రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా, పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ నుంచి మూవీ టీమ్‌కు ఏదోక సమస్య వస్తూనే ఉంది. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పంద్రాగస్టు బరిలో నిలవడం, ‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలను సెటిల్ చేయాలని డిమాండ్ చేయడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.ఈ క్రమంలోనే తాజాగా హీరో రామ్, డైరెక్టర్ పూరికి మధ్య మనస్పర్థలు (Ram Pothineni vs Puri Jagannadh) తలెత్తినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ కోల్డ్ వార్‌కు కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
రామ్ అసంతృప్తి!
హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)ను రూపొందించారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ రెడీ కాగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై హీరో రామ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘లైగర్’ వివాదం కారణంగా తన చిత్రానికి చిక్కులు రావడంపై రామ్ గుర్రుగా ఉన్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికీ నైజాం పంపిణీ వ్యవహారం కొలిక్కిరాకపోవడం, నిర్మాత ఛార్మీ ప్రమోషన్స్ షురూ చేయకపోవడంపై రామ్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోతున్నారట. ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా డైరెక్టర్ పూరి రాకపోవడం వెనుక రామ్‌తో తలెత్తిన వివాదాలే కారణమని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రైలర్ ఈవెంట్‌లో ఏకాకిగా రామ్ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
పూరి వివరణ!
‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు రాకపోవడంపై డైరెక్టర్ పూరి ఓ వీడియో బైట్‌ను రిలీజ్ చేశారు. సెన్సార్ కోసం ముంబయిలో ఫైనల్ మిక్సింగ్ ఉండి ఈవెంట్‌కి రాలేకపోయినట్లు తెలిపారు. ఈవెంట్‌కు రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇవేమి నమ్మశక్యంగా లేవని పేర్కొంటున్నారు. ఒక దర్శకుడు లేకుండా ట్రైలర్ లాంచ్ జరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. రామ్‌తో గ్యాప్ వల్లే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు పూరి రాలేదని ఆరోపిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్ సాధిస్తే ఆటోమేటిక్‌గా వీరి మధ్య గ్యాప్ తొలగిపోతుందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రామ్, పూరి మధ్య విభేదాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఆదివారం రిలీజైన ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ ఊహించిన విధంగానే మాస్ యాక్షన్‍తో, నాటు డైలాగ్‍లతో నిండిపోయింది. అటు తన మార్క్ ఎనర్జిటిక్ యాక్షన్, మాస్ డైలాగ్‍లు, డ్యాన్స్‌తో రామ్ ట్రైలర్‌లో దుమ్మురేపారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఇందులో విలన్‍గా బిగ్‍బుల్ పాత్రను చేశారు. బిగ్‍బుల్ బ్రెయిన్‍లోని మెమొరీని శంకర్ (రామ్ పోతినేని) మెదడులో పంపించడం ఈ ట్రైలర్‌లో ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చిప్‍ను తలలో పెడితే ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీలో ఏకంగా బ్రెయిన్ మెమొరీ ట్రాన్స్‌ఫర్ కాన్సెప్ట్ తీసుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
మిస్టర్ బచ్చన్ దూకుడు!
డబుల్ ఇస్మార్ట్ టీమ్‌తో పోలిస్తే ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) టీమ్ ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. వరుసగా ప్రెస్ మీట్‌లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. సాధారణంగా ప్రమోషన్స్ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్ ఇస్మార్ట్’ సరిగా మెుదలు పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కోరినా.. వెనక్కి తగ్గలేదా?
పంద్రాగస్టు రోజున ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ కాకుండా ఉండేందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్ టీమ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మీ ఇటీవల రవితేజతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లు కథనాలు వచ్చాయి.