నాచురల్ స్టార్ నాని హీరోగా.. సాయి పల్లవి, కృతిశెట్టి, మాడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగ రాయ్. సామాజిక ఇతివృత్తాన్ని కథాంశంగా చేసుకొని టాక్సీవాలా ఫేం డైరెక్టర్ రాహుల్ సంకృతియన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. దేవదాసి వ్యవస్థపై పోరాడిన సింగరాయ్, సినిమాలు తీసి విజయం సాధించాలనుకున్న వాసుదేవ్ పాత్రల్లో నాని ద్విపాత్రాభినయం చేశాడు. అసలు సినిమా కథేంటి..? సాయిపల్లవి, కృతిశెట్టి పాత్రలు ఏంటి..? మూవీ రేటింగ్ తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ రివ్యూ చదివేయండి.
కథేంటి..?
ఏదేని ఒక మంచి హిట్ సినిమా తీసి ఫేం కావాలని వాసుదేవ్(నాని) కలలుకంటాడు. అందుకు అనుగుణంగా కీర్తి(కృతి శెట్టి)ని హీరోయిన్‌గా పెట్టి ‘వర్ణం’ అనే సినిమాను రూపొందిస్తాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని భావిస్తున్న సందర్భంలో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటాడు. 1970నాటి కథను వాసుదేవ్ కాపీ చేశాడంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అది తన సొంతకథ అని రుజువు చేసే ప్రయత్నంలోనే శ్యామ్ సింగ రాయ్ జీవిత గాథ తెరపైకి వస్తుంది.
1970లో కలకతాలో పెనవేసుకున్న ఓ సామాజిక రుగ్మతను రూపుమాపడానికి తెలుగువాడైన శ్యామ్ సింగరాయ్ పోరాటం చేస్తాడు. స్వతహగా కవి అయిన ఇతడు దేవదాసి మైత్రి(సాయి పల్లవి)ని ప్రేమిస్తాడు. ఆమెను వివాహం చేసుకునే సందర్భంలో దేవదాసి వ్యవస్థను అంతమొందించడానికి ఎన్నో ఉద్యమాలు చేస్తాడు. ఇదే కథను వాసుదేవ్ మూవీగా తెరకెక్కిస్తాడు. కాని శ్యామ్ సింగ రాయ్‌కి వాసుదేవ్‌కి మధ్య సంబంధం ఏంటి..? దేవదాసి వ్యవస్థను సింగరాయ్ రూపుమాపాడా..?వాసుదేవ్ న్యాయస్థానం నుంచి గట్టెక్కాడా అన్నది..? తెలుసుకోవాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు..!
నాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్‌గా, వాసుదేవ్‌గా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించాడు. బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకట్టుకునే గెటప్‌తో అదిరిపోయే డైలాగులు చెప్పాడు. సమాజంలో పెనవేసుకున్న దేవదాసి వ్యవస్థపై ఓ ఉద్యమకారుడు ఎలా తిరుగుబాటు చేశాడో డైరెక్టర్ మనకు కళ్లకు కట్టినట్లు చూపించాడు. అలాగే సాయి పల్లవి ఓ భిన్నమైన లుక్‌లో తనపాత్రకు 100 శాతం న్యాయం చేసింది. తన డ్యాన్స్‌తో మరోసారి అభిమానుల మనసు దోచుకుంది. కృతిశెట్టి తన మునుపటి పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నటించి తన నటన ప్రావీణ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంది. ఈ మూవీలో సెబాస్టియన్ పాత్రకు స్కోప్ తక్కువగా ఉన్నప్పటికీ ఆకట్టుకునేలా నటించింది.
బలాలు
- ఇంట్రెస్టింగ్ స్టోరీ
- బెస్ట్ డైరెక్షన్ అండ్ టెక్నికల్ క్రాప్ట్స్
- నాని, సాయి పల్లవి యాక్టింగ్
- మిక్కీ జే మేయర్ మ్యూజిక్, సిరివెన్నెల పాటలు
- చక్కని స్క్రీన్ ప్లే
బలహీనతలు
- కథ నిదానంగా సాగినట్లు అనిపించడం
- క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోకపోవడం
చివరిగా ..
డైరెక్టర్ ప్రతిభకు, నటీనటుల అభినయానికి తార్కాణంగా ఈ సినిమా నిలిచిందని చెప్పొచ్చు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్, సిరివెన్నెల పాటలు, చక్కని స్క్రీన్ ప్లేతో మూవీకి ఓ నిండుదనం వచ్చింది. నటీనటుల గెటప్, ఆకట్టుకునే డైలాగులు, సామాజిక కోణం అంతా ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ కథ కొంచెం నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. ఇంట్రవెల్ సీన్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ క్లైమాక్స్ సీన్ కాస్త పట్టుతప్పిందనే చెప్పొచ్చు. ఓవరాల్‌గా చూస్తే మూవీ ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది.
రేటింగ్ : 3/5
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది