దసర సీజన్ దగ్గర పడుతుండటంతో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు వారి సేల్ తేదీలను ప్రకటించాయి. కొన్నిరోజుల్లోనే సేల్ ప్రారంభమవుతుందని తెలిసినందున, చాలా మంది తమకునచ్చిన ఉత్పత్తులను ఇప్పటికే కార్ట్‌లో యాడ్ చేసి ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు. డీల్స్ మొదలవగానే ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సేల్ సమయంలో వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయి. అయితే, కొన్ని ఉత్పత్తుల ధరలను సేల్ ముందు పెంచి, తర్వాత తగ్గించినట్లు చూపించి, తక్కువ ధరకే అమ్ముతున్నట్లు చూపించడం కూడా జరుగుతుంది. దాంతో, కస్టమర్లు తక్కువ ధరకే కొనుగోలు చేశామనుకుని సంతోషిస్తారు. కానీ అసలు ఉత్పత్తి ధర, ఆఫర్ అసలైనదా? కాదా? అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. మరి ఆ ధరల చరిత్రను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ధర చరిత్ర తెలుసుకోవడంలో సహాయపడే యాప్స్:
ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఏ ఉత్పత్తి అయినా వెతుకుతున్నప్పుడు, దాని ప్రైస్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. మీ మొబైల్‌లో ప్రైస్ హిస్టరీ ఆన్‌లైన్ షాపింగ్ యాప్ (Buyhatke)ని డౌన్‌లోడ్ చేసుకుని చూడవచ్చు. ఈ కామర్స్ సైట్‌లో మీరు ఏ ప్రొడక్ట్‌ని పరిశీలిస్తున్నారో, షేర్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ని ఎంచుకోవచ్చు. దాంతో యాప్‌ని తెరవకుండానే పాప్‌అప్ వస్తుంది.
ఆ పాప్‌అప్‌లో మీకు ఆ ప్రొడక్ట్ యొక్క గరిష్ట, కనిష్ఠ ధర, ఎప్పుడెప్పుడు ధరలు తగ్గాయన్న సమాచారంతో పాటు ప్రైస్ చరిత్ర మొత్తం చార్ట్ రూపంలో కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఆ ఉత్పత్తి ధర తగ్గే అవకాశం ఉందా అనే వివరాలు కూడా అందులో తెలియజేయడం జరుగుతుంది.
ఇతర వెబ్‌సైట్‌లు/ఎక్స్‌టెన్షన్లు:
కేవలం యాప్‌లు మాత్రమే కాకుండా, ఇతర వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ఒక ప్రొడక్ట్ ధర చరిత్ర తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, pricehistoryapp.com వెబ్‌సైట్‌లో ఏ ఉత్పత్తి అయినా సులభంగా వెతికేయవచ్చు. మీరు కొనాలనుకున్న ప్రొడక్ట్ లింక్‌ను వెబ్‌సైట్‌లోని సెర్చ్ బార్‌లో పేస్ట్ చేయడం ద్వారా ఆ ఉత్పత్తి ధరలో మార్పులను తెలుసుకోవచ్చు. ఉదాహారణకు శాంసంగ్ వాచ్ 4 ధర ఏడాదిగా తగ్గిందా? పెరిగిందా? అనే అంశాన్ని ఈ కింద ఉన్న ఫోటో ద్వారా విశ్లేషిస్తున్నాం. ముందుగా అమెజాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి అక్కడ స్మార్ట్ వాచ్ లింక్‌ను pricehistoryapp.com సెర్చ్ బార్‌లో పేస్ట్ చేసి విశ్లేషిస్తే ఈ కింది విధంగా ఉంది.
అంతేకాక, Keepa వంటి ఎక్స్‌టెన్షన్లు కూడా చాలా ఉపయోగపడతాయి. అమెజాన్‌లో వస్తువుల ధర చరిత్ర తెలుసుకోవడానికి Keepa ఎక్స్‌టెన్షన్‌ను బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేయవచ్చు. అమెజాన్‌లో ప్రొడక్ట్‌ను ఓపెన్ చేసి స్క్రోల్ చేసినప్పుడు ధర చార్ట్ కనిపిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే PRICE HISTORY అనే ఎక్స్‌టెన్షన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా కూడా సులభంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఉత్పత్తుల ధరలను తెలుసుకోవచ్చు.
ఈ ఎక్స్‌టెన్షన్లు, యాప్‌లు, ప్రొడక్ట్‌ల ప్రైస్ చరిత్రను గమనించి సరైన సమయంలో సరైన ధరకు కొనుగోలు చేయడంలో మీకు సహాయపడతాయి.
ఈ సమాచారం మీకు ఉపయోగపడిందనుకుంటే మీ స్నేహితులతో షేర్ చేసి వారికి సహాయపడండి.