Dating Scams 2023: డేటింగ్, రొమాన్స్ స్కామ్‌లతో నష్టపోతున్న యూత్.. వీటి నుంచి బయట పడేదెలా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Dating Scams 2023: డేటింగ్, రొమాన్స్ స్కామ్‌లతో నష్టపోతున్న యూత్.. వీటి నుంచి బయట పడేదెలా?

    Dating Scams 2023: డేటింగ్, రొమాన్స్ స్కామ్‌లతో నష్టపోతున్న యూత్.. వీటి నుంచి బయట పడేదెలా?

    August 9, 2023

    అమ్మాయిలతో పరిచయం ఏర్పరుచుకోవాలంటే ఏ బస్ స్టాపుల్లోనో, కాలేజీల్లోనో, ఫంక్షన్లలోనో వేచి చూసే రోజులు పోయాయి. ఈ రోజుల్లో యూత్ ఎక్కువగా ఆన్‌లైన్‌ డేటింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. డేటింగ్ యాప్స్, వెబ్‌సైట్లను ఆశ్రయించి తమ కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాపించిన ఈ సంస్కృతి భారత్‌లోనూ ఎక్కువైంది. డేటింగ్ యాప్స్ మోజులో పడి వాస్తవాన్ని మరిచిపోతున్నారు. ఫలితంగా, భారీగా మోసపోతున్నారు. ఇలా డేటింగ్ స్కామ్స్ బారిన పడి సగటున ఒక్కొక్కరు రూ.7,996 నష్టపోతున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థ నోర్టన్ ఓ అధ్యయనం వెల్లడించింది.     

    డేటింగ్ స్కామ్స్ అంటే?

    అబ్బాయి/ అమ్మాయితో పరిచయాలు పెంచుకుని ఒక బంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో డేటింగ్ యాప్స్, వెబ్‌సైట్స్‌ని యువత ఆశ్రయిస్తున్నారు. మొబైల్ ఫోన్లలో టిండర్(Tinder), మ్యాచ్(Match), ప్లెంటీ ఆఫ్ ఫిష్(Plenty of Fish), అవర్ టైమ్(Our Time), హింజ్(Hinge) వంటి డేటింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నారు. వీటిల్లో ప్రొఫైళ్లను మ్యాచ్ చేసుకుని సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. కానీ, వీటిల్లో 10 శాతం ఫేక్ ప్రొఫైళ్లే ఉంటున్నాయి. ఇది తెలియక చాలా మంది అవతలి వ్యక్తిని నమ్మేస్తుంటారు. సాన్నిహిత్యం ఏర్పడటంతో ఎదుటి వారు అడిగింది కాదనరు. ఇలా హఠాత్తుగా అవసరం వచ్చిందని, మెడికల్ ఎమర్జెన్సీ ఉందని చెప్పి డబ్బులు అడుగుతారు. అనుమానం కలగకుండా మాయమాటలతో నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బును గుంజేస్తున్నారు. వీటినే డేటింగ్ స్కామ్స్ లేదా రొమాన్స్ స్కామ్స్ అని అంటారు.  

    ఏం చేస్తారు? 

    స్కామర్లు ఫేక్ ప్రొఫైళ్లు క్రియేట్ చేసుకుంటారు. నకిలీ పేర్లు, బయోడేటా, ఫొటోలు వంటివి అప్‌లోడ్ చేసి గాలం వేసేందుకు రెడీగా ఉంటారు. అప్పుడే, డేటింగ్ యాప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అబ్బాయిలు/ అమ్మాయిలను టార్గెట్ చేస్తారు. వీరి సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని పరిశోధించి పూర్తి వివరాలు రాబడతారు. అప్పుడు పరిచయం చేసుకుంటారు. ముందుగా చాలా ఓపిగ్గా ఉంటూ మంచితనాన్ని చూపిస్తారు. అలా, తీయని మాటలు చెబుతూ బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకరోజు ఉన్నట్టుండి ఏదో ఒక ఆపద వచ్చిందని నమ్మిస్తారు. డబ్బులు కడితే సమస్య తీరిపోతుందంటారు. లేదా, పెళ్లి తర్వాత మెరుగైన భవిష్యత్ ఉండటానికి కొన్ని ట్రేడింగ్ యాప్‌లలో కాబోయే భాగస్వామి చేత పెట్టుబడులు పెట్టిస్తారు. ఇలా పెద్ద మొత్తంలో కొల్లగొడుతారు. హాంకాంగ్‌కి చెందిన ఓ వ్యక్తిని ఇదే విధంగా రూ.14 కోట్లకు పైగా మోసం చేశారు సైబర్ కేటుగాళ్లు. అమెరికాలో 2022 నాటికి 1.3బిలియన్ డాలర్లు కోల్పోయారట.

      

    పక్కా ప్రణాళిక..

    సైబర్ నేరగాళ్లకు ప్రత్యేకమైన బృందం ఉంటుంది. వీరంతా కలిసి కట్టుగా పనిచేసి బాధితుల నుంచి డబ్బును వసూలు చేస్తారు. వివిధ దశల్లో ఒక్కో టీం ఉంటుంది. హోస్ట్స్, రిసోర్సెస్, ఐటీ, మనీ లాండరింగ్ అనే గ్రూపులు ఉంటాయి. ముందుగా బాధితులతో హోస్ట్స్ టీం పరిచయం పెంచుకుంటుంది. రిసోర్సెస్ మెంబర్స్ బాధితుడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సోషల్ ఇంజినీరింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి సేకరిస్తుంది. ఈ లోగా ఐటీ టీం ఫేక్ యాప్స్, వెబ్‌సైట్లను తయారు చేస్తుంది. ఇక మనీ లాండర్స్ డబ్బులను గుంజే ప్రయత్నం చేస్తుంది. ఇలా దశల వారీగా ప్రక్రియను అనుసరించి మోసం చేస్తారు. 

    బ్లాక్ మెయిల్

    డేటింగ్ యాప్‌లలో ప్రధానంగా ‘బ్లాక్‌మెయిల్’ని ఓ అస్త్రంగా ఉపయోగిస్తారని తేలింది. న్యూడ్ చాట్‌కి అవతలి వ్యక్తిని ప్రేరేపించి సంబంధిత వీడియోని స్కామర్లు రికార్డ్ చేస్తారట. అనంతరం, ఈ వీడియోని బహిరంగంగా రిలీజ్ చేస్తామంటూ బెదిరించి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తారని పలువురు చెబుతున్నారు. అందుకే, ప్రొఫైల్ మ్యాచ్ అయ్యాక ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

     

    ఎలా గుర్తించాలి? 

    • డేటింగ్ యాప్‌లలో ప్రొఫైల్ మ్యాచ్ కావడానికి కొన్నింటిని అప్‌డేట్ చేస్తుంటారు. ఇలా ఒకసారి మ్యాచ్ అయిన ప్రొఫైల్‌ని యూజర్లు వెరిఫై చేసుకోవాలి.
    • ప్రొఫైల్ ఫొటోకి, ప్రొఫైల్‌లో పొందుపర్చిన వివరాలను క్రాస్ చెక్ చేసుకోవాలి. 
    • ప్రొఫైల్ వెరిఫికేషన్ కోసం ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్, ప్రొఫెషనల్ హ్యాండిల్స్‌ని రెఫర్ చేయాలి. ఏమైనా తేడా ఉంటే వెంటనే అన్ మ్యాచ్ చేసేయాలి.
    •  ప్రొఫైల్ ఫొటో విషయంలోనూ కేర్‌ఫుల్‌గా ఉండాలి. కొన్ని ప్రొఫైళ్లలో అసభ్యకరమైన ఫొటోలు ఉంటాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. 
    • డేటింగ్ యాప్స్‌లలో టూల్స్‌ని సెట్ చేసుకోవాలి. పరిచయం పెంచుకునే ముందు అవతలి వ్యక్తులను నిర్ధారించడానికి వీడియో చాట్స్ పెట్టుకునే వీలుంది.
    • డేటర్స్ చెబుతున్న వివరాలను క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే, దాదాపు 57 శాతం మంది డేటర్లు తమ భౌగోళిక వివరాల గురించి అబద్ధాలే చెబుతున్నారట. 
    • డేటింగ్ యాప్‌లు అధికారికంగా నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలి. సేఫ్ డేటింగ్ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఫలితంగా, డేటింగ్ స్కామ్స్‌ని గుర్తించే వీలుంటుంది. 

    ఇలా చేయాలి

    స్కామర్లకు తిరిగి బురిడీ కొట్టాలి. అవతలి వ్యక్తిపై అనుమానం లేకపోయినా.. ‘నీ వేషాలు నాకు తెలుసు.. నెమ్మదిగా నాతో పరిచయం ఏర్పరుచుకుని డబ్బులు గుంజాలనే కదా నీ ప్లాన్.. నా ఫ్రెండ్ కూడా ఇలాగే అమాయకులను మోసం చేసి దొరికిపోయాడు. ఇప్పుడు జైలు కూడు తింటున్నాడు. నువ్వు కూడా ఆ పరిస్థితిని కొనితెచ్చుకోకు’ అంటూ నిరుత్సాహ పరచాలి. దాదాపుగా ఇక్కడే స్కామర్లు అలర్ట్ అయి తీగ తెగకుండా చూసుకుంటారు. ఇది వర్కౌట్ అయినట్లు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మోసం చేయడానికి స్కామర్లు వివిధ మార్గాలను అన్వేషిస్తారు. ప్రైవేట్ చాట్ చేద్దామని ముగ్గులోకి దింపుతారు. రొమాంటిక్ సంభాషణను జరుపుతారు. మీ నుంచి మరింత సమాచారం ఆరా తీస్తారు. కానీ, వీటికి లోబడకూడదు. ఈ టెక్నిక్‌ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. 

    యాప్ టూల్స్..

    మోసాలను నియంత్రించేందుకు డేటింగ్ యాప్స్ కంపెనీలు కొన్ని కీ వర్డ్స్(Key Words)ని ఉపయోగిస్తున్నాయి. Money, MoneyGram, bank వంటి కీ వర్డ్‌లు టైప్ చేస్తే యూజర్లకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఫలితంగా, యూజర్ అప్రమత్తమై ప్రొఫైల్‌ని అన్ మ్యాచ్ చేసేందుకు దోహద పడుతుంది. దీంతో పాటు ప్రొఫైల్ వెరిఫికేషన్ టూల్స్ కూడా యూజర్లకు హెల్ప్ చేస్తాయి. ఫేక్ ప్రొఫైళ్లను గుర్తించేందుకు వీలుగా అల్గారిథమ్‌లను డిజైన్ చేస్తున్నాయి.

        

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version