పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ చిత్రం గురువారం (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్ ఇప్పటికే విడుదలవ్వగా.. వాటికి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో పాటు కుర్ర హీరోలు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సైతం నటిస్తున్నారని గత కొంత కాలంగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇది నూటికి నూరు శాతం నిజమని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించారు.
వీడియో వైరల్..!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి చిత్రం.. రేపు (జూన్ 27) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ పేర్లను ప్రస్తావిస్తూ.. కల్కిలో భాగమైనందుకు ధన్యవాదాలు చెప్పారు. అటు ప్రభాస్ సైతం వారు సినిమాలో అతిథి పాత్రలు పోషించినందుకు థ్యాంక్స్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ క్యామియోతో కల్కి థియేటర్లు బద్దలవుతాయని రౌడీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ పాత్ర అదేనా?
తాజాగా కల్కి రెండో ట్రైలర్ రిలీజ్ కాగా.. అందులో విజయ్ దేవరకొండను చూపకనే చూపించారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైలర్‌లో మహాభారత సంగ్రామం సీక్వెన్స్‌ను కొద్దిసేపు చూపించారు. ఇందులో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అర్జునుడితో తలపడ్డారు. అయితే అర్జునుడి పాత్ర ముఖాన్ని స్పష్టంగా చూపించలేదు. దీంతో అది విజయ్ కావొచ్చని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా విజయ్ ఉన్నట్లు స్పష్టం చేయడంతో తమ హీరో అర్జునుడిగా కనిపించడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ప్రశ్నకు జూన్ 27న క్లారిటీ వచ్చే అవకాశముంది.
సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా?
కల్కి సినిమాకు సంబంధించి లేటెస్ట్ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి వీఎఫ్‍ఎక్స్‌లో ఎన్టీఆర్ పాత్రను ఈ చిత్రంలో మేకర్స్ చూపించనున్నారని తెలుస్తోంది. శ్రీకృష్ణుడి పాత్రను ఎన్టీఆర్ చాలా సినిమాల్లో చేశారు. కృష్ణుడు అంటేనే తెలుగు వారికి ఆయనే గుర్తు వస్తారు. శ్రీకృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ ఉన్న విగ్రహాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ఎన్టీఆర్ ఉండాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది.
విశ్వామిత్రునిగా రాజమౌళి?
కల్కి చిత్రంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) కూడా ఓ కీలక పాత్ర పోషించినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే ఆయన విశ్వామిత్రుని పాత్రలో కనిపిస్తారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలోని కీలక సన్నివేశంలో రాజమౌళి పాత్ర తెరపైకి వస్తుందని అంటున్నారు. రెండు నుంచి మూడు నిమిషాల నిడివి లోపే రాజమౌళి పాత్ర ముగుస్తుందని సమాచారం. మరోవైపు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ నుంచి కూడా ఓ క్యామియో ఉంటుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆర్‌జీవీ పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చెబుతున్నారు. కల్కి కోసం ఆర్జీవీ ఫస్ట్ టైమ్ యాక్టర్‌గా మారడం గమనార్హం.