నందమూరి కుటుంబం నుంచి ప్రస్తుత స్టార్ హీరోలు అనగానే ముందుగా బాలకృష్ణ (Balakrishna), జూ.ఎన్టీఆర్ (Jr.NTR)లే గుర్తుకువస్తారు. నందమూరి నట వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బాబాయ్, అబ్బాయ్ తమకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబును జైల్లో పెట్టినా తారక్ స్పందించకపోవడం, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా ఉండటం, ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ ప్లెక్సీలను తీసేయాలని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా మరోమారు నందమూరి కుటుంబానికి – తారక్ మధ్య ఉన్న విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తారక్‌కు అందని ఆహ్వానం!
నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆగస్టు 30తో 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినీ పరిశ్రమ తరఫున ప్రముఖులంతా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుతున్నారు. సెప్టెంబరు ఒకటోతేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు చిరంజీవి (Chiranjeevi), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అల్లు అర్జున్, అల్లు అరవింద్‌కు కూడా ఇన్విటేషన్స్ వెళ్లాయి. అయితే నందమూరి ఫ్యామిలీకి చెందిన జూ.ఎన్టీఆర్‌ను మాత్రం ఈవెంట్ నిర్వాహకులు ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram)కు సైతం ఇన్విటేషన్ ఇవ్వలేదని టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో బాలకృష్ణ, తారక్ మధ్య ఉన్న మనస్పర్థలు మరోమారు తెరపైకి వచ్చాయని అంటున్నారు. బాలయ్య సూచన మేరకే నిర్వాహకులు వారిద్దరిని ఆహ్వానించలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో బాలయ్య-తారక్ మధ్య రాజుకున్న వివాదం ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.
విభేదాలకు కారణాలు ఇవేనా..!
వై.ఎస్. జగన్ నేతృత్వంలోని గత ఏపీ ప్రభుత్వం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. బాలకృష్ణ వియ్యంకుడైన చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ఏకంగా 50 రోజుల పాటు జైలులో పెట్టింది. దీనిపై నందమూరి కుటుంబం పెద్ద ఎత్తున చంద్రబాబు ఫ్యామిలీకి అండగా నిలిచింది. జగన్ ప్రతీకార రాజకీయం చేస్తున్నాడంటూ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇంత జరుగుతున్నా తారక్ మాత్రం అప్పట్లో దీనిపై పల్లెత్తు మాట కూడా అనలేదు. కనీసం ట్విటర్ వేదికగా ఈ అరెస్టును ఖండిస్తున్నట్లు పోస్టు సైతం పెట్టలేదు. తారక్ మౌనంగా ఉండటం సరికాదంటూ టీడీపీ క్యాడర్, తెలుగు దేశం సోషల్ మీడియా విభాగం సూచిస్తున్న ఆయన పట్టించుకోలేదు. దీంతో బాలయ్య తీవ్ర అసహనానికి లోనైనట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కంట్రోల్ చేయని తారక్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తారక్‌కు అత్యంత సన్నిహితులు. నాని, వంశీ పలు సందర్భాల్లో ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో వారు ఇరువురు చంద్రబాబు, అతడి కుమారుడు నారా లోకేష్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. బాలకృష్ణపై కూడా అవాకులు, చవాకులు పేల్చారు. ఒక దశలో చంద్రబాబు భార్య, బాలకృష్ణ సోదరి అయిన నారా భువనేశ్వరి క్యారెక్టర్‌ను తప్పుబడుతూ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై చంద్రబాబు సైతం మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. అటువంటి సమయంలో తనకు అత్యంత సన్నిహితులైన వంశీ, నానిని తారక్ నియంత్రించలేదని విమర్శలు వచ్చాయి. ప్రారంభంలోనే వారిని తారక్ మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.
తారక్ మౌనానికి కారణం అదేనా?
2009 ఎలక్షన్స్ ముందు వరకూ తారక్ టీడీపీ తరపున చాలా చురుగ్గా వ్యవహరించాడు. ఎన్నికల్లో పార్టీ తరపున సుడిగాలి పర్యటన చేసి తన ప్రచారంతో శ్రేణులను హోరెత్తించారు. అయితే ఆ ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో తారక్‌ను చంద్రబాబు పక్కనే పెట్టేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ దృష్ట్యా 2014 నుంచి పార్టీ వ్యవహారాలకు తారక్‌ను దూరంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటివరకూ పార్టీ అవసరాలకు వినియోగించుకొని ఒక్కసారిగా పక్కనపెట్టేయడం తారక్‌ను తీవ్రంగా బాధించిందని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?