సాధారణంగా ఐపీఎల్ అంటే ముందుగా స్టార్ క్రికెటర్లే గుర్తుకు వస్తారు. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav), జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah), హార్దిక్ పాండ్యా (Hardik Pandya) లాంటి టీమిండియా ప్లేయర్లతో పాటు విదేశీ ఆటగాళ్లను చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే ప్రస్తుత సీజన్‌లో కొందరు యువ క్రికెటర్లు.. స్టార్ ప్లేయర్లను మరిపిస్తూ సత్తా చాటుతున్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌తో అద్భత ఆట తీరును ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియాలో చోటే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఆ యంగ్ ప్లేయర్లు ఎవరు? ఈ సీజన్‌లో వారి బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శన ఎలా ఉంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
యంగ్ బ్యాటర్లు
రియాన్ పరాగ్ (Riyan Parag)
యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఐపీఎల్‌కు కొత్త కాకపోయినా ఈ సీజన్‌లో ఎన్నడూ లేని విధంగా విశ్వరూపం చూపిస్తున్నాడు. ఒకప్పుడు విపరీతమైన ట్రోల్స్‌కు గురైన అతడు.. ఈ ఏడాది బ్యాటింగ్‌లో సత్తా చాటుతూ రాజస్థాన్ రాయల్స్ (RR)ను గెలిపిస్తున్నాడు. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన పరాగ్.. మూడు అర్ధశతకాలు నమోదు చేశాడు. 155.19 స్ట్రైక్ రేట్‌తో 284 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్‌లో రెండో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ కొనసాగుతున్నాడు. పరాగ్ మిగిలిన మ్యాచుల్లోనూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే అతడు టీమిండియాకు సెలక్ట్ కావడం ఖాయమని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సంజూ శాంసన్ (Sanju Samson)
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఎప్పటిలాగే ఈ సీజన్‌లోనూ రాణిస్తున్నాడు. తన అద్భుతమైన కెప్టెన్సీతో పాయింట్ల పట్టికలో జట్టును టాప్‌లో ఉంచాడు. ఇప్పటివరకూ 6 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్.. ఐదింటిలో గెలిచి 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక శాంసన్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 155.29 రేట్‌తో 264 పరుగులు రాబట్టాడు. అతడి బ్యాటింగ్ యావరేజ్ 66.00గా ఉంది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శాంసన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
శివం ధూబే (Shivam Dube)
ఈ సీజన్‌లో దుమ్మురేపుతున్న మరో యంగ్ ప్లేయర్ ‘శివం ధూబే’. చెన్నై (Chennai Super Kings)కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆల్‌రౌండ్ ప్లేయర్.. తన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు. స్పిన్నర్, పేసర్ అనే తేడా లేకుండా సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన ధూబే.. 163.51 స్ట్రైక్ రేట్‌తో 242 పరుగులు చేశాడు. దీంతో శివం ధూబే.. బ్యాటింగ్ శైలిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అతడు టీ20 వరల్డ్‌కప్‌కు తప్పక ఎంపిక అవుతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అభిషేక్ శర్మ (Abhishek Sharma)
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. ఈ సీజన్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. ట్రావిస్ హెడ్, మర్‌క్రమ్, క్లాసెన్ వంటి దిగ్గజ విదేశీ బ్యాటర్లతో పోటీ మరీ జట్టుకు పరుగులు అందిస్తున్నాడు. ఇప్పటివరకూ 6 మ్యాచులు ఆడిన అభిషేక్.. 197.19 స్ట్రైక్ రేట్‌తో 211 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 18 సిక్స్‌లు ఉన్నాయి. అభిషేక్ ఇదే ఫామ్‌ను తర్వాతి మ్యాచుల్లోనూ కొనసాగిస్తే అతడు టీమిండియా జెర్సీలో కనిపించడం ఖాయమని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సాయి సుదర్శన్ (Sai Sudharsan)
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్.. ఈ సీజన్‌లోనూ రాణిస్తూ మేనేజ్‌మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన సాయి సుదర్శన్.. 130.23 స్ట్రైక్ రేట్‌తో 224 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ యావరేజ్ 37.67గా ఉంది. ఈ యంగ్ క్రికెటర్ ప్రస్తుతం గుజరాత్‌కు కీలక బ్యాటర్‌గా ఉన్నాడు.
శశాంక్ సింగ్ (Shashank Singh)
ప్రస్తుత సీజన్‌లో పంజాబ్ జట్టు పెద్దగా రాణించకపోయినా.. ఆ జట్టులోని యంగ్ బ్యాటర్ శశాంక్ సింగ్ మాత్రం తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. భారీ హిట్టింగ్‌తో నిలకడగా ఆడుతూ పంజాబ్ జట్టుకు ఆశాకిరణంగా మారాడు. ఇప్పటివకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన అతడు 184.81 స్ట్రైక్ రేట్‌తో 146 పరుగులు చేశాడు. ఇటీవల గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించాడు.
నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఒక్క మ్యాచ్‌తో హీరోగా మారాడు. సన్‌రైజర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న నితీష్.. ఇటీవల పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. స్టార్ బ్యాటర్లంతా విఫలమైన వేళ వారియర్‌లాగా ఒక్కడే పోరాడాడు. 37 బంతుల్లో 64 రన్స్ చేసి సత్తా చాటాడు. ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ యువ ఆల్‌రౌండర్.. 173.33 స్ట్రైక్ రేట్‌తో 78 పరుగులు చేశాడు.
కుర్ర బౌలర్లలోనూ అదే కసి..
మయాంక్ యాదవ్ (Mayank Yadav)
ఈ ఐపీఎల్‌లో వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్లలో యమాంక్ యాదవ్ ముందు వరుసలో ఉంటాడు. లక్నో సూపర్ జైయింట్స్ తరపున ఆడుతున్న ఈ ఎక్స్‌ప్రెస్ పేసర్.. నిలకడగా గంటకూ 150 కి.మీలకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో అదరగొడుతున్నాడు. LSG ఆడిన ఆరు మ్యాచుల్లో తొలి మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మయాంక్.. 9.00 ఎకనామీతో 6 వికెట్లు పడగొట్టాడు. రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే గాయం కారణంగా చివరి మూడు మ్యాచ్‌లకు మయాంక్ దూరమయ్యాడు.
వైభవ్ అరోరా (Vaibhav Arora)
ఈ ఐపీఎల్‌లో బంతితో రాణిస్తున్న మరో యంగ్ పేసర్ ‘వైభవ్ అరోరా’. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వైభవ్.. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. 8.09 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం KKRకు కీలక బౌలర్‌గా ఉన్న వైభవ్.. మున్ముందు మ్యాచుల్లోనూ రాణిస్తే సెలక్టర్ల దృష్టిలో పడటం ఖాయమని చెప్పవచ్చు.
యష్ థాకూర్ (Yash Thakur)
యంగ్ పేసర్ యష్ థాకూర్ కూడా ఈ సీజన్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. LSG తరుపున ఆడుతున్న ఈ యువ పేసర్.. 5 మ్యాచుల్లో 7 వికెట్లు పడగొట్టాడు. 9.92 ఎకానమీతో బౌలింగ్ చేస్తూ LSG బౌలింగ్ యూనిట్‌లో కీలకంగా మారాడు. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ మూడు వికెట్లు పడగొట్టి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం.
మయాంక్ మార్కండే (Mayank Markande)
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా ఉన్నప్పటికీ.. ఆ జట్టులో స్టార్ స్పిన్నర్ లేని లోటు మెుదట్లో సెలక్టర్లను బాగా వేధించింది. అయితే ఆ లోటును యంగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే క్రమంగా భర్తీ చేస్తున్నాడు. తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. ఇప్పటివరకూ 5 మ్యాచ్‌లు ఆడిన మయాంక్.. 11.24 ఎకనామీతో 5 వికెట్లు తీశాడు.
తుషార్ దేశ్‌పాండే (Tushar Deshpande)
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. తుషార్ దేశ్‌పాండేే ఈ సీజన్‌లోనూ బంతితో రాణిస్తున్నాడు. కీలక సమయాల్లో క్రమం తప్పకుండా వికెట్ తీస్తూ మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే.. 7.90 ఎకనామీతో 6 వికెట్లు తీశాడు. ప్రతీ మ్యాచ్‌కు తన ప్రదర్శనను మరింత మెరుగు పరుచుకుంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
అర్షదీప్ సింగ్ (Arshdeep Singh)
యంగ్ ప్లేయర్ ఆర్షదీప్ సింగ్.. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ తరపున ఆరు మ్యాచ్‌లు ఆడిన అతడు.. 9.24 ఎకనామీతో 9 వికెట్లు తీశాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇరుకున పెడుతున్నాడు. రానున్న మ్యాచుల్లో ఇదే తరహా ప్రదర్శన చేయడంతో పాటు మరిన్ని వికెట్లు సాధిస్తే మరోమారు టీమిండియాకు అతడి ఎంపిక ఖాయమే.
ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed)
పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అద్బుత బౌలింగ్ స్పెల్ వేస్తున్నాడు. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన ఖలీల్.. 8.79 ఎకనామీతో 9 వికెట్లు తీశాడు. ఢిల్లీకి ముఖ్య బౌలర్‌గా మారిన ఖలీల్.. కీలక సమయాల్లో వికెట్ తీస్తూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..