నొవాక్ జకోవిచ్.. టెన్నిస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న సెర్బియా ఆటగాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ని గెలిచి అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన ఆటగాడిగా జకోవిచ్(23) రికార్డు సృష్టించాడు. స్పెయిన్ గన్ రఫేల్ నాదల్(22) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును అధిగమించి ఏకైక మొనగాడిగా నిలిచాడు.
పారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచులో కాస్పర్ రూడ్‌పై గెలిచిన జకో కెరీర్లో మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ని కైవసం చేసుకున్నాడు.
టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలో కనీసం 3 టైటిళ్లను గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా జకోవిచ్ నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 10, వింబుల్డన్ 7, యుఎస్ ఓపెన్ 3, ఫ్రెంచ్ ఓపెన్ 3 సార్లు గెలుచుకున్నాడు.
2008కు ముందు టెన్నిస్ అంటే గుర్తుకొచ్చేది రఫేల్ నాదల్, రోజర్ ఫెదరర్. టెన్నిస్ ఆటలో వీరిద్దరిదే ఆధిపత్యం. అలాంటి సమయంలో వచ్చాడు జకోవిచ్ టైటిళ్ల వేటకి. 20 ఏళ్లకే తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ని గెలుచుకున్నాడు.
2011 వరకు జకోవిచ్ మళ్ళీ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. వరుసగా ఓటములు ఎదురయ్యాయి. అప్పటికే రోజర్, నాదల్ దూసుకెళ్తున్నారు. రోజర్ ఖాతాలో 16, నాదల్ 9 గ్రాండ్‌స్లామ్‌లు గెల్చుకున్నారు.
2011 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో తిరిగి ఖాతా తెరిచాడు జకోవిచ్. అదే ఏడాది వింబుల్డన్ ఫైనల్లో నాదల్‌ని ఓడించి మూడో గ్రాండ్‌స్లామ్‌ని చేజిక్కించుకున్నాడు. ఇలా నాదల్‌ని ఓడించిన రెండో ఆటగాడిగా జకో నిలిచాడు.
రోజర్ ఫెదరర్‌పై తొలిసారి టైటిల్ నెగ్గింది 2014 వింబుల్డన్‌లో. ఆ తర్వాత మరో మూడు సార్లు ఫెదరర్‌పై పైచేయి సాధించాడు. 2018 నాటికి మొత్తంగా జకోవిచ్ 12 ట్రోఫీలు సాధించాడు.
ఐదేళ్లలోనే జకోవిచ్ అద్భుతంగా పుంజుకున్నాడు. ఆడిన 19 గ్రాండ్‌స్లామ్‌లలో జకోవిచ్ ఏకంగా 11 టైటిళ్లు గెలిచాడు. ఈ సంఖ్యను బట్టే జకో ఫామ్ ఎలా ఉందో చెప్పొచ్చు.
2016 నుంచి 2018 మధ్య కాలంలో జకోవిచ్ ప్రదర్శన తేలిపోయింది. కుడి మోచేతి గాయం కారణంగా రాణించలేకపోయాడు. కానీ, శస్త్రచికిత్స చేసుకుని మళ్ళీ కోర్టులో అడుగు పెట్టాడు.
కోర్టులోనే కాక కోర్టు బయట జకోవిచ్ ప్రత్యేకమే. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా 2021లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ని నిర్వహకులు జకోని ఆడనివ్వలేదు. అలా అని జకో వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ టీకా వేసుకోలేదు.
జకోవిచ్ లిఖించిన చరిత్రను అందుకోవడం ఏ ఆటగాడికైనా కష్టతరమే. నాదల్(22) ఒక్కడే జకోకి చేరువలో ఉన్నాడు. కానీ, గాయాలతో సతమతమవుతున్న స్పెయిన్ గన్ మరో గ్రాండ్‌స్లామ్ సాధిస్తాడా? అన్నది ప్రశ్నార్థకమే.
చరిత్ర సృష్టించి, రికార్డులు తిరగరాయాలన్న ధ్యేయమే తనకు స్ఫూర్తినిస్తుందని జకో చెప్తుంటాడు. తన సక్సెస్‌కి అదొక కారణమని 36 ఏళ్ల సెర్బియా ఆటగాడు గతంలో చెప్పాడు.