పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించి 25 ఏళ్లు దాటింది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక్కడ అభిమానులు అనే కంటే భక్తులను సంపాదించుకున్నారంటే కరెక్ట్ సరిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్ సెట్ చేసిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఆయన కేరీర్ ఆరంభంలో సినిమాల ఎంపికను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఆయన్ను విమర్శించిన వారే తిరిగి పవన్‌కు ఫ్యాన్స్‌గా మారిపోయిన వారు కొకోల్లలు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.. అంటే ఆయన అభిమానులకు పండుగ రోజు. ఈ సందర్భంగా ఆయన రిజెక్ట్ చేసిన హిట్ సినిమాల జాబితాను ఓసారి చూద్దాం. ఈ సినిమాలు చేసి హిట్ కొట్టిన హీరోలు ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రహీరోలుగా ఉన్నారన్న మాటలో అతిశయోక్తి లేదు.
ఇడియట్
మెగా ఫ్యామిలీకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెద్ద భక్తుడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయడానికి ఎప్పుడు ముందుంటాడు పూరి. అప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన బద్రి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇడియట్ కథను తొలుత పూరి జగన్నాత్ పవన్ కళ్యాణ్‌కు వినిపించారట. కానీ పవన్ నో చెప్పడంతో ఆ స్టోరిని రవితేజ దగ్గరకు వెళ్లాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న రవితేజ తన పర్ఫామెన్స్‌తో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టాడు. 2002లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిట్‌తో రవితేజ తన సినీ ప్రస్థానానికి రాచమార్గం వేసుకున్నాడు.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
ఈ సినిమా స్టోరీని కూడా మొదట పవన్ కళ్యాణ్‌కు వినిపించాడు పూరి జగన్నాథ్. అయితే ఎందుకనో పవన్ ఈ సినిమాకు సైతం నో చెప్పాడు. దీంతో మళ్లీ ఈ కథతో పూరి రవితేజతో కలిసి హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్‌తో రవితేజ స్టార్ హిరోగా మారిపోయాడు.
అతడు
అతడు సినిమా కథను తొలుత పవన్ కళ్యాణ్‌కు వినిపించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. పలు ఇంటర్వ్యూల్లోనూ ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కథకు పవన్ నో చెప్పటంతో మహేష్ దగ్గరకు వెళ్ళింది. 2005 లో విడుదల అయినా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మహేష్ నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
పోకిరి
మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికి తెలిసిన విషయమే. ఈ స్టోరీని పవన్ చేయాలనుకున్నా ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదు. దీంతో ఈ కథను పూరి.. మహేష్ దగ్గరికి తీసుకెళ్లాడు. 2006లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్రకు మొదట పవన్ కళ్యాణ్‌ని అడిగారు. కానీ పవన్ తిరస్కరించడంతో స్టోరీ మహేష్ దగ్గరకు వెళ్లింది. వెంటనే ఆయన ఓకే చెప్పేశారు. 2013లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
వీటితో పాటు గోపిచంద్ నటించిన గోలిమార్ సినిమా, రవితేజ నటించిన మిరపకాయ్, రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాల కథలు తొలుత పవన్ కళ్యాణ్ తలుపు తట్టినవే అని ఇండస్ట్రీలో టాక్.