దేశంలో స్మార్ట్‌వాచ్‌ల వినియోగం నానాటికి విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత డిజిటల్ వాచ్‌లపై ఆసక్తి కనబరుస్తున్నారు. వాటిని ధరించడం స్టైల్‌గా భావిస్తున్నారు. ఇది గమనించిన ప్రముఖ టెక్ కంపెనీలు అధునిక ఫీచర్లతో వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) అత్యాధునిక స్మార్ట్‌వాచ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘OnePlus Watch 2’ పేరుతో ఫిబ్రవరి 26న ఈ వాచ్ రిలీజ్ కానుంది. 2021 మార్చిలో వచ్చిన వన్‌ప్లస్ వాచ్ (OnePlus Watch)కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా దీన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వాచ్‌కు సంబంధించిన ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుకేద్దాం.
పోస్టర్ రిలీజ్
OnePlus Watch 2 వాచ్‌కు సంబంధించిన పోస్టర్‌ను కంపెనీ తన అధికారిక కమ్యూనిటీ ఫోరమ్‌లో షేర్ చేసింది. ఇందులో వాచ్ రౌండ్ షేప్ లుక్‌లో.. కుడి భాగాన రెండు బటన్స్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించింది.
వాచ్ స్క్రీన్
ఈ నయా వన్‌ప్లస్ వాచ్ 2.. 1.43 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ W5 Gen 1 ప్రాసెసర్‌తో రానుంది. ఈ స్మార్ట్‌వాచ్ WearOS 3 లేదా WearOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వర్క్ చేయనుందని సమాచారం.
వాట్సప్ సపోర్ట్
OnePlus Watch 2 స్మార్ట్‌వాచ్ వాట్సప్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అలాగే గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే, పలు యాప్‌లను ఈ వాచ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చని సమాచారం.
బ్యాటరీ లైఫ్
ఈ స్మార్ట్‌వాచ్ 405mAh బ్యాటరీతో రానున్నట్లు వన్‌ప్లస్ వర్గాలు తెలిపాయి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుందని పేర్కొన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చని అంటున్నారు. .
హెల్త్ సెన్సార్లు
ఈ పరికరం అన్ని ఆరోగ్య సెన్సార్లతోపాటు స్పోర్ట్స్ మోడ్‌లో కూడా పనిచేస్తుందని టెక్ వర్గాలు అంటున్నాయి. దీంతోపాటు SpO2 ట్రాకింగ్, నిద్ర ట్రాకింగ్ తదితర ఫీచర్లు ఈ వన్‌ప్లస్ వాచ్ 2లో ఉండనున్నాయి.
వాటర్ రెసిస్టెన్స్
ఈ నయా వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్.. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్, 5ATM వాటర్ రెసిస్టెన్స్ కలిగిన IP68 రేటింగ్‌తో రానుంది. అలాగే అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్, GPS వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉండనుంది.
కలర్ ఆప్షన్స్
OnePlus Watch 2ను రెండు కలర్ వేరియంట్లలో తీసుకురానున్నట్లు సమాచారం. బ్లాక్ (Black), వైట్ (White) రంగుల్లో దీనిని లాంచ్ చేసే అవకాశముంది.
ధర ఎంతంటే?
ఫిబ్రవరి 26న స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో జరిగే మెుబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) ఈవెంట్‌లో OnePlus Watch 2ను గ్లోబల్ వైడ్‌గా లాంచ్ చేయనున్నారు. ఆ రోజే ఈ స్మార్ట్‌వాచ్ ధరపై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఈ వాచ్ ధర రూ.16,999 వరకూ ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.