన
- ఇన్‌వెస్టిగేషన్ సీన్స్
మైనస్ పాయింట్స్
- నిడివి
- సాగదీత సన్నివేశాలు