అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం మరో ఐదు రోజుల్లో రిలీజ్ కానుంది. దీంతో చిత్ర బృందం వరుసగా మూవీ ప్రమోషన్స్ చేస్తూ సినిమా హైప్ పెంచేస్తోంది. పాట్నా నుంచి మెుదలుకొని చెన్నై, కొచ్చి, ముంబయి ఇలా వరుసగా ప్రమోషన్స్ చేసింది. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ అడ్వాన్స్ బుకింగ్ (Pushpa 2 Advance Bookings) మెుదలయ్యాయి. దీంతో తెలుగు స్టేట్స్‌లో ఎప్పుడు మెుదలవుతాయా? అని తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప టీమ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారు చేసిన విజ్ఞప్తిని మన్నిస్తూ టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది.
‘టికెట్‌కు రూ.800 తీసుకోండి’
పాన్ ఇండియా స్టార్ బన్నీ ‘పుష్ప 2’ మూవీ టికెట్ల రేట్లు (Pushpa 2 Ticket Price) పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన నేపథ్యంలో రెండు బెనిఫిట్ షోలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతించింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గం.లకు తొలి బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి 1 గం.లకు రెండో షో వేసుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాదు ఈ బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ.800 వరకూ పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఫలితంగా బెనిఫిట్ షోలలో ‘పుష్ప 2’ టికెట్స్ రూ.1000కి పైగా పలకనుంది. సింగిల్ స్క్రీన్‌లో రూ.1,121, మల్టీప్లెక్స్ రూ.1,239కి టికెట్స్ విక్రయించనున్నారు.
మిగతా రోజుల్లో..
బెన్‌ఫిట్ షోలతో పాటు మిగిలిన రోజులకు సంబంధించి కూడా టికెట్ పెంపు రేటును (Pushpa 2 Ticket Price) తెలంగాణ సర్కార్ ఫిక్స్ చేసింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్‌లకు సెపరేట్స్ నిర్ణయించింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ వ్యాప్యంగా ఉన్న థియేటర్లలో టికెట్ ధరలు పెరగనున్నాయి. దీని ప్రకారం మెుదటి నాలుగు రోజుల టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.354, మల్టీ ప్లెక్స్‌లో రూ.531గా ఉండనున్నాయి. ఇవాళ (నవంబర్ 30) సా. 4.56 తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్ మెుదలయ్యాయి.
ఏపీలో కష్టమేనా..
టికెట్ల పెంపునకు తెలంగాణతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని సైతం ‘పుష్ప 2’ టీమ్ రిక్వెస్ట్ చేసుకుంది. దీంతో ఏపీ సర్కార్ నుంచి కూడా సోమవారం అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అక్కడ కూడా రెండు బెన్‌ఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్థాయిలో భారీగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందా? లేదా? అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. చెన్నై ఈవెంట్‌లో ‘ఏం పీకలేరు’ అంటూ ఇంగ్లీషులో PK అనే పదాన్ని హైలెట్ చేసిన పోస్టు వైరల్ అయ్యింది. దీంతో పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఉన్న నేపథ్యంలో టికెట్ల రేట్లు స్వల్పంగా పెంచుకునేందుకే అవకాశమిస్తారని అంటున్నారు.
రేపు బిగ్ ఈవెంట్
తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అయితే తెలుగు స్టేట్స్‌లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించలేదు. దీంతో హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్‌ను ‘పుష్ప 2’ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు ఎంతో కీలకమైన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసుల అనుమతి సైతం లభిస్తే డిసెంబర్ 1న సాయంత్రం ఈవెంట్ జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ఫోర్త్ సింగిల్ ‘పీలింగ్స్’ను కూడా రిలీజ్ చేసే అవకాశముంది.