నటీనటులు: కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు
దర్శకత్వం: రాజు మురుగన్
ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు: S.R ప్రభు, S.R ప్రకాష్ బాబు
విడుదల తేదీ: నవంబర్ 10, 2023
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న తమిళ నటుల్లో హీరో కార్తీ (Karthi) ఒకరు. స్టార్ హీరో సూర్య సోదరుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే కార్తీ నుంచి ఏ సినిమా వచ్చిన తెలుగులో భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కార్తీ కొత్త సినిమా ‘జపాన్’ (Japan) ఇవాళ (నవంబర్ 10) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ప్రమోషనల్ చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. మరి దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కార్తీ చేసిన కొత్త ప్రయత్నం ఫలించిందా? ఇంతకీ సినిమా హిట్టా? ఫట్టా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు, ఆభరణాలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అందరూ అనుమానిస్తారు. శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్) ఇద్దరి నేతృత్వంలోని రెండు బృందాలు జపాన్ కోసం వేట మొదలు పెడతాయి. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. దోచుకున్న డబ్బులతో సినిమాలు తీసిన జపాన్.. స్టార్ హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఆమెను కలుసుకునేందుకు వెళ్లిన జపాన్‌ను పోలీసులు పట్టుకుంటారు. అయితే తాను దొంగతనం చేయలేదని చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడతారు. జపాన్ కాకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా జపాన్ యాస పలకడం కోసం ఆయన శ్రమించారు. హెయిర్ స్టైల్, డ్రసింగ్ స్టైల్ ఛేంజ్ చేశారు. కార్తీ యాక్టింగ్ & ఎఫర్ట్స్ వరకు ఎటువంటి లోపం లేదు. తన పాత్ర వరకు ఆయన న్యాయం చేశారు. హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్ యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ లేదు. గ్లామర్ సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితమైంది. ఇక సునీల్ తన నటనతో సూపర్ అనిపించాడు. తన లుక్, గెటప్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు. ఆయన కోసమే అన్నట్లు మధ్యలో కామెడీ సీన్లు కూడా ఉన్నాయి. భవాని పాత్రలో విజయ్ మిల్టన్ యాక్టింగ్ ఓకే. కెఎస్ రవికుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు రాజు మురుగన్ ఓ దొంగ చుట్టూ అల్లుకొన్న సింగిల్ పాయింట్ స్టోరీని ఎమోషనల్‌గా మార్చడంలో విఫలమయ్యారు. జపాన్ క్యారెక్టర్‌పై పెట్టిన శ్రద్ద కథపై, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లపై పెట్టలేదనే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలను, క్లారిటీ లేని క్యారెక్టర్లను సాగదీస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే కార్తీ కోసం రాసుకొన్న డైలాగ్స్, కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల పరంగా చూసినా ‘జపాన్’ ఆకట్టుకోవడం కష్టం. సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్, లో లైట్ ప్యాట్రన్స్ ఫాలో అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు. నేపథ్య సంగీతం అంతంతమాత్రంగానే ఉంది. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అనుకున్నవి ఏవీ వర్కవుట్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
- కార్తీ నటన
- కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్
- సాగదీత సీన్లు
- సంగీతం
- సినిమాటోగ్రఫీ
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం