నటీనటులు: ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు
రచన, దర్శకత్వం: కొరటాల శివ
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్
విడుదల తేదీ: 27-09-2024
ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న (devara release date) వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప (శ్రీకాంత్), కుంజర (షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ (మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. ఇందుకు భైరవ ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవర వారికి తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. ఇక దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు దొంగ సరకు తీసుకురాకుండా దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం (జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
తారక్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇందులోనూ దేవర, వర అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకున్నాడు. అటు డ్యాన్స్‌లోనూ ఇరగదీశాడు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. తంగం పాత్రలో అచ్చమైన తెలుగమ్మాయిగా కనిపించింది. అయితే ఆమె పాత్ర కొద్దిసేపే ఉండటం గమనార్హం. విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఆకట్టుకున్నారు. తారక్‌ను ఢీ కొట్టే పాత్రలో అతడు గొప్ప ప్రభావం చూపించారు. శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, అజయ్, మురళీశర్మ, శ్రుతి తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. మిగిలిన నటులు సైతం తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కొరటాల శివ ఎర్రసముద్రం పేరుతో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి తనదైన శైలిలో డ్రామా, భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేశారు. ప్రథమార్ధంలో ఎర్ర సముద్రం కథ, దేవర-భైర పాత్రలు, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, పోరాట ఘట్టాలు, పాటలు, దేవర చూపించే భయం దేనికవే సాటి అనేలా కొరటాల చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోయేలా ప్లాన్ చేశారు. ఫస్టాఫ్ అంతా దేవర చుట్టు తిప్పిన కొరటాల, సెకండాఫ్‌లో వర పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్‌ను బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్‌గానే సాగుతాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ దేవర కథను కొరటాల ముంగించారు. అయితే ప్రథమార్థం స్థాయిలో సెకండ్ పార్ట్ లేకపోవడం, పేలవమైన లవ్‌ట్రాక్, సాగదీత సీన్స్, ఊహకందేలా కథనం, ఒక్కప్పటి సినిమాల్లోని కొరటాల మార్క్ మిస్ కావడం మైనస్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాలేదు.
ప్లస్ పాయింట్స్
- ఎన్టీఆర్ నటన
- ప్రథమార్థం
- సినిమాటోగ్రఫీ
- సంగీతం
మైనస్ పాయింట్స్
- సెకండ్ పార్ట్
- పేలవమైన లవ్‌ట్రాక్
Telugu.yousay.tv Rating : 3.5/5
‘దేవర’ గురించి నెటిజన్లు ఏమంటున్నారంటే? (Devara Public Talk)
దేవర చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ట్విటర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తారక్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్ అందించిన పాటలు, నేపథ్యం సంగీతం అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని నెగిటివ్ పోస్టులు సైతం దేవరపై దర్శనమిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
దేవరలో ఎన్టీఆర్ నటన ఔట్ స్టాండింగ్‌గా ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు దేవర నచ్చుతాడని పోస్టు పెట్టాడు.
దేవర చిత్రానికి అనిరుధ్ ఇచ్చిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్లో ఉన్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. ‘అదేం కొట్టుడు రా బాబు’ అంటూ అనిరుధ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
దేవర దెబ్బకు థియేటర్లు తగలబడిపోతున్నాయంటూ మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఫస్టాఫ్ ఫెంటాస్టిక్.. సెకండాఫ్ సూపర్బ్.. బీజీఎం హై-వోల్టేజ్‌లో ఉందని కామెంట్ చేశాడు.
దేవర ఫస్ట్ పార్ట్ చాలా బాగుందని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. అయితే సెకండ్ పార్ట్ మాత్రం చాలా ప్రిడక్టబుల్‌గా ఉందని పేర్కొన్నారు. ఓవరాల్‌గా దేవర సంతృప్తి ఇస్తుందని రాసుకొచ్చాడు.
దేవర చిత్రం తనను తీవ్రంగా నిరాశ పరిచినట్లు ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అంచనాలను అందుకోవడంలో విఫలమైందని పేర్కొన్నాడు. అసలు జాన్వీని హీరోయిన్‌గా ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదని పోస్టు పెట్టాడు.