టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ జనరేషన్ యంగ్ హీరోలందరికీ చిరునే ఇన్‌స్పిరేషన్. కొత్తగా రాబోతున్న వారికి సైతం చిరునే ప్రేరణ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ అండ లేని కుర్ర హీరోలకు మెగాస్టార్ చిరు భరోసాగా నిలుస్తున్నారు. యంగ్ హీరోల మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతూ సినిమా సక్సెస్‌కు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ నటించిన ‘జిబ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సైతం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్న సినిమా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి కుర్ర హీరోల్లో ఉత్సాహాన్ని నింపారు.
చిన్న చిత్రాలపై ప్రశంసలు..
చిరంజీవి వీరాభిమాని, యువ కథానాయకుడు సత్యదేవ్ (Sathya Dev) నటించిన ‘జీబ్రా’ సినిమా ఈనెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి అక్కడ చిరు ప్రస్తావించారు. సంక్రాంతికి విడుదలైన ప్రశాంత్ వర్మ – తేజ సజ్జాల ‘హనుమాన్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’, సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘టిల్లు స్క్వేర్’ సైతం విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దీపావళికి విడుదలైన ‘లక్కీ భాస్కర్’, ‘క’, ‘అమరన్’ సినిమాలు కూడా విజయాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కీరవాణి తనయుడు శ్రీ సింహ, కమెడియన్ సత్య నటించిన ‘మత్తు వదలరా 2’ సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. చిరు లాంటి బిగ్‌స్టార్ తమ సినిమాలను ప్రస్తావిస్తూ ప్రశంసించడంపై ఆయా చిత్ర బృందాలు సంతోషంలో మునిగాయి.
యంగ్ హీరోలకు భరోసా
తనను ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ జనరేషన్ హీరోలకు మెగాస్టార్ చిరు అండగా నిలుస్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సత్యదేవ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ హాజరయ్యారు. అంతేకాదు తన ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి సత్యదేవ్‌ను విలన్‌గా సజెస్ట్ చేసి అతడి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చారు. గతంలో ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన చిరు, యంగ్ హీరో సుహాస్‌పై ప్రశంసలు కురిపించారు. కలర్ ఫొటోలో సుహాస్ నటన బాగుందంటూ ప్రశంసించారు. చిరు మాటలకు సుహాస్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే ‘శ్రీకారం’ మూవీ ప్రీరిలీజ్‌కు హాజరై యువ హీరో శర్వానంద్‌ను ఆశీర్వదించాడు. రీసెంట్‌గా ‘కమిటీ కుర్రాళ్లు’ టీమ్ చిరు ఇంటికి వెళ్లగా అందులో లీడ్ రోల్ చేసిన యశ్వంత్‌ను అశీర్వచనాలు అందజేసాడు. ఫొటో దిగే క్రమంలో చిరుపై యశ్వంత్ చేయివేయగా ఆప్యాయంగా వేయించుకున్నారు. ఇలా అవకాశం దొరికనప్పుడల్లా కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ చిరు అండగా నిలుస్తున్నారు.
జపాన్ వెళ్లనున్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ కోసం చిరు జాపన్ వెళ్లనున్నారు. అక్కడ పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో పాటలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘విశ్వంభర’ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం చిరు వెనక్కి తగ్గారు.
ఈ ఏడాది మూడు విశిష్ట గౌరవాలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ