‘యానిమల్’ చిత్రంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్ స్కిల్స్ అందర్నీ మెస్మరైజ్ చేశాయి. అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ యానిమల్ మూవీతో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో తారక్‌ను సందీప్ కలవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించే తారక్‌ను కలిసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వచ్చిన ఓ క్రేజీ బజ్ టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
‘స్పిరిట్’లో విలన్‌గా తారక్?
ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ మూవీలో తారక్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా తారక్‌ను సందీప్ రెడ్డి వంగా కలిసిన నేపథ్యంలో ఈ రూమర్ బయటకొచ్చింది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్ 2’ చిత్రంలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీలో తారక్ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.
ఎక్కడ కలిశారంటే?
సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్ కలవడంపై రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పిరిట్‌లో తారక్ నటిస్తాడా? లేదా? అన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రస్తుతం వీరిద్దరు కలవడానికి ఓ రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 9) వీరు కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం తారక్ ‘దేవర’ ప్రమోషన్స్‌లో కోసం ముంబయికి వెళ్లారు. రేపు (సెప్టెంబర్ 10) అక్కడే దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న సందీప్ రెడ్డి వంగాను తారక్ కలిసినట్లు తెలుస్తోంది. వీరు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటో ఆ విధంగా బయటకు వచ్చిందేనని సమాచారం.
తారక్‌తో స్పెషల్ ఇంటర్యూ!
దేవర ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య క్రేజీ ఇంటర్యూ కూడా జరిగినట్లు బాలీవుడ్‌లో మీడియా కోడై కూస్తోంది. ‘దేవర’ సినిమాకు సంబంధించి తారక్‌ను సందీప్ రెడ్డి వంగా పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. దీనిపై తారక్ అదిరిపోయే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మాస్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ఇద్దరి మధ్య ఇంటర్యూ ఎలా ఉంటుందోనని తారక్, సందీప్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ఇంటర్యూ టెలికాస్ట్ అవుతుందని సమాచారం.
ట్రైలర్ రన్‌టైమ్ ఫిక్స్!
రేపు విడుదల కాబోయే దేవర ట్రైలర్ రన్‌టైమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్ కూడా యాక్షన్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.