SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!

    SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!

    August 3, 2023

    దక్షిణ భారత దేశంలో జరిగే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా  సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) గుర్తింపు పొందింది. ఏటా జరిగే SIIMA వేడుకల్లో అంతకుముందు ఏడాది వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో SIIMA అవార్డ్స్‌ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లకూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దీంతో టాలీవుడ్‌ నుంచి పలు సూపర్‌హిట్‌ సినిమాలు SIIMA అవార్డ్స్‌కు నామినేషన్స్‌ పంపాయి. ఈ క్రమంలోనే తెలుగు బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో పలు సినిమాలు నామినేట్ కూడా అయ్యాయి. అలాగే తమిళం, మలయాళం, కన్నడ భాష చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    తెలుగు

    టాలీవుడ్‌ నుంచి ఈసారి 5 చిత్రాలు SIIMA అవార్డ్స్‌ రేసులో నిలిచాయి. అందరూ ఊహించినట్లుగానే RRR చిత్రం అత్యధిక నామినేషన్స్‌ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కెమెరామెన్, స్టంట్స్, కొరియోగ్రఫీ, సంగీతం వంటి పలు విభాగాల్లో 11 నామినేషన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సీతారామం (Sita Ramam) సినిమా  సైతం ‘ఉత్తమ చిత్రం’తో పాటు పలు విభాగాల్లో 10 నామినేషన్స్ దక్కించుకుంది. అటు నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2)  మూవీతో పాటు, సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), అడివి శేష్ నటించిన ‘మేజర్’ (Major) మూవీ ఉత్తమ చిత్రం క్యాటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అయితే ఆస్కార్‌ అవార్డు కొల్లగొట్టిన RRR చిత్రం.. SIIMA రేసులో ఉండటంతో క్లీన్‌స్వీప్‌ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 

    తమిళం

    కోలీవుడ్‌ నుంచి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan) మూవీ అత్యధిక నామినేషన్లు సొంతం చేసుకుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 10 నామినేషన్స్ దక్కించుకుంది. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘విక్రమ్’ (Vikram) మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా 9 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అటు మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన ‘రాకెట్రి’ (Rocketry) మూవీతో పాటు, ‘లవ్ టుడే’ (Love Today) మూవీలు ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేషన్స్ నిలిచాయి. అయితే పొన్నియన్ సెల్వన్ -1, విక్రమ్‌ చిత్రాలపై తమిళ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

    కన్నడ

    2022 ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమకు చిరస్మరణీయ విజయాలను అందించింది. ఆ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార, కేజీఎఫ్‌ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఇదిలా ఉంటే ఈ సారి కన్నడ ఇండస్ట్రీ నుంచి నాలుగు చిత్రాలు SIIMA అవార్డ్స్‌ నామినేషన్‌కు ఎంపికయ్యాయి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara), యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రాలు 11 నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కెమెరా వర్క్ విభాగాల్లో రేసులో నిలిచాయి. అటు ‘విక్రాంత్ రోణ’ (Vikranth rona), ‘ఛార్లీ 777’ (Charlie 777) చిత్రాలు సైతం కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిల్లో పోటీపడుతున్నాయి.

    మలయాళం

    మలయాళం నుంచి  ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. మమ్ముట్టి హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ 8 నామినేషన్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. అటు టొవినో థామస్ (Tovino Thomas) హీరోగా చేసిన ‘థల్లుమాల’ (Thallumaala)కు ఏడు నామినేషన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రాల్లో ఏయో చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకుంటారో చూడాలి. వీటితో పాటు హృదయం (Hridayam), జయ జయ జయ జయహే (Jaya Jaya Jaya Jaya Hey),  ‘న్నా తాన్‌ కేస్ కొడు’ (Nna Thaan Case Kodu), జనగణమన (Jana Gana Mana) ఉత్తమ చిత్రం కేటాగిరిలో పోటీ పడుతున్నాయి. కాగా, SIIMA ఈవెంట్ సెప్టెంబర్ 15,16 తేదిల్లో దుబాయ్‌లోని DWTCలో అంగరంగ వైభవంగా జరగనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version