సాధారణంగా సినిమాల్లో మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు వంటి వాటి కారణంగా వచ్చే సమస్యలు పలు సినిమాల్లో కథలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇవి కేవలం తెరపై మాత్రమే కాకుండా, నిజజీవితంలోనూ చాలామంది ప్రముఖుల జీవితాలను ప్రభావితం చేశాయి. ఈ కోవలోకే కోలీవుడ్ నటి రెజీనా కాసాండ్రా జీవిత కథ కూడా వస్తుంది. రెజీనా టాలీవుడ్‌లో “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”, “పిల్ల నువ్వు లేని జీవితం”, సౌఖ్యం వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
రెజీనా తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలోనూ విభిన్నమైన పాత్రలు పోషించి తన ప్రత్యేకతను చూపించారు. ఐటమ్ సాంగ్స్‌లోనూ తన ప్రతిభను చాటిన రెజీనా, ఆచార్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, ఇటీవల కొన్ని వెబ్‌సిరీస్‌లలోనూ ఆమె కనిపించారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విడాముయర్చి చిత్రంలో రెజీనా కీలక పాత్రను పోషిస్తోంది.
ఇస్లాం నుంచి క్రిస్టియన్‌గా
తన కుటుంబ నేపథ్యంపై రెజీనా ఇటీవల ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పుట్టుకతో ఇస్లాం మతస్తురాలైన ఆమె, ఆ తరువాత క్రిస్టియన్ మతాన్ని స్వీకరించినట్లు తెలిపారు. ఆమె తల్లి క్రిస్టియన్ మతానికి చెందిన వారు కాగా, తండ్రి ఇస్లాం మతస్తుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులకు జన్మించిన రెజీనా, తన చిన్నతనంలో ఇస్లాం మత ఆచారాలను అనుసరించిందని చెప్పారు.
అయితే, తన ఆరేళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులు విడిపోయినట్లు రెజీనా వెల్లడించింది. ఆ తరువాత తన తల్లి తిరిగి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి.. రెజీనా పేరుకి ‘కసాండ్రా’ అనే పేరు జోడించారని ఆమె వివరించారు. ఆ తర్వాత బాప్తిజం తీసుకున్న తాను బైబిల్ చదివినట్లు వెల్లడించింది. ఆ విధంగా తన క్రిస్టియన్ జీవితాన్ని కొనసాగించానని పేర్కొంది.
మత సామరస్యం
తన మతానికి సంబంధించి ఎలాంటి కట్టుబాట్లు లేకుండా, చర్చ్, మసీదు, గుడి ఇలా ఎక్కడికైనా వెళతానని రెజీనా తెలిపారు. మతం తన జీవితంపై పెద్దగా ప్రభావం చూపలేదని, తనకు ముఖ్యమైంది మానవత్వం అని పేర్కొన్నారు. ప్రజలకు ఆమె ప్రస్తుతం రెజీనా కసాండ్రా పేరుతో పరిచయం అయినా, వాస్తవానికి తన అసలు పేరు కేవలం ‘రెజీనా’ మాత్రమేనని హాస్యంగా వెల్లడించారు.