నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే
నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్ లుక్‌లో స్మైలింగ్ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ మోక్షజ్ఞకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
తారక్ స్పెషల్ విషెస్
నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్ పోస్టర్‌పై జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు.
రెండ్రోజులుగా వరుస హింట్స్
రెండు రోజులుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ.
‘జై హనుమాన్’తో లింకప్!
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్ ఫిల్మ్ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు. సెకండ్ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్ బ్యాక్’ అనే పోస్టర్‌లో ‘PVCU 2’ ప్రాజెక్ట్ అంటూ ప్రశాంత్ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్ ఉంటుందని గతంలో ప్రశాంత్ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ‘PVCU 2’ ప్రాజెక్ట్ తర్వాత ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా ‘జై హనుమాన్’తో కనెక్షన్ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ మామా ఏం ప్లాన్ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీకృష్ణుడిగా బాలయ్య!
మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని, చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్ జోడీ మరో ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?