నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి మూడో తరం వారసుడ్ని వెండితెరపై చూసుకునేందుకు కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ తెరంగేట్రానికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అప్‌డేట్స్ బయటకొచ్చాయి. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్ల తమ ఎదురుచూపులకు సరైన ఫలితం దక్కబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మోక్షజ్ఞ కోసం స్పెషల్ పోస్ట్!
‘హనుమాన్’తో టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఆకర్షించారు. మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రాన్ని అతడే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్ నీల్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్ పెట్టిన ప్రశాంత్ వర్మ ‘నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్ కమింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్ ఈ పోస్ట్ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ పెట్టిన మరో పోస్ట్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఒక ఫొటో షేర్ చేస్తూ ‘ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నా’ అని రాశారు. ఇది కూడా మోక్షజ్ఞ సినిమా కోసం పెట్టిన పోస్టు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ముహోర్తం ఫిక్స్..!
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి పూజా వేడుక డేట్ ఖరారైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 6న ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు నందమూరి బాలకృష్ణ నిర్ణయించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మెుదలైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం మరో మూడు రోజుల్లో వస్తుండటంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
శ్రీకృష్ణుడిగా బాలయ్య!
మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని, చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్ జోడీ మరో ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మోక్షజ్ఞ లుక్స్ వైరల్..
నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైన వేళ ఇటీవల ఆయన ఫొటోలు కూడా వైరలయ్యాయి. ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో అవి తెగ వైరల్ అవుతోన్నాయి. దీంతో త్వరలోనే ఈ నందమూరి వారసుడు తెరపై సందడి చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.