తమిళ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi)కి కోలీవుడ్ (Kollywood)తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. దీనిపై తాజాగా ఆయన భార్య ఆర్తి స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. జయం రవి తరహాలోనే సోషల్ మీడియాలో స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు.
‘నా అనుమతి తీసుకోలేదు’
సినీ నటుడు జయం రవి విడాకులు అంశంపై అతడి భార్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు తెలియకుండానే తన భర్త విడాకుల ప్రకటన చేశారని ఆరోపించారు. అతడి బహిరంగ ప్రకటన చూసి షాక్‌కు గురైనట్లు చెప్పారు. ఈ మేరకు ప్రత్యేక నోట్‌ను రిలీజ్ చేశారు. ‘నాకు తెలియకుండానే నా అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో బాధపడ్డాను. 18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించింది. కొంతకాలంగా మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా. దురదృష్టవశాత్తూ నాకు ఆ అవకాశం దక్కలేదు’ అని ఆర్తి రాసుకొచ్చారు.
‘అన్యాయంగా నాపై నిందలు’
జయం రవి చేసిన విడాకుల ప్రకటనతో తనతోపాటు తన పిల్లలు సైతం షాక్‌కు గురైనట్లు అతడి భార్య ఆర్తి అన్నారు. ‘ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు ఏమాత్రం మంచి జరగదు. బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలని భావిస్తున్నా. అందుకే పబ్లిక్‌గా కామెంట్ చేయడం లేదు. అన్యాయంగా నాపై నిందలు వేసి నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉంది. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల శ్రేయస్సే. ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను నమ్ముతున్నా. ఇన్ని రోజులుగా మాకు మద్దతు ఇచ్చిన ప్రెస్, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆర్తి (Aarti) పేర్కొన్నారు.
ఇష్టపూర్వకంగానే విడాకులు: జయం రవి
నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. ఈ విషయంపై రూమర్స్, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని జయం రవి పేర్కొన్నారు.
తారా స్థాయికి గొడవలు!
2009 జూన్‌లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రీమేక్‌తో స్టార్‌గా గుర్తింపు
1993లో వచ్చిన ‘బావ బామ్మర్ది’,’పల్నాటి పౌరుషం’ (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్ ఫిల్మ్. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’ చిత్రాల్లో టైటిల్ రోల్ పోషించి పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.