సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ (Hanuman Movie) చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మూవీ విడుదలై నేటితో (జనవరి 29) 17 రోజులు అయినప్పటికీ ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్ (Bollywood) ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అయోధ్య రామమందిరం గుడి ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నార్త్ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ వారంలో హనుమాన్ రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా ఈ వారంలో బడా హీరో చిత్రాలు లేకపోవడం హనుమాన్‌కు కలిసిరానుంది.
16 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
హనుమాన్ (HanuMan) చిత్రం గత 16 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. భారత్‌లో అన్ని భాషలు కలుపుకొని రూ.200 కోట్ల వరకూ కలెక్షన్లను వసూలు చేసింది. హనుమాన్ చిత్రం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.128 కోట్లు కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో (విదేశాల్లో) రూ.57 కోట్ల రూపాయలు డాలర్ల రూపంలో రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అటు హిందీలోనూ ఇప్పటివరకూ రూ.44 కోట్లకు పైగా కొలగొట్టి రూ.50 కోట్ల మార్క్‌ను అందుకునే దిశగా హనుమాన్ దూసుకెళ్తోంది.
హనుమాన్‌కు లాభాలే లాభాలు!
హనుమాన్ (Hanuman Profits) నెట్ కలెక్షన్స్ విషయానికి వస్తే సాక్నిక్ వెబ్‌సైట్ ప్రకారం రూ.165 కోట్లుగా ఉంది. సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ విలువ రూ.29.65 కోట్లు కాగా దాన్ని నెట్ కలెక్షన్స్ నుంచి తీసివేస్తే వేస్తే మిగిలినదంతా హనుమాన్ సినిమా లాభాలుగా చెప్పవచ్చు. దీని ప్రకారం హనుమాన్ ఇప్పటివరకూ రూ.135 కోట్ల మేర లాభాలను గడించినట్లు స్పష్టమవుతోంది. బాహుబలి 2 (రూ.508), బాహుబలి (రూ.186 కోట్లు), ఆర్‌ఆర్‌ఆర్ (రూ.163.03) తర్వాత టాలీవుడ్‌లో అత్యధిక లాభాలు గడించిన నాల్గో చిత్రంగా ‘హనుమాన్’ నిలిచింది. రూ.75.88 కోట్ల లాభాలతో ‘అలా వైకుంఠపురం’ ఐదో స్థానంలో ఉంది.
కేజీఎఫ్ రికార్డు బ్రేక్
ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ (KGF ; Chapter 1) మూవీ హిందీలో రూ.44 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు హనుమాన్ మూవీ 17 రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ సూపర్ హీరో హిందీ వెర్షన్ మూవీ 17 రోజుల్లోనే (రూ.44.44) ఆ రికార్డు బ్రేక్ చేయడం విశేషం. అంతేకాదు హిందీ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ చిత్రాల జాబితాలో హనుమాన్ 10వ స్థానంలో నిలిచింది.
కాంతారా రికార్డుపై గురి?
ఇప్పటికే కేజీఎఫ్ ఛాప్టర్ 1 రికార్డు బ్రేక్ చేసిన హనుమాన్ (Hanuman Collections) మూవీ.. ఇక ఇప్పుడు కాంతారా (Kantara Movie) రికార్డుపై కన్నేసింది. ప్రస్తుతం హిందీ మార్కెట్లో రూ.44.44 కోట్లతో హనుమాన్ 10వ స్థానంలో ఉండగా.. 9వ స్థానంలో ఉన్న కాంతారా ఏకంగా రూ.80 కోట్లతో చాలా ఎత్తులో ఉంది. ఈ రికార్డు బ్రేక్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయితే హనుమాన్ ఈ స్థాయిలో బాలీవుడ్‌లో వసూళ్లు సాధించడం టాలీవుడ్ ప్రతిభకు మరో నిదర్శనంగా చెప్పవచ్చు.
ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
మరోవైపు హనుమాన్ ఓటీటీ (Hanuman OTT Release) రిలీజ్‌పై కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా మార్చి రెండో వారంలో రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ మూవీ జీ5 (Zee 5) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మార్చి రెండో వారం అంటే థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత గానీ డిజిటల్ ప్రీమియర్‌కు రావడం లేదు. ఇక హనుమాన్ మూవీకి సీక్వెల్ ‘జై హనుమాన్’ 2025లో రానున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం తెలిసిందే.