పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక. అయితే ఆడ, మగ కలిస్తేనే పెళ్లా? లేదా ఏ ఇద్దరు ఒక్కటైన దానిని వివాహంగా పరిగణించవచ్చా? అనేది ప్రస్తుత కాలంలో తీవ్ర చర్చకు తావిస్తోంది. భారత్ సహా పలు దేశాల్లో ట్రాన్స్‌జెండర్లు, స్వజాతి సంపర్కులు, గేలు తమకు కూడా పెళ్లి చేసుకునే హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమను కూడా సాధారణ పౌరుల్లాగే పరిగణించాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం భారత్‌లో విచారణ దశలో ఉండగా.. మిగిలిన దేశాలు మాత్రం స్వజాతి వివాహాలపై స్పష్టమైన వైఖరితో ఉన్నాయి. కఠిన చట్టాలను అమలు చేస్తూ వాటిని అణిచి వేస్తున్నాయి.
తాజాగా రష్యా ట్రాన్స్‌జెండర్ వివాాహాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. లింగమార్పిడిని సైతం బ్యాన్ చేస్తూ ఆ దేశ ఉభయ సభలు బిల్లును పాస్ చేశాయి. దీనిపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేయడంతో ఆ బిల్లు వెంటనే చట్టరూపం దాల్చింది. రష్యా సంప్రదాయ విలువలను కాపాడటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాస్కో అధికారులు తెలిపారు. పాశ్చాత్య ధోరణికి రష్యా వ్యతిరేకమని స్పష్టం చేశారు. రష్యా ప్రకటనతో స్వజాతి వివాహాల అంశం మరోసారి తెరమీదకి వచ్చింది. గత కొంతకాలంగా వీటిపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో వీటిపై ఏయే దేశాల్లో నిషేధించారు? ఎలాంటి శిక్షలు అమలు అవుతున్నాయి? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
స్వజాతి వివాహాన్ని నిషేధించిన దేశాలు
ఐక్యరాజ్య సమితిలో భాగస్వామ్యంగా ఉన్న 193 దేశాల్లో 64 కంట్రీలు స్వజాతి వివాహాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. గే, స్వజాతి సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు చట్ట విరుద్దంగా నడుచుకుంటే వారికి శిక్షలు విధిస్తున్నాయి.
ఆఫ్రికా ఖండం
ఆఫ్రికాలో 52 దేశాలు ఉండగా వాటిలో 32 స్వజాతి వివాహాలు చట్ట విరుద్దమని ప్రకటించాయి. వీటికి అనుగుణంగా చట్టాన్ని కూడా తీసుకొచ్చాయి. అల్జీరియా, ఈజిప్ట్, ఇథియోపియా, గినియా, కెన్యా, లైబీరియా, లిబియా, మారిషస్, నమీబియా, నైజీరియా, ఉగాండ, జింబాబ్వే, దక్షిణ సూడాన్, తునిషియా వంటి దేశాల్లో Same Sex Marriages పై నిషేధం ఉంది.
ఆసియా
ఆసియాలోని అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, కువైట్, మలేషియా, మాల్దీవులు, మయన్మార్, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, శ్రీలంక, సిరియా, తుర్క్‌మెనిస్తాన్, UAE దేశాల్లో స్వజాతి వివాహలపై నిషేధం అమలవుతోంది.
అమెరికా
అమెరికా పరిధిలోని డొమినికా, గ్రెనడా, గుయానా, జమైకా, సెయింట్ లుసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ వంటి చిన్న దేశాల్లోనూ సేమ్ సెక్స్ వివాహలపై నిషేధం ఉంది.
ద్వీప దేశాలు
ద్వీప దేశాలు కూడా స్వజాతి వివాహలను స్వాగతించడం లేదు. పుపువా, న్యూ గినియా, సమోవా, సోలోమన్ ఐలాండ్స్, టోంగా, తువాలు, కిరిబటి ప్రాంతాల్లో ఈ తరహా వివాహలను అనుమతించబోమని అక్కడి ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి.
స్వజాతి వివాహలపై మరణ శిక్ష
ప్రపంచంలోని పలు దేశాలు స్వజాతి వివాహాలు చేసుకున్న వారికి మరణ దండన విధిస్తున్నాయి. ఖతార్, సౌది అరేబియా, యెమెన్, ఉగాండ, నైజీరియా, ఇరాన్ దేశాలు మరణశిక్షను అమలు చేస్తున్నాయి.
జరిమానా & కొరడా దెబ్బలు
UAE, ఒమన్, మలేషియా, కువైట్, దక్షిణ సుడాన్, మలావి వంటి దేశాలు మరణ శిక్ష విధించనప్పటికీ స్వజాతి వివాహాలపై కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. భారీ ఎత్తున జరిమానా విధించడం, జైలు శిక్ష వేయడం, కొరడా దెబ్బలు తినిపించడం వంటి శిక్షలను అమలు చేస్తున్నాయి.
నేరంగా పరిగణించని దేశాలు
భారత్, సింగపూర్, అంగోలా, బొత్సవానా వంటి దేశాలు స్వజాతి వివాహాలను గుర్తించలేదు. ఇలా చేయడం నేరపూరితం కాదని ప్రకటించాయి.