హైదరాబాద్‌లో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాన నీరు రోడ్లపైకి రావడంతో పలు చోట్ల పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఉదయం 8 గంటల నుంచి హైదరాబాద్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు వానలో తడుస్తూ ఇబ్బంది పడ్డారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యేవరకు వర్షంలో తడుస్తూ కాలం వెల్లదిశారు.
పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వెళ్లే రూట్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సికింద్రాబాద్ నుంచి బేగంపేట మార్గంలోనూ హెవీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ క్లియర్ కాక వాహనదారులు నరకం చూస్తున్నారు. KPHB- JNTUH, లింగంపల్లి నుంచి లక్డీకాపూల్ రూట్స్ వద్ద 5 కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ స్ట్రక్ అయ్యాయి. దీంతో చాలా మంది ఆఫీస్‌లకు లేటుగా వెళ్లారు. ఇంకా వర్షం కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది.
భారీ కురుస్తున్న వర్షాలతో మూసి నదిలోకి వరద ఉధృతి పెరిగింది. మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకుగాను 644 అడుగులమేర వరదనీరు చేరింది. అటు నాగార్జునసాగర్ లో 590 అడుగులకు ప్రస్తుతం 525 అడుగుల మేర నీటిమట్టం ఉంది.
మరో మూడు రోజులు..
అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, పెద్దపెల్లి, మంచిర్యాల, కుమురంబీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో పలు చోట్ల వానలు పడ్డాయి.
అత్యధిక వర్షపాతం
హైదరాబాద్‌లో గత 24 గంటల్లో పలుప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మియాపూర్ అత్యధికంగా 46.3 మి.మీ వర్షపాతం రికార్డైంది. లంగర్‌హౌస్‌లో 41 మి.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణలో అతిభారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ట్రాఫిక్ పోలీసుల కష్టాలు
మరోవైపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్లపై ఉన్న గుంతలను ట్రాఫిక్ సిబ్బంది సరిచేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు.
హైదరాబాద్‌లో రోడ్ల అద్వాన స్థితిపై పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. రోడ్లను బాగు చేయండంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వం సూచనలు
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పౌరులకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, కలరా, మలేరియా, సీజనల్ ఫ్లూ, వంటి ప్రబలకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు సూచించింది.
1. వర్షంలో తడిస్తే పూర్తిగా తుడుచుకుని వేడి పదార్థాలను మాత్రమే సేవించాలి.
2. రోజు తీసుకునే ఆహారంలో సీ&డీ విటమిన్లు ఉండేలా చూసుకోవాలి.
3. బయటకెళ్లేటప్పుడు రేయిన్ కోట్, గొడుగు వెంట ఉంచుకోవాలి.
4. ఇళ్లల్లో మురుగు నీరు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
5. ఎల్లప్పుడు తగిన మొత్తంలో శుద్ధమైన నీటిని సేవించాలి.