క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ (IPL 2024) మెగా సమరం సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న 17వ సీజన్ కోసం అన్ని జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. టైటిలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని జట్లకు కొత్త సారథులు వచ్చారు. అయితే కొంతమంది స్టార్ ప్లేయర్లు వివిధ కారణాల వల్ల సీజన్ మెుత్తానికి దూరమవుతున్నారు. మరికొందరు పాక్షికంగా కొన్ని ఆటలకు అందుబాటులో ఉండటం లేదు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
మహ్మద్ షమీ (Mohammed Shami)
ఐపీఎల్‌లో ‘గుజరాత్ టైటాన్స్’ (Gujarat Titans) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా స్టార్ పేసర్ షమీ.. మోకాలు గాయం కారణంగా సీజన్ మెుత్తానికి దూరమవుతున్నాడు. ఇటీవల లండన్‌లో షమీ మోకాలుకు శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
మార్క్ వుడ్ (Mark Wood)
ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్.. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. ఇది అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)ను షాక్‌కి గురిచేసింది. పని ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో ఐపీఎల్‌కు దూరమవుతున్నట్లు మార్క్ వుడ్ స్పష్టం చేశాడు.
మ్యాథ్యు వేడ్ (Matthew Wade)
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మ్యాథ్యు వేడ్.. ఈ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఆడే ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఫైనల్‌లో అతడు ఆడాల్సి ఉండటంతో అతడు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు.
ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna)
టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ సైతం ఈ సీజన్‌లో ఆటడం లేదు. ఐపీఎల్‌లో ‘రాజస్థాన్ రాయల్స్’ (Rajasthan Royals)కు కీలక బౌలర్‌గా ఉన్న అతడు.. మోకాలు గాయం కారణంగా టీర్నోకి దూరమయ్యాడు. రంజీల్లో ఆడుతూ ఇటీవల గాయపడటంతో ప్రస్తుతం ప్రసిద్ధ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
జేసన్ రాయ్ (Jason Roy)
కోల్‌కత్తా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) కీలక ప్లేయర్ జేసన్ రాయ్.. ఈ ఐపీఎల్‌లో ఆడబోనని వెల్లడించాడు. వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ ఇంగ్లాండ్ ఓపేనర్ స్పష్టం చేశాడు. జట్టులో కీలక బ్యాటర్‌గా ఉన్న జేసన్ రాయ్ దూరం కావడం.. KKR ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది.
గస్ అట్కిన్సన్ (Gus Atkinson)
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ కూడా ఈ ఐపీఎల్‌లో ఆడటం లేదు. అతడు కూడా కోలకత్తా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పని ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో ఐపీఎల్ ఆడకూడదని నిర్ణయించినట్లు అట్కిన్సన్ ఇటీవల ప్రకటించాడు.
డెవాన్ కాన్వే (Devon Conway)
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే కూడా ఈ మెుత్తం సీజన్‌కు దూరం కానున్నాడు. ఇటీవల కాన్వే వేలికి గాయం కావడంతో శస్త్ర చికిత్స చేశారు. దీంతో టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు కాన్వే.