Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?

    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?

    November 17, 2023

    నటీనటులు: పాయల్‌ రాజ్‌పూత్‌, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్‌ అమిర్‌, రవీంద్ర విజయ్‌, కృష్ణ చైతన్య, అజయ్‌ ఘోష్‌ తదితరులు

    దర్శకత్వం: అజయ్‌ భూపతి

    సంగీతం: అజనీష్ లోకనాథ్‌

    ఎడిటింగ్‌: మాధవ్‌ కుమార్‌ గుళ్లపల్లి

    సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి

    నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ

    విడుదల: 17-11-2023

    ‘RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమాతోనే న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. తిరిగి వారి కాంబోలోనే తేరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘మంగళవారం’. డార్క్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల రిలీజైన టీజ‌ర్, ట్రైలర్లు ఈ ఆస‌క్తిని మరింత పెంచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మ‌రి ఈ మంగ‌ళ‌వారం క‌థేంటి? తెర‌పై ఎలాంటి వినోదాన్ని పంచింది? పాయ‌ల్- అజ‌య్‌ల‌కు విజ‌యాన్ని అందించిందా? ఈ కథనంలో చూద్దాం. 

    కథ

    మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్ర‌జ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. మంగళవారం రోజునే ఈ మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామ‌దేవ‌త మాల‌చ్చ‌మ్మ జాత‌ర జ‌రిపించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఊరి ప్ర‌జ‌లు భావిస్తారు. అయితే ఈ మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్ వెనుక ఏదో కుట్ర ఉంద‌ని ఎస్ఐ (నందితాశ్వేత‌) భావిస్తుంది. కానీ, ఊరి జ‌మీందారు ప్ర‌కాశం (చైత‌న్య కృష్ణ‌) మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఇమె ఇన్వేస్టిగేష‌న్‌కు ఎవ‌రూ స‌రిగా స‌హ‌క‌రించ‌రు. మరి ఆ హ‌త్య‌ల‌కు వెనుక ఉన్న మ‌ర్మం ఏమిటి? దెయ్యం రూపంలో శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌) తిరుగుతోంద‌ని ఊరి ప్ర‌జ‌లు ఎందుకు భ్ర‌మ‌ప‌డ్డారు? ఈ హ‌త్య‌ల‌కు శైలుకు సంబంధం ఉందా? మ‌హాల‌క్ష్మీపురం నుంచి ఆమె వెలివేయ‌బ‌డ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న‌దే మంగ‌ళ‌వారం సినిమా క‌థ‌.

    ఎలా సాగిందంటే?

    సినిమాలో తొలి 15 నిమిషాలు శైలు చిన్న‌త‌నం, రవితో ఆమె ప్రేమకథ, అతడి కుటుంబ నేపథ్యం చుట్టూ సాగుతుంది. ఆ త‌ర్వాత క‌థ వ‌ర్త‌మానంలోకి వ‌స్తుంది. జంట‌ల పేర్లు ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తి ఊరి గోడ‌ల‌పై రాయడం.. వారంతా గ్రామ దేవ‌త‌కు ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజునే చనిపోవడం తొలి భాగంలో చూపిస్తారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు తొలి భాగంలో థ్రిల్‌ ఇస్తాయి. ద్వితీయార్ధం మ‌ళ్లీ శైలు గ‌తంతోనే మొద‌ల‌వుతుంది. శైలుకు జ‌రిగిన అన్యాయం, ఆమెకున్న మాన‌సిక రుగ్మ‌త, దానివ‌ల్ల త‌ను ప‌డే యాత‌న రెండో పార్ట్‌లో చూపించారు. ప‌తాక స‌న్నివేశాలు మంచి ట్విస్ట్‌ల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. 

    ఎవరెలా చేశారంటే?

    శైలు పాత్ర‌లో పాయ‌ల్ చ‌క్క‌గా ఒదిగిపోయింది. గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌లోనూ అదరగొట్టింది. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో చ‌క్క‌గా జీవించింది. ఎస్సై పాత్ర‌లో నందితా శ్వేత ఆద్యంతం సీరియ‌స్ లుక్‌లో క‌నిపించింది. న‌ట‌న ప‌రంగా ఆమెకు పెద్ద‌గా స్కోప్‌ లేదు. అజ‌య్ ఘోష్ – ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ  ట్రాక్ న‌వ్వులు పూయిస్తుంది. జ‌మిందారుగా చైత‌న్య కృష్ణ పాత్ర‌ను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, ర‌వీంద్ర విజ‌య్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే?

    దర్శకుడు అజయ్‌ ఈ సినిమాను మిస్టీక్‌ థ్రిల్లర్‌లా మెుదలుపెట్టి మధ్యలో హారర్‌ టచ్‌ ఇచ్చి ఆఖర్లో ఓ సందేశంతో ముగించారు. అక్ర‌మ సంబంధాల వ్య‌వహారం, డబల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో అజయ్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. మరోవైపు ప్రథమార్థంలో కథే కనిపించకపోవడం, ద్వితియాతార్థంలో పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం అతడి డైరెక్షన్‌లో మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్‌ సినిమాని ముగించిన తీరు ఆడియన్స్‌కు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా అజ‌య్ రాసుకున్న క‌థ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌క‌పోవ‌చ్చు. కానీ థ్రిల్లింగ్‌ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది.

    టెక్నికల్‌గా 

    టెక్నిక‌ల్‌గా ఈ సినిమా ఉన్న‌త స్థాయిలో క‌నిపిస్తుంది. అజ‌నీష్ నేప‌థ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాట‌ను స్వ‌ర‌ప‌రిచిన తీరు.. దాన్ని తెర‌పై చిత్రీక‌రించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్ర‌హ‌ణం మ‌రో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • పాయ‌ల్ న‌ట‌న‌, గ్లామ‌ర్‌
    • అజ‌నీష్ సంగీతం
    • ట్విస్ట్‌లు

    మైనస్‌ పాయింట్స్‌

    •  నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం
    •  ముగింపు

    రేటింగ్‌ : 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version