Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం! 

    Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం! 

    October 18, 2024

    స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటించింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రెండు పాటలను విడుదల చేయగా వాటికి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే మూడో సాంగ్‌ను కూడా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఈ మెలోడీ సాంగ్‌ కోసం చేసిన ఖర్చు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    ఒక్క పాటకు రూ.20 కోట్లు!

    ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ రాబట్టి నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ అయ్యింది. అయితే త్వరలో థర్డ్‌ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ చివర్లో లేదా నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్‌ సింగిల్‌ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ ధ్రువీకరించాల్సి ఉంది.

    మూడు హిట్‌ చిత్రాల బడ్జెట్‌!

    ఇటీవల తెలుగులో రిలీజైన ‘ఆయ్‌’ (Aay), ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu), ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేసి ప్రశంసలు పొందాయి. అయితే ఈ మూడు సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వచ్చి మంచి వసూళ్లు సాధించాయి. ఈ మూడు చిత్రాలు బడ్జెట్‌ కలిపితే దాదాపు రూ.20 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అయితే గేమ్‌ ఛేంజర్‌లో ఒక్క సాంగ్‌ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశారని రూమర్లు రావడం చర్చకు తావిస్తోంది. ఇటీవల వచ్చిన సెకండ్ సింగిల్‌ ‘రా మచ్చా మచ్చా’ పాటకు కూడా దాదాపు రూ.6-10 కోట్లు ఖర్చు అయినట్లు కథనాలు వచ్చాయి. ఆ పాటలో వందల సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొని వివిధ కాస్ట్యూమ్స్‌లో స్టెప్పులు వేశారు. ఇలా సాంగ్‌లకే భారీ మెుత్తం ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

    శంకర్‌ మారాల్సిన అవసరం ఉందా?

    తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ సినిమా అంటే అందులోని పాటలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’, ‘స్నేహితుడు’, ‘రోబో 2.0’ ఇలా ఏ సినిమా తీసుకున్న అందులోని పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి. విదేశాల్లోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో పాటలను చిత్రీకరించడం ద్వారా ఆడియన్స్‌లో కొత్త అనుభూతిని కలిగించేందుకు శంకర్ ప్రయత్నిస్తుంటారు. అయితే గతంలో వరుస హిట్స్‌తో శంకర్ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ పాటల గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే గత కొంతకాలంగా డైరెక్టర్ శంకర్‌కు అసలు కలిసిరావడం లేదు. ఆయన తీసిన చివరి నాలుగు చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఇలాంటి సమయంలో పాటల కోసం రూ. కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండటాన్ని సినీ ఆడియన్స్ తప్పుబడుతున్నారు. ప్రస్తుతం కాలంలో పాటలకు ఏ దర్శక నిర్మాతలు అంత మెుత్తంలో ఖర్చు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. శంకర్‌ తన తీరు మార్చుకోకుంటే అతనితో వర్క్‌ చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేసే పరిస్థితులు తలెత్తవచ్చని అభిప్రాయపడుతున్నారు. 

    రికార్డు ధరకు ఓటీటీ హక్కులు!

    గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    తండేల్‌ vs గేమ్‌ ఛేంజర్‌

    గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు నాగచైతన్య హీరోగా చేస్తున్న తండేల్‌ సైతం సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్‌ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్‌ ఛేంజర్‌ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్‌ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్‌ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్‌ కొట్టి హిట్‌ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. చరణ్‌ వర్సెస్‌ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version